National

విజయ్ మాల్యాకు ఊహించని షాక్..!

భారత్ లోని బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి బ్రిటన్ పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు లండన్ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. మాల్యా దివాలా తీసినట్టు అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వున్న మాల్యా ఆస్తులను భారతీయ బ్యాంకులు స్వాధీనం చేసుకోవచ్చు. ఈ మేరకు లండన్ హైకోర్టు న్యాయమూర్తి మైకేల్ బ్రిగ్స్ కీలక తీర్పు వెలువరించారు.

ఈ తీర్పుపై ట్విటర్‌ వేదికగా మాల్యా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బ్యాంకుల నుంచి తాను చేసిన అప్పుకు రెట్టింపు ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుందని మాల్యా ఆరోపించారు. ఈడీకి సొమ్ము తిరిగి ఇవ్వాల్సి వస్తుందన్న భయంతోనే తనను దివాలాదారుగా ప్రకటించమని బ్యాంకులు న్యాయస్థానాన్ని కోరాయని ఆరోపించారు. ప్రభుత్వ బ్యాంకుల నుంచి తాను తీసుకున్న రుణాల మొత్తం రూ.6.2వేల కోట్లని.. ఇందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ రూ.14వేల కోట్ల విలువైన నా ఆస్తులను జప్తు చేసుకుందని అన్నారు. ఈ ఆస్తులను బ్యాంకులకు ఇచ్చింది. ఇందులో కొన్నింటిని విక్రయించిన బ్యాంకులు రూ.9వేల కోట్ల వరకు నగదు రూపంలో రికవరీ చేసుకున్నాయి. మిగతా రూ.5వేల కోట్లను సెక్యూరిటీగా పెట్టుకున్నాయి. ఇప్పుడు ఆ డబ్బును ఈడీకి తిరిగి ఇవ్వాల్సి వస్తుందనే బ్యాంకులు కోర్టుకు వెళ్లాయని.. నన్ను దివాలాదారుగా ప్రకటించేలా చేశాయని మాల్యా ట్విటర్‌లో చెప్పుకొచ్చారు.

కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అంటూ ఒకప్పుడు విజయ్ మాల్యా విలాసవంతమైన జీవితం గడిపాడు. కింగ్ ఫిషర్ బ్రాండ్ తో మద్యం, విమానయాన సంస్థను నెలకొల్పడం.. ఐపీఎల్ లో టీమ్.. ఇలా చాలా వాటితో విజయ్ మాల్యా వార్తల్లో నిలిచాడు. కానీ అతడి పతనం మొదలవ్వడం.. అప్పుల మీద అప్పులు చేసి బ్యాంకులకు రూ.9 వేల కోట్లు ఎగవేసినట్టు ఆరోపణలు రావడంతో విదేశాలకు పారిపోయాడు. రుణాలను మాల్యా కావాలనే ఎగవేసి విదేశాలకు పారిపోయాడని 13 బ్యాంకులతో కూడిన కన్సార్టియం గత కొన్నేళ్లుగా న్యాయపోరాటం చేస్తోంది. లండన్ హైకోర్టు తాజా తీర్పుతో ఎస్బీఐ నేతృత్వంలోని భారతీయ బ్యాంకుల కన్సార్టియంకు రుణాలు రాబట్టుకునేందుకు వీలు కల్పించినట్టయింది. ఇక ఈ కేసులో తాజా తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని మాల్యా న్యాయమూర్తిని కోరగా, ఆ పిటిషన్ ను జడ్జి మైకేల్ బ్రిగ్స్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో విజయ్ మాల్యాకు సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంకు మార్గం సుగమమైంది. మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు సంబంధించిన న్యాయ ప్రక్రియ మొత్తం పూర్తైనట్లు ఇటీవలే కథనాలు వచ్చాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

12 − 2 =

Back to top button