యూకే ప్రధానమంత్రిగా లిజ్ ట్రస్.. రిషికి నిరాశ

0
681

యూకే తదుపరి ప్రధానమంత్రిగా ఆ దేశ విదేశాంగ మంత్రి, కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలు లిజ్ ట్రస్ సోమవారం ఎన్నికయ్యారు. బ్రిటీష్ ప్రధానిగా పదవీచ్యుతుడైన బోరిస్ జాన్సన్ తర్వాత లిజ్ ట్రస్ కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. లిజ్ ట్రస్ తన ప్రత్యర్థి, మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్‌ను ఓడించారు. లిజ్ ట్రస్ కు 81,326 ఓట్లు రాగా, రిషి సునాక్ కు 60,399 ఓట్లు లభించాయి. ప్రధాని పీఠం కోసం చివరివరకు బరిలో నిలిచిన భారత సంతతి రాజకీయవేత్త రిషి సునాక్ కు నిరాశ తప్పలేదు. మార్గరెట్ థాచర్, థెరెసా మే తర్వాత బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన మూడో మహిళగా లిజ్ ట్రస్ నిలిచిపోతారు.

వివాదాలు, ప్రజావ్యతిరేకత కారణంగా బోరిస్ జాన్సన్ ప్రధాని పదవి నుంచి తప్పుకోవడంతో ఎన్నిక చేపట్టారు. కన్జర్వేటివ్ పార్టీకి అధినేతగా ఎన్నికయ్యే వ్యక్తే బ్రిటన్ ప్రధాని అవుతారన్న నేపథ్యంలో, లిజ్ ట్రస్ కూడా పదవిని సొంతం చేసుకోవడంలో విజయవంతం అయ్యారు. మాజీ ఆర్థిక మంత్రి అయిన రిషి సునాక్ మొదట్లో బాగానే పోటీ ఇచ్చారు. ఒకానొక దశలో ప్రధాని కావడం ఖాయమనుకున్నారు. కానీ చివరికి లిజ్ ట్రస్‌కే ఎక్కువ మద్దతు లభించింది. దీనికితోడు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా రిషికి వ్యతిరేకంగా పలు ప్రకటనలు చేశారు.