పాకిస్థాన్‌లో జరిగే ఆసియా కప్‌లో భారత క్రికెట్ జట్టు పాల్గొనడంపై క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. గత ఏడాది అక్టోబర్‌లో, ఆటగాళ్ల భద్రతను ఉటంకిస్తూ ఆసియా కప్ కోసం భారతదేశం పాకిస్తాన్‌కు వెళ్లడంపై హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. అయితే తాజాగా ఆయన దీనిపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఠాకూర్ నాగ్‌పూర్‌లో విలేకరులతో క్రీడలకు సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు. సెప్టెంబరులో పాకిస్థాన్‌లో జరగనున్న ఆసియా కప్‌లో భారత్ పాల్గొంటుందా అని అడగ్గా భారత క్రికెట్ నియంత్రణ మండలి ముందుగా పాక్ లో భారత జట్టు ఆసియా కప్ ఆడటానికి వెళుతుందా లేదా అనే అంశమై స్పందించాలని.. ఆపై క్రీడా మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖ నిర్ణయాలు తీసుకుంటాయని అన్నారు.
ఆగస్టు 15 నాటికి 1,000 ఖేలో ఇండియా కేంద్రాలను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని ఠాకూర్ చెప్పారు. ప్రస్తుతం తాము 945 ఖేలో ఇండియా కేంద్రాలను మంజూరు చేసామని.. ఆగస్టు 15 లోపు దేశవ్యాప్తంగా 1,000 కేంద్రాల లక్ష్యాన్ని ప్రభుత్వం సాధిస్తుందన్నారు. ప్రతి జిల్లాలో కనీసం ఒక ఖేలో ఇండియా కేంద్రాన్ని ప్రారంభించడమే తమ లక్ష్యమన్నారు. క్రీడల ప్రోత్సాహంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని.. 2014లో 900 కోట్లు ఉన్న క్రీడా బడ్జెట్ 3,397 కోట్లకు పెరిగిందని అన్నారు.
భద్రతా కారణాల దృష్ట్యా ఆసియా కప్ ఆడేందుకు తాము పాకిస్థాన్ కు రాబోమని, తటస్థ వేదిక పై అయితేనే ఆసియా కప్ ఆడతామని బీసీసీఐ గతంలో స్పష్టం చేసింది. అయితే పాక్ మాత్రం ఆసియా కప్ ఆడేందుకు భారత్ తమ దేశానికి రాకుంటే తాము కూడా వన్డే వరల్డ్ కప్ ఆడటానికి భారత్ కు వెళ్లబోమని హెచ్చరిస్తూనే ఉంది. ఆసియా కప్ నిర్వహణపై మార్చి 20న దుబాయ్ లో కీలక సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి బీసీసీఐ కార్యదర్శి అయిన జై షా.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడి హోదాలో హాజరుకానున్నారు. పీసీబీ చీఫ్ నజమ్ సేథీ సారథ్యంలోని బృందంతో పాటు ఏసీసీలో సభ్యదేశాల ప్రతినిధులు కూడా ఈ మీటింగ్ కు హాజరవుతారు.