More

    చైనా చరిత్రలో నెత్తుటి మరకలు..! మావో కుట్ర సిద్ధాంతాలు..!!

    గతించిన కాలం అనేక ఊహలకు తావిస్తుంది. చారిత్రక సన్నివేశాలు మదిలో మెదిలినప్పుడు-ఫలానా ఘటన జరక్కపోతే బావుండనో, చిట్టచివర దూసుకువచ్చిన ఆ త్రాష్టుడి వల్లే అంతా భగ్నమైపోయిందనో, అలా జరక్కపోతే ఎలా ఉండేదో…అనే ఆలోచనలు అప్పుడప్పుడూ ముప్పిరిగొంటాయి.

    చియాంగ్‌ కై షేక్‌ తన భార్య సూంగ్‌ మీ లింగ్‌కు ప్రేమ కానుకగా సకల సౌకర్యాలతో జోంగ్షాన్ పర్వతంపై నిర్మించిన.. ప్రేమ సౌధం ప్రకృతి చూట్టూ అల్లుకుపోయిన కంఠాభరణంలా దర్శనమిస్తుంది. దాదాపు తొంభై ఏళ్ల క్రితం చియాంగ్ కై షేక్ తమ దాంపత్యానికి గుర్తుగా నిర్మించిన మమతల కోవెల అది. రుతువులు మారినప్పుడల్లా ఈ చెట్ల ఆకుల రంగులు మారడమే కాదు, రాత్రివేళ అలంకరించిన విద్యుద్దీపకాంతుల మధ్య జిగేలుమంటూ రవ్వల నెక్లెస్‌లా మెరిసిపోతుంది.

    ఈ ప్రేమకానుకను చూసిన చరిత్రకారులంతా ఓ ఊహకు పనికల్పించారు. చైనా చరిత్రలో మావో నాయకత్వంలోని కమ్యూనిస్టు పార్టీ కాకుండా చియాంగ్ కై షేక్ నాయకత్వంలోని జాతీయ వాద పార్టీ కొమింటాంగ్ అధికారంలోకి వచ్చి ఉంటే ఆసియా పసిఫిక్ భవిష్యత్తు ఎలా ఉండేది అని.

    ఇలాంటి ఆలోచనతోనే బెంజిమిన్ డేవిడ్ బేకర్ అనే పాత్రికేయుడు ‘డిప్లామాట్’ పత్రికలో 2015లో  ‘‘ What if the Kuomintang Had Won the Chinese Civil War? ’’ చైనా అంతర్యుద్ధంలో కొమింటాంగ్ గెలిచి ఉంటే ఎలా ఉండేది? అంటూ ఓ ఆసక్తికరమైన కథనం రాశాడు. ప్రపంచ చరిత్రను మార్చిన అనేక యుద్ధాలను, ఘటనలను, సంఘటనలను తిరగేసి చూస్తే ఎలా ఉంటుంది అనే కుతూహలాన్ని నింపాడు డేవిడ్ బేకర్.

    కమ్యూనిజం చెప్పే ఆదర్శవాదం, మార్క్సిజం నేర్పే తాత్విక ఆలోచనా విధానం, లెనిన్ చెప్పిన పోరాట పంథా, మావో రచించిన గెరిల్లా యుద్ధ వ్యూహం అన్నింటి మధ్య ఆసులో దారంలా ఉండేది అధికారం మాత్రమే! అధికార లాలస ఎంత రక్తపాతానికి, అమానవీయ సన్నివేశాలకు కారణమవుతుందో తెలుసుకోవాలంటే 1927-1989 మధ్య అటుఇటుగా ఎనిమిది దశాబ్దాల చైనా చరిత్రను తిరగేస్తే తెలుస్తుంది.

    దురదృష్టవశాత్తు భారతీయ మేధావులు మాత్రం దారుణకృత్యాల్లో ప్రజాస్వామ్యాన్ని దర్శిస్తున్నారు. భారత మాజీ దౌత్యవేత్త Vijay Gokhale మే చివరి వారం విడుదల చేసిన  ‘‘Tiananmen Square: The Making of a Protest – A Diplomat Looks Back’’ పుస్తకంలో తియాన్మెన్ స్క్వేర్ ఘటనను గ్లోరిఫై చేస్తూ రాసిన పుస్తకం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.

    సాంస్కృతిక విప్లవం, తియాన్మెన్ స్వ్యేర్ ల పరిణామాల వెనుక ఉన్న కుట్ర ఏంటి? ఒక వేళ చియాంగ్ కై షేక్ చైనా అధికార పగ్గాలు చేపట్టి ఉంటే చరిత్ర ఎలా ఉండేది? ‘‘Black book of communism’’లో ఏముంది? మాజీ దౌత్య అధికారి విజయ్ గోఖలే రాసిన ‘‘Tiananmen Square: The Making of a Protest – A Diplomat Looks Back’’ పుస్తకంలో ఏముంది? అసలు ఎందుకు దక్షిణ చైనా సముద్రం అంత వివాదాస్పదమైంది? అది తన నియంత్రణలోనే ఉండాలని చైనా ఎందుకు కోరుకుంటోంది? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    ముందు మైమరచిపోయిన మన దౌత్యవేత్త విజయ్ గోఖలే తన ‘‘Tiananmen Square: The Making of a Protest – A Diplomat Looks Back’’ పుస్తకంలో ఏమన్నాడో చూద్దాం.

    1989జూన్4 నాడు “తియనన్మెన్ స్క్వేర్ లో పది వేల మంది విద్యార్థులను సైన్యం కాల్చి చంపిందని” అమెరికా, పశ్చిమదేశాల సామ్రాజ్యవాదులు  ప్రచారం చేశారనీ  అయితే  అదంతా కట్టుకధ  అంటూ  వ్యాఖ్యానించారు.

    ‘‘300మందికిపైగా కీలకపార్టీ, ప్రభుత్వ నాయకులంతా వుండే కేంద్రస్థానం అది; వారి నివాసాలు, ఆఫీసులు, ప్రభుత్వ సెక్రటేరియట్ కూడా అందులోనే. అలాంటిస్థానాన్ని లక్షమంది విద్యార్థులు చుట్టుముట్టిన నెలతర్వాత, మే18న పొలిట్ బ్యూరో నిర్ణయంతో, మే20నగానీ మార్షల్ లా ప్రకటించలేదు. ఆతర్వాతే సైన్యప్రవేశం; కానీ నగరం వెలుపలే ఉంచారు. మే15-16న రష్యానేత గోర్బచేవ్ పర్యటన సందర్భంగా స్క్వేర్ లో కార్యక్రమాలకోసం ‘గ్రౌండుని క్లియర్’చేయాలా అని చర్చించారు. కానీ చేయలేదు.

    జూన్ 3 రాత్రిదాకా ఒక్క బుల్లెట్ కూడా పేలలేదు. ప్రపంచ మానవాళి చరిత్రలో ఇలాంటి తిరుగుబాటుని అన్నిరోజులు అనుమతించిన రాజ్యం మరొకటిలేదు. ఏదైనావుంటే ఎవరైనా ఉదహరించవచ్చును. చర్చలద్వారా 90-95 శాతంమందిని నచ్చచెప్పి ఇళ్ళకు పంపేశారు. వారు పోగా ఇంకా5నుంచి10వేలమంది దాకావుంటారు.’’  తియాన్మెన్ రక్తపు మరకల్ని చెరిపేసే  ప్రయత్నం చేశారు విజయ్ గోఖలే.

    మరి అంత ప్రజాస్వామికంగా వ్యవహరించిన చైనా ప్రభుత్వం తియాన్మెన్ స్క్వేర్ ఘటనను స్మరించుకునేందుకు ఎందుకు అనుమతి ఇవ్వదో అర్థం కాదు.  చైనాలో తియానన్మెన్ స్క్వేర్ ఘటనను స్మరించుకోవడానికి అధికారికంగా కార్యక్రమాలూ ఉండవు. సంస్మరణలను సైతం అంగీకరించదు. 

    జూన్ 4వ తేదీ సమీపిస్తోందంటే ఉన్నట్లుండి చైనా ఇంటర్నెట్‌ మాధ్యమాల్లో అప్రకటిత సెన్సార్‌షిప్ ప్రారంభమవుతుంది. ఆటోమేటిక్ అల్గారిథమ్‌ల సాయంతో వేలాది మంది పోస్టులను పరిశీలిస్తూ, నియంత్రణలు జరుగుతుంటాయి. పరిధిని మించి  వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు చేసేవారికి జైలు శిక్షలు విధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవలే కొందరికి మూడున్నరేళ్ల జైలు శిక్ష విధించారు.

    ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ తియానన్మెన్ స్క్వేర్ వద్ద పది లక్షల మందికి పైగా ప్రజలు నిరసన ప్రదర్శన చేపట్టారు. 1989 ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ నిరసన ప్రదర్శన చైనా దేశ చరిత్రలో అతి పెద్దది. ఇది ఆరువారాల పాటు కొనసాగింది. క్రమంగా ఇవి ఇతర నగరాలు, యూనవర్సిటీలకు వ్యాపించాయి. మరింత స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కావాలని, నియంతృత్వ పోకడలు అంతమవ్వాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. మరి కొందరు, ద్రవ్యోల్బణం, జీతాలు, ఇళ్లు లేకపోవడంపై కూడా నిరసనలు వ్యక్తం చేశారు.

    చైనా ప్ర‌భుత్వ విధానాల‌కు నిరస‌న‌గా ప్ర‌జ‌లు చేప‌ట్టిన ఉద్య‌మంపై చైనా ఉక్కుపిడికిలి బిగించి 1989 లో ప్రజాస్వామ్య అనుకూల నిరసనకారులను కాల్చివేసింది. చైనా రాజ‌ధాని న‌గ‌రంలోని తియాన్మెస్ స్క్వేర్ ఈ ఊచ‌కోత‌కు నిశ్శ‌బ్ధ సాక్షిగా నిలిచింది. ఆందోళ‌న చేస్తున్న వేలాది మంది నిరాయుధ ప్రజలపై ట్యాంకులతో చైనా సైన్యం విరుచుకుప‌డి దారుణానికి ఒడిగ‌ట్టింది. జూన్ 3వ తేదీ రాత్రి ఉన్నట్లుండి తియానన్మెన్ స్క్వేర్‌లో ట్యాంకులతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు కాల్పులు ప్రారంభించాయి.

    ఈ కాల్పుల్లో అమాయకులైన ప్రజలెందరో చనిపోయారు. కానీ కాల్పుల్లో ఒక్కరు కూడా చనిపోలేదని ప్రభుత్వం ఆ తర్వాత విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఎంతమంది నిరసనకారులు చనిపోయారనే దానిపై ఇప్పటికీ చైనా ప్రభుత్వం స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. కానీ ఈ సంఖ్య10 వేలకు పైగానే ఉంటుందని ఓ అంచనా. ప్రజాస్వామ్య హక్కుల గురించి , ఊకదంపుడు ప్రసంగాలు  చేసే దేశ కమ్యూనిస్టులు  నియంతృత్వం నశించాలని, నినదించే  ప్రజాస్వామ్యవాదులు తియాన్మెన్ స్క్వేర్ మారణహోమం గురించి అస్సలు మాట్లాడరు.

    1966 నుంచి 1976 వరకు సాగిన చైనా సాంస్కృతిక విప్లవ కాలంలో జరిగిన దుర్మార్గాలకు సంబంధించి Black book of communism అనేక ఆసక్తికరమైన వాస్తవాలను బహిర్గతం చేసింది. లిన్ పియావో అనుమానాస్పద మరణం గురించి మావో నుంచి నేటి అధ్యక్షుడు జిన్ పింగ్ వరకూ ఎవరూ నోరు మెదకపోవడమే ఆశ్చర్యంకరం.

    అసలు మావో ఏ ఉద్దేశంతో సాంస్కృతిక విప్లవాన్ని ఆరంభించాలో అంటుంది Black book of communism..‘‘ no idea how or why chairman mao’s designated successor, Marshal Lin Bio, dies in 1971; and mao’s intentions during the cultural revolution remain quite mysterious’’ అంటూ వ్యాఖ్యానించింది. అంతేకాదు, సాంస్కృతిక విప్లవ కాలంలో పశ్చిమ చైనాలో ‘మృత్యు గుడారాల’’ను ఏర్పాటు చేసి వందలాది మందిని హత్య చేసిందని ఈ పుస్తకం తేటతెల్లం చేసింది. అందుకు సంబంధించిన వివరమైన ‘నక్షా’ను బహిర్గతం చేసింది. ‘లేబర్ క్యాంప్స్’ పేరిట బలవంతపు చాకిరీ చేయించేందుకు సైతం ప్రత్యేక స్థావరాలు నిర్మించింది చైనా ప్రభుత్వం.

    భారత కమ్యూనిస్టులు, వామపక్ష తీవ్రవాద సంస్థలు గొప్పగా చెప్పుకునే ‘లాంగ్ మార్చ్’కు సంబంధించిన వాస్తవాలను సైతం నిగ్గుదేల్చింది ‘‘Black book of communism’’. లాంగ్ మార్చ్ ను ‘‘Along march into night’’ అనే ప్రత్యేక భాగాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచింది. ఈ మారణహోమం గురించి సీపీసీ 7వ కాంగ్రెస్ లో స్వయంగా అన్నమాటలను ఊటంకించింది.

     ‘‘ After our armed enemies have been crushed, there there will still be our unarmed enemies, who will try to fight us to death. We must never underestimate their strength. Unless we think of the problem in precisely those terms, we will commit the gravest errors.’’

    అంటూ తన క్రూరత్వాన్ని వెళ్లగక్కాడు మావో. 1940ల తర్వాత సోవియట్ రష్యా పాల్పడిన దారుణాలను చైనా సైతం పునరావృతం చేసింది. లెక్క బయటకు పొక్కకుండా వేలాదిమందిని ఊచకోత కోసింది.

    ఇక Robert Cowley రాసిన ‘‘The Collected What If? Eminent Historians Imagine What Might Have Been’’ పుస్తకంలో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో చరిత్ర పాఠాలు బోధించే Arthur Waldron చైనా చరిత్రకు సంబంధించి ఆసక్తికరమైన ఊహను వెలిబుచ్చారు.  1946 వసంతకాలం నాటికి జాతీయవాద శక్తిగా ఉన్న కొమింటాంగ్ మావో నాయకత్వంలోని కమ్యూనిస్టు పార్టీని ఓడించి ఉంటే అమెరికా దళాలు మంచూరియా మీదుగా వెళ్లి ఎర్రసేనకు బుద్ధిచెప్పి ఉండేదనీ, అలా చియాంగ్ కై షేక్ అధికార పగ్గాలు చేపట్టే అవకాశం ఉండేద’న్నారు.

    ఇక దక్షిణ చైనా సముద్రం కథేంటో చూద్దాం…

    దక్షిణ చైనా సముద్రంలో చిన్నా, పెద్ద కలిపి సుమారు 250 వరకు దీవులు ఉన్నాయి. అయితే, ఇందులో అన్ని దీవులలో జనం నివసించరు. ఆటు పోట్ల కారణంగా కొన్ని దీవులు కొన్ని నెలల పాటు నీటిలో మునిగి ఉంటాయి. కొన్ని పూర్తిగా మునిగే ఉంటాయి. ఈ ప్రాంతం హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహా సముద్రం మధ్య ఉంటుంది. దీని చుట్టూ చైనా, తైవాన్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, బ్రూనై, ఫిలిప్పీన్స్ దేశాలు ఉంటాయి. దాదాపు అన్ని దేశాలు ఈ భూభాగంలో తమకూ వాటా ఉందని ప్రకటించుకున్నాయి.

    రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దక్షిణ చైనా సముద్ర ప్రాంతం 1939 నుండి 1945 వరకు జపాన్ ఆక్రమణలో ఉంది. యుద్ధంలో జపాన్ ఓటమి తరువాత దానిని స్వాధీనం చేసుకోవడానికి చైనా తన నౌకలను పంపింది.యుద్ధం తర్వాత చైనా ప్రభుత్వం 30 లక్షల చదరపు కి.మీ.లో ఎక్కువ భాగం తనదిగా, అన్ని ద్వీపాలను ఒకే రేఖ మీద చూపిస్తూ ఓ చిత్రపటాన్ని విడుదల చేసింది. ఈ రేఖను నైన్ డాష్ లైన్ అంటారు. అయితే, ఈ రేఖ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలున్నాయి. కానీ, ఈ ప్రాంతం తనదని చెప్పుకునేందుకు చైనా ఇప్పటికీ ఇదే మ్యాప్‌ను ఉపయోగిస్తోంది.

    ఈ ప్రాంతంలో చమురు నిల్వలపై అన్వేషణ మొదలైన తర్వాతే చైనా కుయుక్తులను అమలుచేయనారంభించింది. 2012లో స్కాబరో షోల్ ప్రాంతంలోని ఫిలిప్పీన్స్ మత్స్యకారులను చేపలు పట్టకుండా చైనా అడ్డుకుంది. అయితే, ఈ ప్రాంతం తన స్పెషల్ ఎకనమిక్ జోన్‌ లోనిదని స్పష్టం చేస్తూ ఫిలిప్పీన్స్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

    ఈ కేసు విచారణ కోసం ఐక్య రాజ్య సమితి ‘లా ఆఫ్ ది సీ సమావేశం’ ఏర్పాటు చేసి ఒక ట్రిబ్యునల్‌ను నియమించింది. ఇందులో ఫిలిప్పీన్స్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. ” ఈ ప్రాంతంలోని సముద్రపు వనరులు తనవి అని చెప్పుకోవడానికి చైనాకు చట్టపరమైన ఆధారం లేదు” అని కోర్టు స్పష్టం చేసింది.

    చైనా ఈ కేసు విచారణకు హాజరు కాలేదు, ట్రిబ్యునల్ అధికార పరిధిని నిరాకరించింది. దీనితో, దక్షిణ చైనా సముద్రం చుట్టూ ఉన్న దేశాలలో చైనా ఉద్దేశం తెరపైకి వచ్చింది. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తత పెరిగింది. ఫిలిప్పీన్స్‌ తర్వాత ఇండోనేషియాతో చైనాకు వివాదం ఏర్పడింది.

    దక్షిణ చైనా సముద్రం వివాదం కేవలం మత్స్య సంపద, మిగతా వనరుల విషయంలోనే కాదు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలలో దక్షిణ చైనా సముద్రం ఒకటి. ఈ కారణంగానే భౌగోళిక రాజకీయాల్లో ఇది కీలక పాత్ర పోషిస్తోంది. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం ప్రపంచంలో 80శాతం వాణిజ్యం ఈ సముద్రం ద్వారా జరిగితే, ఈ వాణిజ్యంలో మూడవ వంతు దక్షిణ చైనా సముద్రం మీదుగా సాగుతోంది. ఒక  అంచనా ప్రకారం ఈ మార్గం ద్వారా 373.37 ట్రిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోంది.

    న్యాయపరమైన ఓటమి తర్వాత చైనా తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంటోంది. దక్షిణ చైనా సముద్రంలో మునిగి పోయిన రాళ్ల పై చైనా మిలియన్ల కిలోల కాంక్రీటును, రాయిని పోస్తోంది. సముద్రం కింద బలమైన పునాది సాయంతో ఒక కృత్రిమ ద్వీపాన్ని నిర్మిస్తోంది. దక్షిణ చైనా సముద్రంలోని పారాసెల్, స్పార్టాలి, ఫాయరీ, మిస్చిఫ్, సుబి, వుడీ ద్వీపాలను విస్తరించడానికి, అక్కడ సైనిక స్థావరాలు, ఓడరేవులను నిర్మించడానికి చైనా ప్రయత్నాలు చేస్తోంది. చైనా ఇప్పటి వరకు సముద్రం కింద మూడు వేల హెక్టార్ల కొత్త భూమిని సిద్ధం చేసింది.

    చైనా ఇక్కడ 3వేల మీటర్ల పొడవుతో మూడు రన్‌వేలను నిర్మించింది. ఇవి ఆర్మీ రన్‌వేలు. ఇక్కడ యుద్ధ విమానాలను ల్యాండ్ చేయవచ్చు. ఇక అక్కడ భారీగా చమురు నిల్వలు ఉన్నాయి. కేవలం 36 నెలల రికార్డు సమయంలో ఈ ద్వీపంలో భద్రత, క్షిపణి వ్యవస్థలను చైనా నిర్మించింది. ఆధునిక చరిత్రలో ఇది పర్యావరణపరంగా అత్యంత విధ్వంసకరమైన చర్య అని, దీని ప్రభావం ఇక్కడ సముద్ర జీవులపై పడుతుంది.

    మొత్తంగా చైనా ఇవాళ ఆదేశ ప్రజలకే కాదు, మొత్తం ప్రపంచ ప్రజానీకానికి గొంతుమీద కత్తిలా మారింది. చైనాను  సమర్థించే శక్తులు ఆసియా దేశాల్లో బాహటంగా బాకాలూదుతున్నాయి. భారత్ ఇందుకు మినహాయింపు కాదు. రాబోయే దశాబ్దంలో వామపక్ష తీవ్రవాదాన్ని భారత్ తుడిచిపెట్టేస్తే…భావి తరాలు అబద్ధపు ఆదర్శాల ఊబిలో కూరుకుపోకుండా ఉంటారని ఆశిద్దాం….

    Trending Stories

    Related Stories