చిరుతపులి దాడి చేసిందంటే బాగా దిట్టమైన యువకులకు కూడా తప్పించుకోడానికి కష్టమే..! అలాంటిది 60 ఏళ్ల మహిళపై చిరుతపులి దాడి చేయగానే ధైర్యంగా దాన్ని ఎదుర్కొంది. మహారాష్ట రాజధాని ముంబైలోని ఆరె ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన ఘటన సీసీటీవీలో రికార్డు అయింది. ఆ ప్రాంతంలో ఓ చిరుత సంచరిస్తూ ఉండగా.. అక్కడ పులి ఉందని గుర్తించకుండా ఓ బామ్మ అరుగు వద్దకు వచ్చి కూర్చుంది. ఆ వెంటనే ఆమె వద్దకు పులి వచ్చి దాడి చేయబోయింది. దీంతో ఆ బామ్మ తన చేతి కర్రను తీసుకుని పులిపై ఎదురుదాడికి దిగి కేకలు వేసింది. దీంతో పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. బామ్మ వద్దకు స్థానికులు వచ్చి ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లారు. మహిళకు స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. సంజయ్ గాంధీ జాతీయ ఉద్యానవనం సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతంలో వారం రోజుల వ్యవధిలో చిరుతపులి దాడి జరగడం ఇది మూడోసారి.
60 ఏళ్ల వృద్ధురాలు తన గుడిసె బయట అరుగుపై కూర్చొంది. ఆమె ముందుకు చూసుకుంటూ ఉండగా.. వెనుక నుండి చిరుత దాడి చేసింది. వెంటనే ఆ మహిళ తన వాకింగ్ స్టిక్‌తో చిరుతను కొట్టడం మొదలుపెట్టింది. దీంతో ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయింది చిరుత. సహాయం కోసం ఆమె వేసిన కేకలు విన్న తర్వాత, కొందరు అక్కడికి వచ్చి ఆమెకు సహాయం అందించారు. ఆ మహిళను నిర్మలాదేవి రాంబదన్ సింగ్‌గా గుర్తించారు. ఈ దాడిలో ఆమె ముఖం, ఛాతీ మరియు వీపు భాగంలో గాయాలయ్యాయి.
