భారత దిగ్గజ స్ప్రింటర్ మిల్కాసింగ్ కన్నుమూశారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. ఆసియా గేమ్స్‌లో నాలుగుసార్లు బంగారు పతకాలు సాధించిన ఆయన కరోనా అనంతరం సమస్యలతో శుక్రవారం రాత్రి చండీగఢ్‌లోని పోస్టు గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్) ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. మిల్కా సింగ్ భార్య, ఇండియన్ వాలీబాల్ జట్టు మాజీ కెప్టెన్ అయిన నిర్మల్ సైనీ కౌర్ కరోనాతో ఈ నెల 13న మృతి చెందారు. భార్య తుదిశ్వాస విడిచిన కొన్ని రోజులకే ఆయన కూడా కన్నుమూయడం ఆ కుటుంబంలో మరింత విషాదాన్ని నింపింది.

కరోనాతో బాధపడుతూ మే 20న ఆసుపత్రిలో చేరిన మిల్కాసింగ్‌కు మూడు రోజుల క్రితం నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ రావడంతో ఆయనను నాన్ కొవిడ్ ఐసీయూ సెంటర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగానే గత రాత్రి పరిస్థితి విషమించి కన్నుమూశారు. తండ్రి మరణించిన విషయాన్ని ఆయన కుమారుడు, దిగ్గజ గోల్ఫర్ జీవ్ మిల్కా సింగ్ ధ్రువీకరించారు. “మిల్కా సింగ్ జీ 2021 జూన్ 18 న రాత్రి 11.30 గంటలకు కన్నుమూసినట్లు మేము మీకు తెలియజేయాలనుకుంటున్నాము” అతని కుటుంబం ఒక ప్రకటనను విడుదల చేసింది.

20 నవంబరు 1932లో నేటి పాకిస్థాన్ లోని పంజాబ్‌లోని గోవింద్‌పురలో మిల్కాసింగ్ జన్మించారు. పరుగుల పోటీల్లో భారత లెజెండ్ గా నిలిచారు. 1958 జాతీయ క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించారు. 1958లో కామన్వెల్త్ పోటీల్లో 46.6 సెకన్లలోనే 440 గజాల దూరం పరుగెత్తి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఫలితంగా భారత్ తరపున తొలి స్వర్ణం సాధించిన తొలి క్రీడాకారుడిగా రికార్డులకెక్కారు. 1959లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.

మిల్కా సింగ్ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తదితరులు సంతాపం తెలిపారు. ‘ఎంతో మంది భారతీయుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న మిల్కా సింగ్ ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని.. కొద్దిరోజుల కిందటే ఆయనతో మాట్లాడడం జరిగిందని.. అదే తమ మధ్య ఆఖరి సంభాషణ అవుతుందని అనుకోలేదని’ నరేంద్ర మోదీ ట్వీట్ లో చెప్పుకొచ్చారు.

‘ఫ్లయింగ్ సిక్కు’ గా ప్రసిద్ది చెందిన మిల్కా సింగ్ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో ఆసియా క్రీడలలో నాలుగు బంగారు పతకాలు సాధించారు. కార్డిఫ్‌లో 1958 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించారు. ఆయన ఒలింపిక్ పతకాన్ని తృటిలో కోల్పోయాడు, 1960 రోమ్ గేమ్స్ 400 మీటర్ల ఫైనల్లో నాల్గవ స్థానంలో నిలిచాడు. మిల్కా సింగ్ 45.73 సెకన్లలో రేసును ముగించారు. 1998 లో పరంజీత్ సింగ్ దీనిని అధిగమించడానికి ముందు వరకూ దాదాపు 40 సంవత్సరాల జాతీయ రికార్డుగా మిగిలిపోయింది. మిల్కా సింగ్ 1956, 1964 ఒలింపిక్స్‌లో కూడా పాల్గొన్నారు. భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని 1959 లో ఆయనకు ప్రదానం చేశారు.