More

    దివికేగిన కళాతపస్వి కె.విశ్వనాథ్

    తెలుగు చిత్ర పరిశ్రమను శోక సంద్రంలో ముంచి కళాతపస్వి కె.విశ్వనాథ్ దివికేగారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. ఆయన గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. విశ్వనాథ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన మరణవార్త విన్న తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

    కె.విశ్వనాథ్‌గా వెండితెరకు పరిచయమైన కాశీనాథుని విశ్వనాథ్ బాపట్ల జిల్లా రేపల్లెలోని పెద పులిపర్రు గ్రామంలో 19 ఫిబ్రవరి 1930లో జన్మించారు. తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యం-సరస్వతమ్మ. గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్, ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు. విశ్వనాథ్ తండ్రి చెన్నైలోని విజయవాహిని స్టూడియోలో పనిచేసేవారు. విశ్వనాథ్ డిగ్రీ పూర్తికాగానే అదే స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్‌గా సినీ జీవితాన్ని ప్రారంభించారు. పాతాళభైరవి సినిమాకు తొలిసారి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 1965లో తొలిసారి ‘ఆత్మగౌరవం’ సినిమాకు దర్శకుడిగా పనిచేశారు. తొలి సినిమాకే నంది అవార్డు అందుకున్నారు. తెలుగులో 50కిపైగా సినిమాలకు దర్శకత్వం వహించిన విశ్వనాథ్ బాలీవుడ్‌లో 9 సినిమాలకు దర్శకత్వం వహించారు.

    సినీ రంగంలో ఆయన చేసిన కృషికి గాను 2016లో ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. 1992లో రఘుపతి వెంకయ్య అవార్డు, అదే ఏడాది పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ‘శంకరాభరణం’ సినిమాకు జాతీయ పురస్కారంతో పాటు ‘సప్తపది’కి జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది. ‘స్వాతిముత్యం’ సినిమా 1986లో ఆస్కార్‌ అవార్డుల నామినేషన్లకు అధికారిక ప్రవేశం పొందింది. మొత్తం ఐదు జాతీయ అవార్డులు లభించాయి. స్వాతిముత్యం 59వ ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచింది. ఆసియా ఫసిఫిక్ చలనచిత్ర వేడుకల్లో స్వయం కృషి, సాగరసంగమం, సిరివెన్నెల సినిమాలు ప్రదర్శించారు. మాస్కోలో జరిగిన చలనచిత్ర వేడుకల్లో స్వయంకృషి సినిమాను ప్రదర్శించారు. స్వరాభిషేకం సినిమాకు ప్రాంతీయ విభాగంలో జాతీయ పురస్కారం లభించింది. ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమా ‘శుభప్రదం’.

    నటుడిగానూ తనదైన ముద్రవేశారు. శుభసంకల్పం, నరసింహనాయుడు, కలిసుందాం రా, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, సీతారామయ్యగారి మనవరాలు, ఠాగూర్, అతడు, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ తదితర చిత్రాల్లో నటించారు. దర్శకుడిగా ఏ సినిమా చేసినా.. షూటింగ్‌కి ఖాకీ బట్టలు ధరించడం విశ్వనాథ్‌ కు అలవాటు. తనను తాను కార్మికుడిలా భావిస్తానని, అందుకే ఖాకీ బట్టలు తొడుక్కుంటానని విశ్వనాథ్‌ వివరణ ఇస్తూ ఉండేవారు. ఆయన మరణం సినీ ప్రపంచానికే తీరని లోటు.

    Trending Stories

    Related Stories