More

    నిఘా చరిత్రలో కీలక మలుపు

    పెగసాస్ ట్యాపింగ్ వ్యవహారం మరో ‘వాటర్ గేట్’ స్కాండల్ గా అభివర్ణిస్తోంది భారత మీడియా. విచిత్రం కాకపోతే వామపక్ష మేధావులు, వారి అనుయాయులూ, అనుకూల పాత్రికేయుల గురించీ కూపీ లాగేందుకు అంతర్జాతీయ స్థాయి స్పై వేర్ కావాలా, మరీ విడ్డూరం కాకపోతే! దేశ రాజకీయాల్లో అచ్చాదన లేని ప్రవర్తనతో బలాదూర్ గా రంకెలేసే వారికి మన మీడియా సంస్థలు చాలవూ…! కాంగ్రెస్ గుట్టు తెలుసుకోవాలంటే ఆ పార్టీకే చెందిన G-23 నేతల్ని అడిగితే అర్ధశతాబ్దం రహస్యాలు ఆపకుండా చెప్పుకుపోతారు.

    రిచర్డ్ నిక్సన్ ట్యాపింగ్ కు పాల్పడ్డాడంటే ఓ అర్థముంది. రిపబ్లికన్ పార్టీ లాంటి వైరి పక్షం, ఫోర్డ్ గెరాల్డ్ లాంటి బలమైన ప్రతిపక్ష నేత ఉన్నారు. అలాంటిది మన దేశంలో ప్రతిపక్ష నేత ఎవరో తెలియదు. ప్రతిపక్ష పార్టీ సంగతి సరే సరి! ఇక వామపక్షాల సంగతి చెప్పనక్కరలేదు.  కేవలం పత్రికల రాతల్లోనో, పాత్రికేయుల ముఖస్తుతిలోనో బతికి బట్టకడుతున్నాయి ఆ పార్టీలు. రాబడికీ, ఆదాయానికి వ్యత్యాసం తెలియని పత్రికా రచయితలు, స్తోత్రపాఠాలకు తెరను మలినం చేసే జర్నలిస్ట్ మహాశయుల కోసం కోట్ల రూపాయలు వృధా చేసే ప్రభుత్వం అసలెక్కడైనా ఉంటుందా?

    అక్రమబొగ్గు వ్యాపారి అభిషేక్ బెనర్జీ వద్ద ఏం రహస్యాలు ఏడ్చాయని అరకోటి ఖర్చుపెట్టి అంతఖరీదైన స్పైవేర్ ఇన్ స్టాల్ చేయాలి? హర్యానాలో స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టిన అశోక్ లావాసాకు అంతర్జాతీయ స్థాయి గూఢచర్య సాఫ్ట్ వేర్ ఎవరైనా అమరుస్తారా?

    అసలు పెగసాస్ స్పైవేర్ ఖరీదు ఎంత? ఇన్ స్టాల్ చేయాలంటే ఎంత? ప్రభుత్వాలకైతే ఎంత? ప్రైవేటుకు అయితే ఎంత? ఆండ్రాయిడ్ ఫోన్ లకు ఎంత? ఆపిల్ ఫోన్లకు ఎంత? సింబియాన్ కు ఏ మోస్తరు అవుతుంది? బ్లాక్ బెరీకి ఏ మాత్రం అవుతుంది? కేవలం ఒకే ఒక్క ఐఫోన్ కు పెగసాస్ ఇన్ స్టాల్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది?

    అత్యంత ఖరీదైన ఈ cyber-surveillance weapon ను మన చవకబారు నేతలు, చలికాచుకునే పాత్రికేయులు, చెప్పిందే చెప్పే మేధావులపై ప్రభుత్వం ప్రయోగిస్తుందా? cyber-surveillance weapon 2020లో Telesur  అనే లాటిన్ అమెరికన్ ఛానల్ వెబ్ సైట్ లో రాసిన ఆసక్తికరమైన కథనంలో ఏముంది?

    ఇలాంటి ఆసక్తికలిగించే అంశాల గురించి వివరించే ప్రయత్నం చేస్తాను.

    టీఆర్పీల కోసం స్టింగ్ ఆపరేషన్ పేరుతో స్పా సెంటర్లలో దూరి రంకుబాగోతాన్ని బట్టబయలు చేయడం, పైగా అదే పాత్రికేయంగా భ్రమించేవారికోసం ప్రజాధనాన్ని వెచ్చించి గూఢచర్యం చేస్తే తెలిసేవి…అక్కరకు రాని కారుకూతలే తప్ప విలువైన సమాచారం ఏముంటుందీ? cyber-surveillance weapon ను మూసరాతల పాత్రికేయానికి గురిపెట్టే ప్రభుత్వాలు ఉంటాయనుకోవడం ఉట్టి భ్రమ.

    ఇజ్రాయిల్ ప్రభుత్వ అధికారిక నిఘా విభాగం అది లక్ష్యంగా ఎంచుకున్న కరడుగట్టిన శతృవుల కోసం కూడా అరుదుగా తప్ప పెగసాస్ స్పైవేర్ వాడదు. విలువైన ప్రజాధనాన్నిఅల్పమైన వైరికోసం వెచ్చించదు. టార్గెట్ గుట్టు కనుగొనేందుకు స్పై వేర్ అక్కరలేదు సాని కొంపలపై నిఘా పెడితే సరిపోతుందనేది ‘మోస్సాద్’ అంచనా.

    2020 ఆగస్ట్ 7 న టెహ్రాన్ వీధుల్లో హతమార్చిన మోస్ట్ వాంటెడ్ టార్గెట్ అబ్దుల్లా అహ్మద్ అబ్దుల్లా అసాసినేషన్ పై స్పందిస్తూ విలాసవంతమైన హోటేళ్లు, బ్రోతల్ హౌజ్ లు, బార్లు నేరస్థుల అడ్డా అంటూ అనధికారికంగా వ్యాఖ్యానించింది.

    ‘Telesur’ వెబ్ సైట్ గతేడాది జూన్ లో ‘‘the scandal that produced more fiction’’ అంటూ ఓ ఆసక్తికరమైన కథనం రాసింది. ఉరుగ్వేలో FA గా పిలిచే వామపక్ష సంస్థ  left-wing Broad Front కు ఓ అనుమానం పట్టుకుంది.

    అదేంటంటే ఉరుగ్వే ప్రభుత్వం ఆ దేశాధ్యక్షుడి ఆదేశాలతో తమ ఫోన్లను ట్యాప్ చేస్తోందనే అనుమానం. మేం ట్యాప్ చేసేంత సమాచారం మీ వద్ద ఏముంటందీ అని ఉరుగ్వే ప్రభుత్వం పదే పదే నెత్తీనోరూ బాదుకున్నా సదరు వామపక్ష సంస్థ వినలేదట.

    ఈ ట్యాపింగ్ అనుమాన భూతం వామపక్ష రచయితలకు, పాత్రికేయులకు, మేధావులకూ పట్టుకుందట. ప్రతి ఒక్కరూ తమ ఫోన్ ట్యాప్ అవుతుందని భావించి మామూలు విషయాలను సైతం కోడ్ భాషలో మాట్లాడుకోవడం మొదలుపెట్టారట. ఈ పిచ్చి కాస్తముదిరి ఫోన్ ట్యాపింగ్ వల్ల ఏదో జరుగుతోందని ఊహిస్తూ పుంఖానుపుంఖాలుగా కాల్పనిక సాహిత్యాన్ని రాసి ప్రచురించాట.

    ‘కేవలం అనుమానంతో ఈ ప్రమాణంలో సాహిత్యాన్ని సృజించినందుకు వారికి అభినందనలు’ అంటూ ఆ దేశాధ్యక్షుడు వారిని అభినందించాడట. టూకీగా ఆ కథనం సారాంశం ఇది.

    సరిగ్గా ఇటువంటి కథనమే ఇప్పుడు మనదేశంలో పునరావృతమైంది. పెగసాస్ స్పైవేర్ పేరుతో బోలెడు శ్రమ, గంటలతరబడి టెలివిజన్ ఛానళ్ల ఎయిర్ టైమ్, అచ్చైన పత్రికల ఖర్చు, అర్ధరాత్రుళ్లు నానాతంటాలుపడిన పాత్రికేయుల అవస్థ, వామపక్ష మేధావులు, రచయితలు….ఊహాశక్తికీ, భావ శబలతకూ, భాషాసంపత్తి ప్రదర్శనకూ పడిన కుస్తీ అంతా ఇంతా కాదు.

    పెగసాస్ స్పై వేర్ ఎపిసోడ్ ను హాస్యస్ఫోరకమైన గల్పికగా, నవ్వులు పూయించే నాటికలా రాయోచ్చు, లేదా…జాతిరత్నాలు-2 పేరుతో సీక్వెల్ కూడా తీయోచ్చు. పెగసాస్ స్పైవేర్ లో పొందుపరిచనట్టూ వెలువడిన జాబితాలోని ప్రముఖులు నిజంగానే జాతిరత్నాలు అనిపించుకోగల సార్థకనామధేయులు.

    సరే ఒకవేళ పెగసాస్ స్పైవేర్ ని నిజంగానే ఇన్ స్టాల్ చేస్తే ఏ ఫోన్ కు ఏమాత్రం అవుతుందో చూద్దాం….

    2016 లెక్కల ప్రకారం ఎన్.ఎస్.ఓ గ్రూప్ పెగసాస్ సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ చేయడానికి 3.7 కోట్లు ఛార్జ్ చేస్తుంది. 10 ఐ ఫోన్లలో స్పై సాఫ్ట్ వేర్ ను ఇన్ స్టాల్ చేయాలంటే 4.8కోట్లు వసూలు చేస్తుంది. 10 ఆండ్రాయిడ్ ఫోన్లకు 6లక్షల 50 వేల అమెరికా డాలర్లు, 5 బ్లాక్ బెర్రీలకు పెగసాస్ ఇన్ స్టలేషన్ కు 5లక్షల అమెరికా డాలర్లు, 5 సింబియన్ ఫోన్లకు 3లక్షల డాలర్ల చొప్పున వసూలు చేస్తుంది.

    అదనంగా మరో వంద టార్గెట్లకు ఫిక్స్ చేయాలంటే 5.9 కోట్లు, 50 ఎక్స్ ట్రా టార్గెట్లకు 5లక్షల డాలర్లు, 20 టార్గెట్లకు 1.8 కోట్లు, పది అదనపు టార్గెట్లకు 1.1 కోట్లు వసూలు చేస్తుంది. మరో నివేదిక ప్రకారం మన దేశంలో ఒక్క ఐఫోన్ కు పెగసాస్ సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ చేయాలంటే సుమారు 45 లక్షల రూపాయలు అవుతుందని అంచనా. ధరలో తేడాలకు కారణం ఆయా ఫోన్లకు అమర్చే సాఫ్ట్ వేర్ లలో ఉండే వ్యత్యాసాలు అంటారు నిపుణులు.

    మనదేశంలో ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు నేరస్థుల ఫోన్ లు ట్యాప్ చేసేందుకు చవకైన సాంకేతిక వ్యవస్థనే వినియోగిస్తున్నారు. ప్రభుత్వం నేతలు, జర్నలిస్టుల ఫోన్ లు ట్యాప్ చేయాలంటే ఈ సాంకేతికత చాలంటారు నిపుణులు. 15 వేలు ఖరీదు చేసే UMT Spy Phone Interceptor Software తో సైతం ట్యాపింగ్ చేయవచ్చంటారు. cellular service providers కు law enforcement agency మధ్య ఉండే mediation server ల ద్వారా ఫోన్లను ట్యాప్ చేస్తారు.

    ప్రస్తుతం రెండు రకాల ఇంటర్ సెప్షన్ ఆక్టివిటీ జరుగుతోందంటారు సాంకేతిక నిపుణులు. ఒకటి: Integrated Services Digital Network –ISDN ద్వారా మొత్తం లైన్ ను ట్యాప్ చేయవచ్చు. mediation server అయితే కేవలం ఒక కాల్ మాత్రమే ట్యాప్ చేస్తుంది. Primary Rate Interface –PRI ద్వారా ప్రభుత్వ ఏజెన్సీలకు ఈ ట్యాపింగ్ సమాచారం చేరుతుంది. పోలీసులు ఈ PRI ద్వారానే ఫోన్ల సంభాషణలను వింటూ ఉంటారు.

    అవసరమైతే అటాచ్ చేసిన కంప్యూటర్ లో స్టోర్ చేస్తారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ను వేటాడేందుకు కేవలం లీజు పద్ధతిలో ట్యాపింగ్ లైన్లను అద్దెకు తీసుకుంటారు. అంటే ట్యాపింగ్ వ్యవహారం డబ్బుతో కూడుకున్న పని. మరీ అవసరమైతే తప్ప నిఘావర్గాలు వినియోగించవు. కశ్మీర్ లో ఉగ్రమూకల ఏరివేతలో సైతం A+++(ట్రిపల్ ప్లస్) గా నిర్ధారించిన మోస్ట్  వాంటెడ్ ఉగ్రవాదుల ఫోన్లను మాత్రమే ట్యాపింగ్ చేస్తారు. చాలా సందర్భాల్లో ఉగ్రవాదులు, తీవ్రవాదులు, నేరస్థులు సాంకేతికత సాయం లేకుండానే బలహీనతల కారణంగా దొరికిపోతారు.

    National Technical Research Organization-NTRO లాంటి సంస్థలు తలచుకుంటే సునాయాసంగా ట్యాపింగ్ చేయోచ్చంటారు నిపుణులు. దీనికోసం అంతర్జాతీయ స్థాయి స్పై వేర్ లు, ఇజ్రాయిల్ టెక్రాలజీలు అక్కరలేదంటారు. మన దేశంలో నేతలు వాడుతున్న మెయిళ్లు, ఫోన్ ల ట్యాపింగ్ కోసం కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదంటారు. మన దేశంలో Army intelligence సంస్థ  ‘off-the-air’ ఇంటర్ సెప్షన్ కూడా అవసరమైనప్పుడే వాడుతుందంటారు సాంకేతిక నిపుణులు.

    అయితే ఫోన్లు ట్యాప్ చేయడం, సమాచారాన్ని ఇంటర్ సెప్ట్ చేయడాన్ని నేరంగా భావించడం అజ్ఞానమే అవుతుంది. రక్షణ, భద్రత అవసరాల రీత్యా ఇంటర్ సెప్షన్ అత్యవసరం. ఆ మాటకు వస్తే కాంగ్రెస్ హయాంలో actionable intelligence కోసం ‘‘Centralised phone and data monitoring centre’’ ఏర్పాటు చేయాలని భావించింది. ఇందుకోసం ‘Big Brother server’ ను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. కేంద్ర హోం శాఖ ఇందుకోసం 8 వందల కోట్లు కేటాయంచింది. అయితే కారణాంతరాల వల్ల అది సాధ్యం కాలేదు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక బిగ్ బ్రదర్ సర్వర్ ను ఏర్పాటు చేసింది. మొత్తంగా భారతదేశ రాజకీయాల్లో పెగసాస్ ప్రహసనం ప్రతిపక్షాల పతనావస్థను సూచిస్తోంది. హూందా రాజనీతిని కనపరచాల్సిందిపోయి…దివాళాకోరు వాదనలూ, చవకబారు ఎత్తుగడలూ, నేలబారు విమర్శలూ చేస్తూ చేజేతులా అప్రతిష్ఠపాలవుతోంది. సంకుచిత ధోరణీ, మానసిక దౌర్బల్యం కారణంగా ‘హిస్టీరియా’తో బాధపడుతోంది వామపక్షం.

    Trending Stories

    Related Stories