‘ఇస్లామిక్ టెర్రరిజం’ పదాన్ని తొలగించి.. ‘హిందూ టెర్రరిజం’ అనే పదాన్ని పెట్టమని కోరిన ప్రముఖ ఓటీటీ

0
844

వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన మల్టీ-స్టారర్ ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. కాశ్మీరీ హిందువుల ఊచకోతకు సంబంధించిన కథలను ఈ సినిమా ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని అనుకుంటూ ఉన్నారు. ఈ సినిమా మార్చి 11, 2022 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. దేశంలోని పలు ప్రాంతాలలో ఈ చిత్రం ప్రత్యేక ప్రదర్శనలు వేశారు. అద్భుతమైన స్పందన వచ్చింది. ఎంతో మంది కశ్మీరీలకు ఈ సినిమా చూపించగా.. వారు ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. అద్భుతమైన రెస్పాన్స్ ఈ సినిమాకు వచ్చింది.

‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాను అడ్డుకోడానికి పలువురు ప్రయత్నించారు కూడా..! డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సినిమాను ఎన్నో బెదిరింపులను తట్టుకుని రూపొందించారు. ఎవరికీ భయపడకుండా నిజాలు మాత్రమే చెబుతున్నానన్న ధైర్యం ఆయనలో మనకు కనిపిస్తుంది. ఈ సినిమా థియేటర్ రన్ తర్వాత ఎలాగూ ఓటీటీలో విడుదల కావాల్సి ఉంది. అయితే ఓ ప్రముఖ OTT (ఓవర్-ది-టాప్) సంస్థ నిర్వాహకుడు కొన్ని పదాలను తీసేయాలని సూచించాడని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

వివేక్ అగ్నిహోత్రి 2020 సమయంలో దేశంలోని ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ హెడ్ తన ప్లాట్‌ఫారమ్‌లో ‘ది కాశ్మీర్ ఫైల్స్’ని విడుదల చేయడానికి తనను సంప్రదించినప్పుడు జరిగిన సంఘటనను వివరించారు. కోవిడ్-19 కేసులు పెరగడం వల్ల సినిమా హాళ్లను పూర్తిగా మూసివేశారు. పెద్ద బ్యానర్ ఉన్న ప్రొడక్షన్ హౌస్‌లు కూడా థియేట్రికల్ విడుదలను నిలిపివేసాయి. బదులుగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్, సోనీ లివ్, జీ 5 మొదలైన ప్లాట్‌ఫారమ్‌లలో తమ చిత్రాలను ప్రదర్శించాయి. వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ.. OTT గురించి ఎక్కువగా మాట్లాడే కంపెనీల అధినేత ఈ చిత్రాన్ని చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. నేను సాధారణ కమర్షియల్‌ మైండెడ్‌ ఫిల్మ్‌మేకర్‌ అయితే అప్పుడే డీల్‌పై సంతకం చేసి ఉండేవాన్ని. అయితే సదరు సంస్థ అధినేత.. ‘మేము మా సినిమాల్లో ‘ఇస్లామిక్ టెర్రరిజం’ అనే పదాన్ని ఉపయోగించకూడదనే అనుకున్నాం. మీరు దానిని ఉపయోగించరని నేను ఆశిస్తున్నాను’ అని చెప్పాడని వివేక్ తెలిపారు. కావాలంటే ‘హిందూ ఉగ్రవాదం’ అనే పదాలను వాడచ్చని చెప్పినట్లుగా వివేక్ వివరించారు. కొందరు సినిమాలను కూడా కంట్రోల్ చేయాలని అనుకుంటున్నారని వివేక్ తెలిపారు. ఇలాంటి వాటిని తాను అసలు పట్టించుకోలేదని.. కశ్మీర్ లో హిందువులపై జరిగిన దారుణాలను ప్రపంచానికి తెలియజేశానని అన్నారు.