అందితే జుట్టు, అందకపోతే కాళ్లు.. ఇదీ కమ్యూనిస్టుల ద్వంద్వనీతి. ఓట్ల కోసం బమ్మిని తిమ్మి చేయడానికైనా, కాళ్ల బేరానికి రావడానికైనా సిద్ధపడతారు. కేరళలో అధికార ఎల్డీఎఫ్ ప్రభుత్వం రెండునాల్కల ధోరణి మరోసారి తేటతెల్లమైంది. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ.. శబరిమల ఆలయ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించిన కమ్యూనిస్టు ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చొంది. నాడు మహిళలను శబరిమల ఆలయంలోకి పంపించడం పొరపాటేనని లెంపకాయలేసుకుంది.
2019లో జరిగిన శబరిమల వివాదం కేరళతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత.. ప్రస్తుత ఎల్డీఎఫ్ సర్కార్.. ఆనాడు పోలీసుల భద్రత మధ్య ఇద్దరు మహిళలను శబరిమల ఆలయంలోకి పంపించింది. దీంతో కేరళలో నిప్పు రాజుకుంది. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. పినరయి సర్కార్ హిందువుల ఆగ్రహావేశాలలను చవిచూడాల్సివచ్చింది. విపక్ష యూడీఎఫ్, బీజేపీ పార్టీలు ఎల్‌డీఎఫ్ ప్రభుత్వంపై విమర్శలు సంధించాయి. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమి దారుణంగా ఓడిపోయింది.
ఇక, ప్రస్తుతానికి వస్తే.. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమికే అధికారమంటూ సర్వేలు ఊదరగొడుతున్నాయి. అయితే, మెజారిటీ మాత్రం తగ్గే సూచనలు భారీగా వున్నాయంటూ తేల్చేశాయి. నిజానికి, గ్రౌండ్ లెవల్లో ఎల్డీఎఫ్ కు భిన్నమైన సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో ప్రమాదాన్ని ముందే పసిగట్టిన పినరయి విజయన్ సర్కార్ ప్లేటు మార్చింది. ఓటుబ్యాంకు రాజకీయాలు మొదలుపెట్టింది. మళ్లీ ఎక్కడ లోక్ సభ ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయేమోనని క్షమాపణల నాటకం తెరపైకి తెచ్చింది.
శబరిమల విషయంలో నాడు చేసిన తప్పుకు లెంపకాయలేసుకుంటూ.. ఇంటింటికీ తిరిగి ఓట్లడుతుతున్నారు ఎల్డీఎఫ్ అభ్యర్థులు. శబరిమల ఆలయంలోకి మహిళల్ని పంపించడం తప్పేనని.. పొరపాటు జరిగిపోయిందని వేడుకుంటున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా అధికార ఎల్డీఎఫ్ కూటమికి చెందిన మంత్రి సురేంద్రన్.. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. రెండేళ్ల నాటి సంఘటనలు చాలా బాధాకరమని.. తమ ప్రభుత్వం అలా చేసి ఉండాల్సింది కాదని.. ఇకమీదట సుప్రీం తుది తీర్పు తర్వాత.. భక్తులు, సంఘాలు, అన్ని పార్టీలను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఎల్డీఎఫ్ ఇలా ఒక్కసారిగా తనవైఖరిని మార్చుకోవడానికి నాయర్ సేవా సమితి వర్గం ఓటర్లే కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. శబరిమల వివాదంలో ముందుండి నడిపిస్తున్న నాయర్ సేవా సమితి వర్గం ఓటర్లు కేరళలో ఫలితాలను ప్రభావితం చేసే స్థితిలోవున్నారు. ముఖ్యంగా కజకూటమ్ లో 22 శాతం, కొన్నిలో 28 శాతం, త్రిశూర్ లో 16.7 శాతం నాయర్ ఓటర్లున్నారు. వీరంతా ప్రస్తుతం బీజేపీ వైపు మొగ్గచూపుతున్నారు. కొన్నిచోట్ల యూడీఎఫ్ కు మద్దతుగా వున్నారు. అటు ఈ రెండు విపక్ష పార్టీలు కూడా శబరిమల వివాదానికి కమ్యూనిస్టు వైఖరే కారణమన్న విషయాన్ని ఓటర్లకు గుర్తుచేస్తున్నారు.
దీంతో ఎక్కడ లోక్ సభ ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయోమోన్న భయంతో ఇప్పుడు ఎల్డీఎఫ్ నేతలు రూటు మార్చారు. ఇందులో భాగంగా మంత్రి సురేంద్రన్ శబరిమల వివాదంపై క్షమాపణలు చెప్పారు. అంతేకాదు, సురేంద్రన్ చెప్పిన క్షమాపణలను సీఎం పినరయి విజయన్ కూడా సమర్థించడం చూస్తే.. వారికి ఓటమి భయం వేధిస్తున్నట్టే కనబడుతోంది. శబరిమల వివాదంతో దూరమైన హిందూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకే ఎల్డీఎఫ్ ఇప్పుడు క్షమాపణల నాటకాన్ని తెరపైకి తెచ్చిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మరోవైపు, మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు.. అసలే శబరిమల వివాదంతో హిందూ ఓటర్లకు దూరమవుతున్న కమ్యూనిస్టును.. బీజేపీ మేనిఫెస్టో కమ్యూనిస్టులను మరింత బెదరగొడతోంది. అధికారంలోకి రాగానే శబరిమల కోసం ప్రత్యేక చట్టం చేస్తామని బీజేపీ ఎన్నికల హామీ ఇచ్చింది. తాజా కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ కేరళ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. శబరిమల ప్రత్యేక చట్టంతో పాటు.. లవ్ జిహాద్ పైనా ప్రత్యేక చట్టం రూపొందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కేరళలను భీభత్స రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని తేల్చిచెప్పింది. అంతేకాదు, ఇంటికో ఉద్యోగం, హైస్కూల్ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు వంటి హామీలను ప్రకటించింది. మరి, బీజేపీ మేనిఫెస్టో ఏమేరకు ఫలితాలనిస్తుందా..? కమ్యూనిస్టుల క్షమాణల డ్రామా రక్తికడుతుందా..? తెలియాలంటే ఎన్నికలయ్యేవరకు ఆగాల్సిందే.