ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొత్త నోయిడా పోలీస్ చీఫ్‌గా ఐపీఎస్ అధికారిణి లక్ష్మీసింగ్‌ను నియమించింది. రాష్ట్రంలో పోలీస్ కమిషనరేట్‌కు అధిపతిగా బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళా అధికారిణి లక్ష్మీసింగ్. 2000 బ్యాచ్‌కు చెందిన ఆమె బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు.
లక్నో రేంజ్‌లోని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పనిచేస్తున్న లక్ష్మీసింగ్ కొత్త నోయిడా పోలీసు కమిషనర్ గా నియమితులయ్యారు. వారణాసి, ఆగ్రా, ప్రయాగ్‌రాజ్ కొత్త కమిషనరేట్లతో సహా రాష్ట్రంలోని 16మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం 1995-బ్యాచ్ IPS అధికారి అలోక్ సింగ్ స్థానంలో లక్ష్మీసింగ్ నియమితులయ్యారు. అలోక్ సింగ్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా నియమించారు.
ఆమె యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షలలో మొదటి మహిళా ఐపీఎస్ టాపర్ (మొత్తం 33వ ర్యాంక్)గా గుర్తింపు పొందింది. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఉత్తమ ప్రొబేషనర్‌గా ఎంపికైంది. శిక్షణ సమయంలో ఆమెకు ప్రధానమంత్రి సిల్వర్ బేషన్,హోం మంత్రి పిస్టల్ కూడా లభించాయి. మెకానికల్ ఇంజినీరింగ్‌లో బి.టెక్ పట్టా పొందిన ఆమె 2004లో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా మొదటి పోస్టింగ్ పొందారు. 2013లో డిప్యూటీ ఐజీగా, 2018లో ఐజీగా పదోన్నతి పొందారు. లక్ష్మీసింగ్ గతంలో గౌతమ్ బుద్ధ్ నగర్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఐజీగా పనిచేశారు. ఆ తర్వాత, ఆమె మార్చి 2018 నుండి మీరట్‌లోని పోలీసు శిక్షణా పాఠశాలకు ఐజీగా నియమించబడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం గతవారం ఘజియాబాద్, ఆగ్రా, ప్రయాగ్‌రాజ్ జిల్లాల్లో మూడు కొత్త పోలీసు కమిషనరేట్లను ప్రకటించింది. ఇది లక్నో, గౌతమ్ బుద్ధ్ నగర్ (నోయిడా), వారణాసి, కాన్పూర్లలో ఇప్పటికే ఉన్న నాలుగు వాటికి అదనం. లక్నో, గౌతమ్ బుద్ధ్ నగర్‌లోని కమిషనరేట్లను జనవరి 2020లో ఏర్పాటు చేయగా, వాటిని మార్చి 2021లో వారణాసి, కాన్పూర్‌లో ఏర్పాటు చేశారు.
కొత్త నోయిడా పోలీస్ చీఫ్ లక్నోలోని సరోజినీనగర్ బిజెపి ఎమ్మెల్యే, మాజీ ED అధికారి రాజేశ్వర్ సింగ్‌ను వివాహం చేసుకున్నారు. లక్ష్మీసింగ్ 2016లో పోలీసు పతకాన్ని, 2020, 2021లో డీజీపీ రజత, బంగారు పతకాలను అందుకున్నారు. గత సంవత్సరం యూపీ ముఖ్యమంత్రి సేవా పతకంతో ఆమెను సత్కరించారు.