More

    అక్టోబ‌ర్ 11న ములాయం అంత్య‌క్రియ‌లు

    ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, స‌మాజ్‌వాది పార్టీ చీఫ్ ములాయంసింగ్ యాద‌వ్ అంత్య‌క్రియ‌ల‌ను అక్టోబ‌ర్ 11న ఆయ‌న స్వ‌గ్రామం సాయ్‌ఫాయ్‌లో నిర్వ‌హించ‌నున్నారు. గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్ప‌త్రి నుంచి ములాయం భౌతిక కాయాన్ని త‌న‌ పూర్వీకుల గ్రామ‌మైన సాయ్‌ఫాయ్‌కు త‌ర‌లించారు. ములాయం సింగ్ యాద‌వ్‌ అంత్య‌క్రియ‌ల‌ను పూర్తిగా రాష్ట్ర ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో నిర్వ‌హించ‌నున్న‌ట్లు యూపీ ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్య‌నాథ్ తెలిపారు. ములాయం మృతిప‌ట్ల ఆయ‌న తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాద‌వ్‌తో సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ఫోన్‌లో మాట్లాడారు. సామాజిక సిద్ధాంతం కోసం ములాయం తుది వ‌ర‌కు పోరాటం చేశార‌ని సీఎం యోగి ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మూడు రోజుల సంతాప దినాలు ప్ర‌క‌టించారు.

    ములాయం మృతి ప‌ట్ల ప్ర‌ధాని మోదీ నివాళి అర్పించారు. దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించిన స‌మ‌యంలో ప్ర‌జాస్వామ్యం కోసం పోరాడిన కీల‌క సైనికుడు ములాయం అని ప్ర‌ధాని మోదీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘‘యూపీ, దేశ రాజకీయాల్లో ములాయం సింగ్ యాదవ్ జీ తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు. అత్యవసర కాలంలో (ఎమర్జెన్సీ) ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడిన సైనికుల్లో మఖ్యమైన నేత. రక్షణ మంత్రిగా భారత్ ను బలోపేతం చేశారు. పార్లమెంటు చర్చల్లో ఆయన ప్రమేయం అంతర్ దృష్టితో, దేశ ప్రయోజన హితంగా ఉండేది. మేము మా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్న సమయంలో ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకున్నాం. సన్నిహిత సంబంధం అలాగే కొనసాగింది. ఆయన అభిప్రాయాలు వినడానికి నేను ఎప్పుడూ ఆసక్తి చూపేవాడిని. ఆయన మరణం నన్ను బాధిస్తోంది. ఆయన కుటుంబానికి, ఆయన లక్షలాది మద్దతుదారులకు నా సంతాపం. ఓం శాంతి’’అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

    Trending Stories

    Related Stories