భారతదేశంలో కరోనా కేసులు ఎంత ఎక్కువవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్షల్లో కరోనా కేసులు నమోదవుతూ ఉన్నాయి.. వేలల్లో మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తూ ఉన్నారు. ఎన్నో విషయాల్లో మార్గదర్శకాలను అమలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో కరోనా ఆంక్షలను ఏ మాత్రం పట్టించుకోకుండా చాలా ప్రాంతాల్లో ఈద్ షాపింగ్ లను చేశారు. భౌతిక దూరం పాటించకుండా, మాస్కులు పెట్టుకోకుండా బయట తిరిగిన వాళ్లు ఎందరో..! శుక్రవారం నాడు రంజాన్ సందర్భంగా రాజస్థాన్ లోని ఓ మసీదులో పెద్ద ఎత్తున జనం ఉండడాన్ని చూసిన పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. రాజస్థాన్ రాష్ట్రం దుంగార్ పూర్ లోని స్థానిక మసీదులో కరోనా నియమ నిబంధనలను ఉల్లంఘించి వందల సంఖ్యలో నమాజ్ కు హాజరు అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ మసీదు దగ్గరకు చేరుకుని లాఠీ ఛార్జ్ చేశారు.
ఇండియా టీవీ జర్నలిస్టు మనీష్ భట్టాచార్య కథనం ప్రకారం.. స్థానిక దుంగార్ పూర్ మసీదులో పెద్ద ఎత్తున నమాజ్ కు వచ్చినట్లుగా పోలీసులకు సమాచారం అందింది. లాక్ డౌన్ నియమాలను పట్టించుకోకుండా ఇలా అందరూ మసీదులో ఉండడంతో పోలీసులు రైడ్ ను మొదలుపెట్టారు. పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి పెద్ద సంఖ్యలో ఉండడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. సామాజిక దూరం అన్నది కనీసం పాటించలేదని వీడియోల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.
వీడియోలో పోలీసులను చూడగానే మసీదులో ఉన్న వాళ్లు పారిపోవడం గమనించవచ్చు. ఎక్కువమంది ఒకే చోట ఉండకూడదనే నియమాలను కూడా పట్టించుకోకుండా మసీదు ప్రాంగణంలో కనిపించారు. పోలీసులను చూడగానే ఒకరి తర్వాత మరొకరు తోసుకుంటూ మరీ పరిగెత్తారు. పలువురు పోలీసు దెబ్బలను కూడా రుచి చూసారు.
అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం రాజస్థాన్ లో రెండు వారాల లాక్ డౌన్ ను అమలు చేస్తూ ఉంది. మే 10 నుండి మే 24 వరకూ కఠిన లాక్ డౌన్ ను అమలు చేస్తూ ఉన్నారు. మతపరమైన సమావేశాలను బ్యాన్ చేసినప్పటికీ పెద్ద సంఖ్యలో ఇలా కనిపించడంతో పోలీసులు లాఠీలను ఉపయోగించారు.