More

    ఆర్మీలో డ్రైవర్ గా చేరి బిపిన్ రావత్ సెక్యూరిటీగా ఎదిగాడు.. అమరుడైన తెలుగు వ్యక్తి సాయి తేజ

    ఆర్మీలో ఒక మామూలు డ్రైవర్‌గా చేరి త్రివిధ దళాధిపతి వ్యక్తిగత భద్రత సిబ్బంది స్థాయికి ఎదగడం అంటే సాధారణ విషయం కాదని అందరికీ తెలిసిందే. కానీ సాయి తేజ ఆ విషయంలో ఎంతో కష్టపడ్డాడు.. ఏకంగా రక్షణ దళాల అధిపతిని మెప్పించాడు. ఆయనతో పాటే విమాన ప్రమాదంలో అమరుడయ్యాడు. తమిళనాడులోని కూనూరు వద్ద ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో జనరల్ బిపిన్ రావత్ మరణించారు. మిలిటరీ హెలికాప్టర్ కూలి 13 మంది మృతి చెందగా.. ఓ వ్యక్తి తీవ్రంగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఈ దుర్ఘటనలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కూడా ఉన్నాడు. చిత్తూరు జిల్లా కురుబలకోట వాసి సాయితేజ ఈ ప్రమాదంలో అమరుడయ్యాడు. లాన్స్‌ నాయక్‌ హోదాలో సాయితేజ్‌ రావత్‌ పర్సనల్‌ సెక్యూరిటీ అధికారిగా పనిచేస్తున్నాడు. సాయితేజ్‌ భార్యతో చివరిసారిగా బుధవారం ఉదయం ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. సీడీఎస్ బిపిన్‌ రావత్‌‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా సాయితేజ్ విధులు నిర్విహిస్తున్నాడు. 2013లో ఆర్మీలో జాయిన్ అయ్యాడు సాయితేజ్. సాయితేజ్ మరణంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సాయితేజ్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. చివరిసారిగా వినాయక చవితికి సాయితేజ్ స్వగ్రామానికి వచ్చినట్లు బంధువులు తెలిపారు.

    చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడకు చెందిన రైతు మోహన్, భువనేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు సాయితేజ (29), చిన్న కొడుకు మహేష్ బాబు (27). ఇద్దరు కుమారులూ ఆర్మీలో సైనికులే. సాయితేజ తిరుపతి ఎంఆర్‌పల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి, మదనపల్లెలో ఇంటర్ పూర్తి చేశాడు. మదనపల్లెలో డిగ్రీ చేరిన కొన్ని నెలల్లోనే ఆర్మీలో చేరాలని భావించి గుంటూరులో ఆర్మీ కోచింగ్ తీసుకున్నాడు.. కొన్ని నెలల్లోనే సైన్యంలో స్థానం సంపాదించాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ బిపిన్ రావత్ కు వ్యక్తిగత భద్రతా అధికారిగా నియమితుడయ్యాడు. సాయితేజ తమ్ముడు మహేష్ సిక్కింలో విధులు నిర్వర్తిస్తున్నాడు.

    భార్య శ్యామలతో లాన్స్‌నాయక్‌ బి.సాయితేజ బుధవారం ఉదయం 8.45 గంటలకు మాట్లాడాడని తెలుస్తోంది. భార్య, పాపను వీడియోకాల్‌లో చూస్తూ తాను చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌తో కలిసి తమిళనాడు వెళుతున్నానని చెప్పాడు. వీలు కుదిరితే సాయంత్రం చేస్తానని సాయితేజ చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సిపాయిగా ఆర్మీలో చేరిన సాయితేజ తొలుత డ్రైవర్‌గా.. ఆ తర్వాత పారా కమాండో అయ్యాడు. 2012లో ఆర్మీ సిపాయిగా బెంగళూరు రెజిమెంట్ నుంచి ఎంపికైన సాయితేజ.. కొంతకాలం జమ్ము కశ్మీర్‌లో విధులు నిర్వర్తించాడు. ఏడాది తర్వాత పరీక్ష రాసి పారా కమాండోగా సెలక్ట్ అయ్యారు. మెరుపు దాడుల్లో దిట్టైన సాయి తేజ బెంగళూరుతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో పనిచేశాడు. సాయితేజ శక్తి సామర్థ్యాలను గుర్తించిన బిపిన్ రావత్.. తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరిగా నియమించారు. బుధవారం నాడు జరిగిన ప్రమాదంలో ఆయనతో పాటే అమరుడయ్యాడు సాయి తేజ.

    Trending Stories

    Related Stories