5వ దాణా కుంభకోణం కేసులో కూడా లాలూ యాదవ్ దోషే

0
843

ఆర్‌ఎల్‌డీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను డోరండా ట్రెజరీ కేసులో దోషిగా తేల్చింది రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు. 2013 నుంచి దాణా కుంభకోణంలో లాలూ యాదవ్‌కు ఇదివరకే నాలుగు కేసుల్లో శిక్ష పడగా, ఆయనపై ఇది ఐదవవది. ఈ కేసులో లాలూ యాదవ్‌తో సహా 75 మందిని నేరస్తులుగా ప్రకటించగా.. 24 మంది నేరస్థులను విడుదల చేశారు. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు శిక్ష ఖరారు కావాల్సి ఉంది. ఫిబ్రవరి 21న అందుకు సంబంధించి ప్రకటన రానుంది.

దేశం మొత్తంలోనూ అప్పట్లో హాట్ టాపిక్ అయిన దాణా కుంభకోణానికి సంబంధించిన కేసులో ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌తోసహా మొత్తం 110 మంది నిందితులుగా ఉన్నారు. జనవరి 29న డిఫెన్స్ తరపున వాదనలు పూర్తి చేసిన తర్వాత… సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో లాలు ప్రసాద్‌ యాదవ్‌ని సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్థారణ చేస్తూ తీర్పును వెలువరించింది. దాణ కుంభకోణంకి సంబంధించిన ఐదో కేసులో డోరాండా ట్రెజరీ నుండి రూ. 139.35 కోట్లు అక్రమంగా విత్‌డ్రా చేసిననట్లు నిర్ధారించింది. ఈ మేరకు సీబీఐ కోర్టు మొత్తం దాణా కుంభకోణానికి సంబంధించి ఐదు కేసుల్లో దోషిగా తేల్చారు. ఈ కేసులో 98 మంది నిందితులు భౌతికంగా హాజరు కావాల్సి ఉండగా 24 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. మిగిలిన వారిలో మాజీ ఎంపీ జగదీష్ శర్మ, అప్పటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ ధ్రువ్ భగత్ సహా 35 మందికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఈ కేసులో లాలూ యాదవ్‌తోపాటు మరో 39 మంది దోషులకు ఫిబ్రవరి 21న శిక్ష ఖరారు కానుంది. ఈ కేసులో విచారణ నిమిత్తం లాలూ 24 గంటల ముందే జార్ఖండ్ రాజ‌ధాని రాంచీ చేరుకున్నారు. లాలు రాంచీలోని స్టేట్ స్టేటస్ హోమ్‌లో ఉంటున్నారు. మొత్తం ఐదు దాణా కుంభకోణం కేసుల్లో లాలూ ప్రసాద్ యాదవ్ నిందితుడిగా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే 4 కేసుల్లో తీర్పు వెలువరించగా.. ఈ కేసులన్నింటిలోనూ నేరస్తుడుగా పేర్కొంటూ కోర్టు ఆయ‌న‌కు శిక్ష విధించింది. చైబాసా ట్రెజరీకి సంబంధించిన రెండు వేర్వేరు కేసుల్లో లాలూ యాదవ్‌కు ఏడేళ్లు, దుమ్కా ట్రెజరీ నుంచి అక్రమంగా విత్‌డ్రా చేసిన కేసులో 5 ఏళ్లు, డియోఘర్ ట్రెజరీ నుంచి అక్రమంగా ఉపసంహరించుకున్న కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. మొత్తం నాలుగు కేసుల్లో లాలూ యాదవ్ జైలు శిక్ష అనుభవిస్తూనే యాభై శాతం శిక్షా కాలాన్ని పూర్తి చేశారు.

లాలూ దాణా కుంభకోణం
దాణా కుంభకోణంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రమేయం ఉంది. ఇందులో బీహార్‌లోని అనేక జిల్లాల్లోని వివిధ ట్రెజరీల నుండి ప్రభుత్వ నిధులను అక్రమంగా పక్క దోవ పట్టించారని ఆరోపించారు. 1996లో కుంభకోణం బయటపడే వరకు చాలా ఏళ్లుగా పశువులకు మేత, ఇతర ఖర్చుల నెపంతో 950 కోట్లు దోచుకున్నారని ఆరోపణలు వచ్చాయి.