లాల్ బహదూర్ శాస్త్రి.. మన దేశ రెండో ప్రధాన మంత్రి..! స్వాతంత్ర్యానికి ముందు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన గాంధేయవాది కూడా..! ఆయన మహాత్ముడు జన్మించిన అక్టోబర్ రెండవ తేదీనే పుట్టిన మరో మహాత్ముడు..! కానీ, లాల్ బహదూర్ శాస్త్రి ఎప్పుడు మరణించారు..? సోవియట్ రష్యాలోని తాష్కెంట్ నగరంలో లాల్ బహదూర్ జనవరి 11న అనుమానాస్పద స్థితిలో తనువు చాలించారు..!
1966, జనవరి 11న ఏమైంది..? ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నే..! భారతదేశ ఆధునిక రాజకీయ శకంలో లాల్ బహదూర్ శాస్త్రి మరణం.. ఓ సమాధానం లేని ప్రశ్న..! అమెరికన్ సీఐఏ.. భారతీయ అణు శాస్త్రవేత్త హోమి జహంగీర్ బాబాతో పాటూ.. శాస్త్రీజీని కూడా హత్య చేయించిందని చాలా మంది భావిస్తుంటారు. ఆ విషయం అటు అమెరికాగానీ, ఇటు భారత్ గానీ అధికారికంగా ఒప్పుకునే అవకాశం కనుచూపు మేరలో లేదు..! అయితే, గొప్ప దేశభక్తుడైన లాల్ బహదూర్ శాస్త్రి తన తుది శ్వాస వరకు భరతమాత కోసమే జీవితాన్ని ధారపోశారు. అందులో ఎలాంటి సందేహం లేదు. భారత స్వాతంత్ర్య సంగ్రామం అంటే గాంధీ, నెహ్రూ అని చెప్పుకునే మనం లాల్ బహదూర్ ని ఎంతోకొంత నిర్లక్ష్యం చేశామని చెప్పటంలో తప్పేం లేదు. అయితే, బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఆయన 1947 తరువాత కూడా దేశ సేవలో అనుక్షణం తనని తాను నిమగ్నం చేసుకున్నారు. ఆ క్రమంలో కుట్ర పూరితంగా మనపైకి దండెత్తి వచ్చిన పాక్‌ను చిత్తుచిత్తుగా యుద్ధ రంగంలో ఓడించారు. ‘జై జవాన్.. జై కిసాన్’ అన్న చారిత్రక నినాదాన్ని జాతికి అందించారు..! పక్క దేశపు కరాచీ నగరం దాకా దూసుకెళ్లి మన సేనలు భారతదేశ సత్తాని ప్రపంచానికి చాటాయి..! అందుకు, ప్రధాన కారణం.. లాల్ బహదూర్ శాస్త్రి నిస్వార్థ, నిష్కళంక నాయకత్వం..!
నెహ్రూ ప్రధానిగా ఉండగా.. చైనా చేతిలో భారత్ ఓ యుద్ధం ఓడిపోయింది..! అదే అదునుగా మరికొన్నాళ్లకే పాక్ తన పైత్యం ప్రదర్శించింది. కానీ, ఈసారి ప్రధానిగా నెహ్రూ స్థానంలో లాల్ బహదూర్ శాస్త్రి ఉండటంతో.. ఇస్లామాబాద్ మతోన్మాదులకి పట్టపగలు చుక్కలు కనిపించాయి. అత్యంత దారుణ పరాభవం పాకిస్థాన్ సైన్యానికి తప్పలేదు..!
కేవలం 5 అడుగుల 2 అంగుళాలు మాత్రమే పొడవుండేవారు శాస్త్రీజీ..! చూడటానికి పొట్టివారైనా.. దేశ నాయకుడిగా ఆయన సాధించిన ఎత్తుల్ని.. ఈనాటికి కూడా ఎవరూ అందుకోలేరు..! కేవలం 19 నెలలు మాత్రమే ప్రధానిగా సారథ్యం వహించిన ఆయన ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ప్రధానంగా పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్‌ని అగ్రగామిని చేశారు. వైట్ రెవల్యూషన్‌తో ఊరుకోకుండా.. గ్రీన్ రెవల్యూషన్ పేరుతో భారతదేశ ఆహార ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచారు..! లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని అయ్యే నాటికి మన దేశంలో వ్యవసాయ సాగు మరీ తక్కువగా ఉండేది. తగినంత ఆహార నిల్వలు లేక లక్షల మంది ఆకలితో అలమటించేవారు. అందుకే, ఆయన ప్రజలందర్నీ ప్రతీ సోమవారం ఉపవాసం చేయమన్నారని చెబుతారు..! జనాన్ని ఒక్క మాటతో కదిలించగల నాయకత్వ పటిమ ఆయనది..!
లాల్ బహదూర్ శాస్త్రి అంటే.. రెండో ప్రధాని, పాక్ పై యుద్ధంలో గెలుపు, క్షీర విప్లవం, హరిత విప్లవం.. ఇంతే కాదు. ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది..! అసలు స్వతంత్రం వచ్చాక.. ఆయన లాంటి నాయకులు, పాలకులు మనకు అత్యంత అరుదు. వేళ్ల మీద లెక్క పెట్టగలం. ఒకరిద్దరు నిస్వార్థ, నిఖార్సైన దేశభక్తులు మనకు కనిపించినప్పటికీ.. శాస్త్రీజీతో సమానం అని మనం చెప్పలేం. అంతటి అనుపమానమైన వ్యక్తిత్వం, వైశిష్ట్యం ఆయనది..!
లాల్ బహదూర్ శాస్త్రీ జీవితాంతం పేదవాడిగానే బ్రతికారు. ఆయన ఏనాడూ కార్లు, బంగళాలు పోగేయలేదు. చిన్ననాడు చదువుకునేందుకు గంగా నదిని ప్రతీ రోజూ దాటాల్సి వచ్చేది. పడవ వాడికి ఇచ్చేందుకు డబ్బులు లేక.. లాల్ బహదూర్ ఉదయం, సాయంత్రం నదిలో ఈదుకుంటూ వెళ్లేవారట..! అలా రోజులు, నెలల తరబడి కొనసాగించారు..!
శాస్త్రీజీ అసలు పేరు లాల్ బహదూర్ శ్రీవాత్సవ. అయితే, తన ఇంటి పేరులో కులం కనిపిస్తోందని భావించిన ఆయన 12 ఏళ్ల వయస్సులోనే శ్రీవాత్సవను తొలగించారు. తరువాతి కాలంలో ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయటంతో.. శాస్త్రి అనే బిరుదు లభించింది..! అలా లాల్ బహదూర్ శ్రీవాత్సవ.. లాల్ బహదూర్ శాస్త్రి అయ్యారు..! గాంధేయవాది అయిన ఆయన జీవితాంతం కుల వివక్షకి వ్యతిరేకంగా కట్టుబడి జీవించారు..! శాస్త్రీజీ.. తన స్వాతంత్ర్య పోరాట జీవితంలో.. మొత్తం 7 సార్లు అరెస్ట్ అయ్యారు. 9 ఏళ్లు జైల్లో గడిపారు.
నెహ్రూ ప్రధానిగా ఉన్న కాలంలో ఆయనకు రైల్వే శాఖ బాధ్యతలు అప్పగించారు. అప్పుడు ఓసారి రైలు ప్రమాదం జరిగితే లాల్ బహదూర్ శాస్త్రి స్వచ్ఛందంగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు..! ఈనాటి మంత్రులు, నేతల కుర్చీ కాంక్షల్ని చూస్తే.. ఆయన స్థాయి, వ్యక్తిత్వం ఎలాంటివో.. మనకు ఇట్టే అర్థమవుతాయి..!
‘భారతరత్న’ లాల్ బహదూర్ శాస్త్రీ జీవితంలో.. రత్నాల్లా మెరిసిపోయే అద్భుత సందర్భాలెన్నో..! దేశం అంటే ఆయనకు ఎంతటి ప్రేమో, ఎంతటి కర్తవ్యమో.. ఈ ఒక్క సన్నివేశంతో తేలిపోతుంది..! లాలా లజ్ పత్ రాయ్ ‘సర్వెంట్స్ ఆఫ్ ద పీపుల్ సొసైటి’ అనే స్వచ్ఛంద సంస్థని స్థాపించారు. దాని ద్వారా నిరుపేదలైన స్వతంత్ర సమర వీరుల కుటుంబాలకి ఆర్దిక సాయం చేసేవారు. బ్రిటీషు వార్ని ఎదురించిన లాల్ బహదూర్ కూడా అప్పట్లో జైలుకి వెళ్లారు. ఆయన భార్యా, పిల్లలకి పూట గడవటం కూడా కష్టంగా ఉండేది. అప్పుడు ‘సర్వెంట్స్ ఆఫ్ ద పీపుల్ సొసైటి’ నుంచీ వారికి నెలకు 50 రూపాయల ఆర్దిక సాయం అందుతుండేది. కానీ, ఓ సారి జైల్లో ఉన్న శాస్త్రీజీకి తెలిసింది ఏంటంటే.. తమ కుటుంబం నడవటానికి నలభై రూపాయలు చాలని..! పది రూపాయలు ప్రతీ నెలా మిగిలిపోతున్నాయని..! వెంటనే.. ఆయన ‘సర్వెంట్స్ ఆఫ్ ద పీపుల్స్ సొసైటి’ వారికి లేఖ రాశారు.. ‘50 రూపాయలు వద్దు.. 40 మాత్రం చాలు’ అని..! అలా ఆ పది రూపాయలు మరెవరైనా అర్హులైన దేశభక్తులకి చెందాలనేది ఆయన నిశ్చిత అభిప్రాయం..!
లాల్ బహదూర్ శాస్త్రీలో కనిపించే కరుడుగట్టిన నిజాయితీని.. మనం దాదాపుగా మరెవ్వరిలోనూ చూడలేం..! ఆయన కూతురు ఓసారి అనారోగ్యంతో మంచం పట్టింది. ఆమెను చూడటానికి జైల్లో ఉన్న శాస్త్రీజీ అధికారులకి విన్నపం పెట్టుకున్నారు. అప్పుడు 15 రోజుల కోసం పెరోల్ అడగ్గా.. బ్రిటీషు వారు ఆయనకు 21 రోజులు ఇంటికి వెళ్లి వచ్చేందుకు పర్మిషన్ ఇచ్చారు..! లాల్ బహదూర్ నిష్కళంక వ్యక్తిత్వం తెల్లవార్ని కూడా అంతలా మెప్పిస్తుండేది..!
జైలు నుంచి ఇంటికి వచ్చిన లాల్ బహదూర్ శాస్త్రీ కన్న కూతుర్ని కాపాడుకోలేకపోయారు. దేశం కోసం పోరాడుతోన్న ఆయన తగినన్ని డబ్బులు పోగేయలేకపోయారు. దాంతో కళ్ల ముందే బిడ్డ సరైన మందులు లేక మరణించింది. శాస్త్రీజీ ఆమెకు అంత్యక్రియలు నిర్వహించి.. ఇంటికి తిరిగి వస్తూ.. భార్యతో ఓ మాట చెప్పారు..! తాను చూడటానికి వచ్చిన కూతురే ప్రాణాలు విడిచేసింది. ఇప్పుడు ఇక తాను ఇంట్లో ఉండి కూడా అర్థం లేదన్నారు లాల్ బహదూర్..! అలా భార్యకి చెప్పి.. నేరుగా జైలుకి వెళ్లి.. 21 రోజుల పెరోల్ ముగియక మునుపే, అధికారుల ముందు లొంగిపోయారు..! కన్న కూతుర్ని పొగొట్టుకున్న బాధ కంటే కూడా నమ్మిన సిద్ధాంతానికి, విలువలకి కట్టుబడటమే ముఖ్యం అనుకున్నారాయన..!
1964, జూన్ 9న ప్రధాన మంత్రిగా దేశ పగ్గాల్ని చేపట్టిన ఆయన తరువాత కూడా చాలా సాదాసీదాగానే ఉండేవారు. ఓ సారి ఆయన తన భార్య, పిల్లలతో ఢిల్లీలోని గవర్నమెంట్ సర్వీసు బస్సులో ప్రయాణించటం ఓ దూరదర్శన్ జర్నలిస్టు కంటపడింది..! తరువాత ఆయనే లాల్ బహదూర్ శాస్త్రీని ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు జర్నలిస్టు బస్సులో ప్రయాణం విషయం అడిగాడు. ప్రధాని అయ్యి ఉండి.. భార్యా, పిల్లలతో ఎర్ర కోట చూడటానికి బస్సులో రావటం ఏంటని ఆశ్చర్యంగా ప్రశ్నించాడు..! తాను పని దినాల్లో మాత్రమే ప్రైమినిస్టర్ అని.. ఆదివారాల్లో, సెలవుల్లో కాదని చెప్పిన ఆయన.. ప్రభుత్వం ఇచ్చిన కారు వాడటం ఇష్టం లేక పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ఎర్ర కోట వద్దకి కుటుంబంతో వచ్చానని చెప్పారు..! నిర్ఘాంతపోవటం.. ఇంటర్వ్యూ చేసినాయన వంతైంది..!
లాల్ బహదూర్ శాస్త్రీజీ తరువాతి కాలంలో స్వంత కారు కొన్నారు. అయితే, ఆయనకు అందుకు తగినంత డబ్బు లేకపోవటంతో 12 వేల రూపాయల లోన్ తీసుకుని ఫియట్ కార్ ఖరీదు చేశారు..! ప్రస్తుతం మన దేశంలో చాలా మంది నాయకులు పదవి రాగానే.. క్వాన్వాయ్ లోని వాహనాలు మొత్తం మార్చేయటం.. సర్వ సాధారణం..! అందుకే, లాల్ బహదూర్ శాస్త్రీ అత్యంత అరుదైన దేశభక్తుడుగా చరిత్రలో నిలిచిపోయారు..!
మన దేశ రెండవ ప్రధాని గురించి ఇంకా అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అవి వినగానే ఈనాటి కుంభకోణాల యుగంలో ఉన్న మనకు అసలు నమ్మబుద్ధి కాదు..! అయినా, అవన్నీ మన లాల్ బహదూర్ జీవితంలోని నమ్మలేని నిజాలే!
ఆయన ఓ సారి స్వయంగా రేషన్ షాపుకి వెళ్లి కెరోసిన్ కొన్నారట. రేషన్ కార్డులో లాల్ బహదూర్ శాస్త్రీ అనే పేరు చూసి కొట్టు యజమాని మొదట నమ్మలేదట..! చివరకు, డబ్బాలో కెరోసిన్ నింపాక సెక్యూరిటీ వాళ్లు వచ్చి మోసుకెళ్లటం చూసి.. షాక్ అయ్యాడట..! తన ముందు ఉన్నది సాక్షాత్తూ భారతదేశ ప్రధాని అని గ్రహించి బిగుసుకుపోయాడట..!
మరో సందర్భంలో లాల్ బహదూర్ శాస్త్రీ తనయుడు అనిల్ శాస్త్రీ కాలేజీలో సీటు కోసం వెళ్లాడంటారు. అందరితో పాటూ ఎండలో క్యూ లైన్లో నిలుచున్న ప్రధాని కుమారుడు వేడి తాళలేక స్పృహ కోల్పోయాడు. వెంటనే చుట్టుప్రక్కల వారు అతడ్ని డాక్టర్ వద్దకి తీసుకెళ్లారు. ట్రీట్మెంట్ పూర్తయ్యాక లేచి కూర్చున్న అనిల్ శాస్త్రీని తండ్రి పేరు అడిగాడు, డాక్టర్! చాలా సేపు తటపటాయించిన అనిల్ శాస్త్రీ.. చివరకు లాల్ బహదూర్ శాస్త్రీ అంటూ నిజం చెప్పాడు..! కానీ, డాక్టర్ నమ్మలేకపోయాడు. ఈలోపు స్వయంగా శాస్త్రీజీ అక్కడకు రావటంతో అందరికీ విషయం అర్థమైంది..! ప్రధాని కొడుకే.. కాలేజీ సీటు కోసం.. క్యూలో నిలబడి వడ దెబ్బకు గురయ్యాడని అందరూ తెలుసుకున్నారు..! అవాక్కయ్యారు..!
తన కుటుంబంలోని వారు.. ప్రధానిగా ఉన్న తన పేరుని.. ఎక్కడా వాడుకోవద్దని నియమం పెట్టిన లాల్ బహదూర్ శాస్త్రీని.. మనం ఏమని పొగడగలం..? ఎలా నిర్వచించగలం..? మాటలకు అందని అసలు సిసలు మహాత్ముడు ఆయన..! అతడి లాంటి దేశభక్తుల్ని, నాయకుల్ని అనేక మందిని మనకు ప్రసాదించమని దేవుడ్ని మాత్రం కోరుకోగలం..! అయినా కూడా అది అంత సులభ సాధ్యం కాదు..! ఎందుకంటే, లాల్ బహదూర్ శాస్త్రీ లాంటి మచ్చలేని మహానుభావులు.. ఒక్కరొక్కరే వస్తారు..! ఒక్కసారే వస్తారు..! ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నా సూర్యుడు ఒక్కడే..! పౌర్ణమి నాటి రాత్రి మేఘాలు ఎన్ని ఉన్నా.. నిండు చంద్రుడు ఒక్కడే..! లాల్ బహదూర్ కూడా.. THE ONE.. AND THE ONLY ONE..!