More

    లఖింపూర్ ఖేరి ఘటనపై కీలక నిర్ణయాలు తీసుకున్న యూపీ ప్రభుత్వం

    లఖింపూర్ ఖేరి ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఘటనపై విచారించడానికి రిటైర్డ్‌ జడ్జీ ప్రదీప్‌ కుమార్‌ శ్రీవాస్తవతో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిషన్ తన విచారణను రెండు నెలల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. మరికొన్ని నెలల్లో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో లఖింపూర్ ఖేరి ఘటన చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే లఖింపూర్ ఖేరిలో రైతుల నిరసన సందర్భంగా చోటుచేసుకున్న హింసాకాండను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. సోమవారం కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్‌పై హత్య కేసు నమోదు చేశారు. కానీ ఇప్పటి వరకు అతన్ని అరెస్టు చేయలేదు. లఖింపూర్ ఖేరి ఘటనకు కారణమైన కారు తనదేనని కేంద్ర సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా అన్నారు. అయితే ఆ సమయంలో తన కుమారుడు ఆశిష్ మిశ్రా అందులో లేడని చెప్పారు. రైతుల మీద‌కు దూసుకువెళ్లిన ఆ కారు త‌మ‌దే అని.. కానీ ఆ కారులో త‌మ కుమారుడు లేడ‌ని అజయ్ కుమార్ మిశ్రా చెప్పారు. కారు దూసుకువెళ్ల‌డం, ఆ త‌ర్వాత హింస చెల‌రేగిన స‌మ‌యంలో అక్క‌డ తాను కానీ, త‌న కుమారుడు కానీ లేర‌ని మంత్రి తెలిపారు. రైతుల‌పైకి వెళ్లిన మ‌హేంద్ర థార్ కారు త‌మ‌దే అని మొద‌టి రోజు నుంచి చెబుతున్నాన‌ని, అది మా పేరు మీదే రిజిస్ట‌ర్ అయి ఉంద‌ని కూడా అన్నారు. త‌మ పార్టీ వ‌ర్క‌ర్ల‌ను పిక‌ప్ చేసుకునేందుకు వెళ్తోంద‌ని, ఆ స‌మ‌యంలో మా కొడుకు మ‌రో వేదిక వ‌ద్ద ఉన్నార‌ని, మ‌రో ఈవెంట్‌ను అత‌ను ఆర్గ‌నైజ్ చేస్తున్నాడ‌ని మంత్రి తెలిపారు. తమ వాహనం మీదకు రైతులు దాడి చేశారని.. ఆ సమయంలో డ్రైవర్ కు కూడా గాయాలవ్వడంతో కారును అదుపు చేయలేకపోయాడని వెల్లడించారు.

    లఖింపూర్ ఖేరి ఘ‌ట‌న‌పై తాజాగా అజ‌య్ మిశ్రా త‌న‌యుడు ఆశిష్ మిశ్రాకు యూపీ పోలీసులు స‌మ‌న్లు జారీ చేశారు. విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని అడిగారు. ఈ కేసుకు సంబంధించి ఐజీ రేంజ్ ల‌క్ష్మీ సింగ్ స్పందిస్తూ చాలా ఆధారాలు ల‌భించాయ‌ని, ఇద్ద‌రిని విచార‌ణ కోసం పిలిచామ‌ని చెప్పారు. లఖింపూర్ ఖేరిలో రైతుల‌ను తొక్కించిన వాహ‌నంలోనే ఆశిశ్ మిశ్రా ఉన్నార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ ఘ‌ట‌న‌పై గురువారం సుప్రీంకోర్టు విచార‌ణ జ‌రిపింది. ఈ కేసులో ఎంత మందిని అరెస్ట్ చేశారు వంటి పూర్తి వివ‌రాల‌తో శుక్ర‌వారం నివేదిక‌ను స‌మ‌ర్పించాల‌ని యూపీ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.

    Related Stories