లఖింపూర్ ఖేరిలో హింస చెలరేగిన ప్రదేశంలో తన కుమారుడు ఆశిష్ ఉన్నాడని ఒక్క ఆధారం ఉంటే తన పదవికి రాజీనామా చేస్తానని కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా చెప్పారు. లఖింపూర్ ఖేరీలో సంఘటన జరిగినప్పుడు నా కుమారుడు అక్కడ ఉన్నట్లయితే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆయన తేల్చి చెప్పారు.
రైతుల మీదకు దూసుకువెళ్లిన ఆ కారు తమదే అని.. కానీ ఆ కారులో తమ కుమారుడు లేడని ఆయన చెప్పారు. కారు దూసుకువెళ్లడం, ఆ తర్వాత హింస చెలరేగిన సమయంలో అక్కడ తాను కానీ, తన కుమారుడు కానీ లేరని మంత్రి తెలిపారు. రైతులపైకి వెళ్లిన మహేంద్ర థార్ కారు తమదే అని మొదటి రోజు నుంచి చెబుతున్నానని, అది మా పేరు మీదే రిజిస్టర్ అయి ఉందని కూడా అన్నారు. తమ పార్టీ వర్కర్లను పికప్ చేసుకునేందుకు వెళ్తోందని, ఆ సమయంలో మా కొడుకు మరో వేదిక వద్ద ఉన్నారని, మరో ఈవెంట్‌ను అతను ఆర్గనైజ్ చేస్తున్నాడని మంత్రి తెలిపారు. తమ వాహనం మీదకు రైతులు దాడి చేశారని.. ఆ సమయంలో డ్రైవర్ కు కూడా గాయాలవ్వడంతో కారును అదుపు చేయలేకపోయాడని వెల్లడించారు.
లఖింపుర్ హింస సమయంలో మరో చోట తమ కుమారుడు ఉన్నాడని, దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఉన్నాయని, కాల్ రికార్డులు, సీడీఆర్, లొకేషన్లను చెక్ చేస్తే ఆ విషయం తెలుస్తుందని మంత్రి అన్నారు. ఆశిష్ మిశ్రా మరో చోటు ఉన్నాడన్న విషయంలో అఫిడవిట్ ఇచ్చేందుకు వేల మంది ఆసక్తిగా ఉన్నట్లు మంత్రి అజయ్ మిశ్రా తెలిపారు. తమకు కారుకు చెందిన డ్రైవర్ మృతిచెందాడని, అతనితో పాటు మరో ఇద్దరు పార్టీ కార్యకర్తలు కూడా మృతిచెందినట్లు చెప్పారు. ఫార్చునర్‌ను కాల్చేశారని, వాళ్లు రైతులు కాదని.. రైతుల ముసుగులో దాగి ఉన్న తీవ్రవాదులని మంత్రి విమర్శలు చేశారు.