ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీ ఘటనకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన ఆందోళనలు హిమాసాత్మకంగా మారాయి. ఆదివారం తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలో మరణించినవారి సంఖ్య 9కి చేరింది. కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాతోపాటు 13 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. లఖీంపూర్ ఖేరీలో పరిస్థితి ఉద్రిక్తతగా ఉంది. ముందు జాగ్రత్త చర్యగా ఇంటర్నెట్ నిలిపివేశారు. భారీ సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించాయి. రాజకీయ నేతలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఘటన జరిగిన తికునియా గ్రామం చుట్టూ భారీ బారికేడ్లు ఏర్పాటు చేశారు.
ఏబీపీ న్యూస్ రిపోర్టర్ రామన్ కశ్యప్ లఖీంపూర్ ఖేరీలో చెలరేగిన హింసలో మరణించినట్లు ప్రకటించారు. మీడియా హౌస్ ఎడిటర్ పంకజ్ ఝా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఇదే విషయాన్ని ధృవీకరించారు. “లఖీంపూర్ ఖేరీ హింసను కవర్ చేస్తున్న మా సహచరులలో ఒకరు చనిపోయారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా” అని ట్వీట్ చేశారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అతి దగ్గరలో ఉన్నందుకు పకడ్బందీగా ప్రణాళికతో హింసకు ప్రతి పక్షాలు పాల్పడుతున్నాయని అంటున్నారు. ఈ ఘటన దర్యాప్తులో ఉందని ఉత్తర ప్రదేశ్ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ తెలియజేశారు. విపక్షాలు ఈ ఘటనను తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటూ ఉన్నారని.. విపక్షాలు రాజకీయం కోసం ఈ సంఘటనను ఉపయోగిస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేయడానికి ప్రయత్నించే ఎవరినీ ప్రభుత్వం అనుమతించదని సిద్ధార్థ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. మృతదేహాలను అడ్డం పెట్టుకుని 2022 ఎన్నికల వరకు వారు తమ ప్రయాణాన్ని పూర్తి చేయాలనుకుంటే, అది జరగదని మంత్రి ప్రతిపక్షాలను హెచ్చరించారు.
ఆదివారం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలకు రూ.45 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ కుటుంబాల్లో ఒకరికి చొప్పున ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని భరోసా ఇచ్చింది. క్షతగాత్రులకు సైతం రూ.10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇస్తుందని యూపీ ఏడీజీ (శాంతిభద్రతలు) ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఈ ఘటనపై రిటైర్డ్ హైకోర్టు జడ్జి దర్యాప్తు జరుపుతారని చెప్పారు. లఖీంపూర్ ఖేరీ హింసాకాండ అనంతరం బాధితులను పరామర్శించేందుకు ఛత్తీస్ ఘడ్ సీఎం బాఘేల్, పంజాబ్ డిప్యూటీ సీఎం రాంధవాలను అనుమతించరాదని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ సర్కారు నిర్ణయించింది.