కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లో భూమి స్వల్పంగా కంపించింది. లడఖ్‌లోని లేహ్‌లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.30 గంటలకు భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. అర్ధరాత్రి వేళ భూమి కంపించడం వల్ల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. మయన్మార్‌లో కూడా భూమి కంపించింది. గురువారం అర్ధరాత్రి 11.58 గంటలకు మయన్మార్‌లోని మోన్యవా ప్రాంతంలో భూ కంపం వచ్చింది. దీని తీవ్రత 5.5గా నమోదయిందని ఎన్సీఎస్ తెలిపింది.
జపాన్ లో కూడా భూకంపం:
జపాన్ రాజధాని టోక్యోలో గురువారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. టోక్యోలోని చిబా ఫ్రిఫెక్చర్‌లో 6.1 తీవ్రతతో భూమి కంపించిందని అధికారులు తెలిపారు. టోక్యోకు తూర్పున ఉన్న చిబా ప్రిఫెక్చర్లో 80 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైందని వాతావరణ సంస్థ తెలిపింది. ఈ భూకంపం కారణంగా.. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. కొన్ని కార్యాలయాల పైకప్పు భవనాలు కదిలాయి. సునామీ లాంటి ప్రమాదం సంభవించలేదని అధికారులు ప్రకటించారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.