ఉన్నత చదువుల కోసం ఇటలీ వెళ్లిన కర్నూలు యువకుడు సముద్రంలో పడి మృతి చెందాడు. బాలాజీనగర్‌లోని బాలాజీ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న చిలుమూరు శ్రీనివాసరావు, శారద దంపతుల పెద్ద కుమారుడు దిలీప్ (24) ఇటలీలోని మిలాన్ యూనివర్సిటీలో ఎంఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్నాడు. 2019 సెప్టెంబరులో మిలాన్ వెళ్లిన దిలీప్ గతేడాది ఏప్రిల్‌లో కర్నూలు వచ్చాడు. సెప్టెంబరులో తిరిగి వెళ్లాడు. కోర్సు పూర్తి కావడంతో ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నానని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. శుక్రవారం మాంటెరుస్సో బీచ్‌కు వెళ్లాడు. సాయంత్రం వరకు అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలో ఒడ్డున కూర్చున్న దిలీప్‌ను అలలు లాక్కెళ్లాయి. వెంటనే అప్రమత్తమైన కోస్టుగార్డు సిబ్బంది రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కొద్ది సమయం తర్వాత అతడి మృతదేహం లభ్యమైంది. దిలీప్ భౌతికకాయాన్ని స్వదేశానికి తెప్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
శ్రీనివాసరావు తన కుమారుడి భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి చేర్చేందుకు సహకరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి లేఖ రాశారు. దిలీప్ ఇటలీలోని మిలానోలో ఎమ్మెస్సీ చదివేవాడు. ఈ బీచ్ మిలానో నుండి దాదాపు 220 కి.మీ. ఇటలీలో అన్ని చట్టపరమైన లాంఛనాల తర్వాత మృత దేహాన్ని వీలైనంత త్వరగా తీసుకురావడానికి శ్రీనివాసరావు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలకు లేఖలు పంపారు.