ఆయన అదృష్టం గురించే తెలుగు రాష్ట్రాల్లో చర్చ.. కోటి 20 లక్షలు రైతు చేతిలో పెట్టిన వ్యాపారి

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో అసలు చెప్పలేము..! ఎందుకంటే రాత్రికి రాత్రే జీవితాలు మారిపోతూ ఉంటాయి. అలా ఓ తెలుగు రైతు జీవితం మారిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అందుకు సంబంధించే చర్చ జరుగుతోంది.
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చిన్న జొన్నగిరి గ్రామంలో ఒక రైతుకు అదృష్టం వజ్రం రూపంలో పలకరించింది. ఓ వజ్రం గురువారం సాయంత్రం లభ్యమైంది. ఈ వజ్రాన్ని జొన్నగిరి గ్రామానికి చెందిన ఓ వ్యాపారి రూ.కోటి ఇరవై లక్షల ఇచ్చి తీసుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది. సదరు రైతు ఎప్పటిలాగే గురువారం పొలం పనులకు వెళ్లాడని.. పనుల్లో ఉండగా అతడికి విలువైన వజ్రం దొరికింది. దీంతో స్థానిక వ్యాపారులకు సమాచారం ఇచ్చాడు. ఓ వ్యాపారి వజ్రాన్ని పరిశీలించాడు. మిగిలిన వ్యాపారులకు వజ్రం ఫొటోలను ఫోన్ ద్వారా పంపించాడు. అందరి కంటే ఎక్కువగా ఓ వజ్రాల వ్యాపారి రూ.1.25 కోట్లకు ఆ వజ్రాన్ని కొనుక్కున్నాడట..! మార్కెట్లో దీని విలువ 2-3కోట్ల రూపాయల దాకా ఉంటుందని చెబుతున్నారు.
తుగ్గలి మండల పరిధిలోని జొన్నగిరి, పగిడిరాయి, మదనంతపురం, తుగ్గలి, పెరవలి పరివాహక ప్రాంతాల్లో ఏటా తొలకరి జల్లులు కురవగానే పొలాల్లో వజ్రాలు దొరుకుతుంటాయి. ఇప్పటి వరకు అత్యధికంగా రూ.80 లక్షల విలువైన వజ్రాలు మాత్రమే లభించాయని, రూ.కోటికి పైగా విలువైన వజ్రం లభించడం ఇదే మొదటిసారి అని ప్రజలు చర్చించుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతాలకు చెందిన ప్రజలకు ఇలా వజ్రాలు దొరికి వారి తలరాతలు మారిపోయాయని చెబుతున్నారు. ఈ వజ్రాలను అనంతపురం జిల్లా గుత్తికి , కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవలి , తుగ్గలి మండలం జొన్నగిరి వ్యాపారులు కొంటుంటారు. వజ్రాలను వ్యాపారులు తక్కువ రేట్‌కు కొని ఎక్కువ రేట్లకు అమ్ముకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి డబ్బులు వస్తే చాలు అన్నట్లుగా దొరికిన వజ్రాల దొరకగానే అమ్మేస్తూ ఉన్నారు కొందరు.