నా కోపం అన్న మీద కాదు.. నీ తండ్రి మీద.. కేటీఆర్ కు షర్మిల స్ట్రాంగ్ కౌంటర్..!

0
897

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటీవల ఓ మీడియా చానల్ కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. పలు అంశాలపై ఆయన స్పందించారు. కొత్తగా పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిలపైనా తన అభిప్రాయాలు పంచుకున్నారు. అసలు షర్మిల ఎవరు? ఆమెకు ఇక్కడేం పని? అని ప్రశ్నించారు. అత్తమీద కోపం దుత్త మీద చూపించినట్టు షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిందని అన్నారు. అన్న మీద కోపం ఉంటే ఏపీలో పార్టీ పెట్టుకోవాలని కానీ, తెలంగాణలో ఏర్పాటు చేస్తే ఏంలాభం? అని ప్రశ్నించారు. తెలంగాణలో షర్మిలకు ఏమైనా భాగస్వామ్యం ఉందా? అని నిలదీశారు. షర్మిల తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు బద్ధ వ్యతిరేకి అని, చచ్చేదాకా వ్యతిరేకించిన వ్యక్తి అని తెలిపారు. ఇవాళ వచ్చి నేను తెలంగాణ బిడ్డను అంటే షర్మిలను తెలంగాణ ప్రజలు ఎవరూ నమ్మరని కేటీఆర్ అన్నారు.

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఘాటుగా సమాధానం ఇచ్చారు. అన్న మీద కోపం ఉంటే తెలంగాణలో పార్టీ పెట్టడమేంటని కేటీఆర్ అంటున్నారని.. తాము పార్టీ పెట్టడానికి కారణం కేటీఆర్ అయ్య కేసీఆర్ అని షర్మిల అన్నారు. రైతుల ఆత్మహత్యలు చూడలేక, నిరుద్యోగుల ఆత్మహత్యలు చూడలేక, రీడిజైన్ల పేరుతో ప్రజాధనాన్ని దోచుకోవడం చూడలేకే తెలంగాణలో పార్టీ పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్, కేసీఆర్ లాఠీ దెబ్బలు తిన్నారా? అని ప్రశ్నించారు. ఇన్నాళ్లు బీజేపీతో డ్యూయెట్లు పాడింది మీరు అని షర్మిల అన్నారు. ఇక్కడ ఉన్నది వైఎస్సార్ బిడ్డ అని, సింహం సింగిల్ గానే వస్తుందని చెప్పారు. తమకు వైఎస్సార్ బొమ్మ ఉందని, వైఎస్సార్ అనే పేరు ఉందని అన్నారు. వైఎస్సార్ సంక్షేమ పాలనే తమ ఆస్తి అని చెప్పారు.