తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. కేంద్రం ఇచ్చిన నిధులపై బండి సంజయ్ చర్చకు రావాలని అన్నారు. నేను చెప్పినవి తప్పు అయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా… మీరు చెప్పినవి తప్పు అయితే ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు. గత ఆరున్నరేళ్లలో కేంద్రానికి పన్నుల రూపంలో రూ.2.72 లక్షల కోట్లు చెల్లించామని కేటీఆర్ వెల్లడించారు. కేంద్రం నుంచి ఫైనాన్స్ కమిషన్ రూపంలో రూ.1.42 లక్షల కోట్లు ఇచ్చారని తెలిపారు. ఎవరి పైసలతో ఎవరు కులుకుతున్నారో మీరే చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల పన్నుల ఆదాయాన్ని ఉత్తర ప్రదేశ్‌కు తరలిస్తున్నారని.. మన రక్తం, మన చెమటతో దేశంలోని వెనుకబడ్డ ఇతర రాష్ట్రాలకు నిధులు తీసుకొని వెళ్తున్నారన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఊరూరా తిరుగుతూ మొత్తం నిధులు కేంద్రానివే అని అబద్ధాలు చెప్పుతున్నారని విమర్శించారు.
మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ కు తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. కేటీఆర్ కాదు కేసీఆర్ సవాల్ విసిరితే అప్పుడు చూస్తానని అన్నారు. ‘మంత్రి కేటీఆర్ అజ్ఞాని, ఆయన సవాల్‌ను నేను స్వీకరించటం ఏంటి.. ఆయన అయ్య వస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల లెక్కలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్ద కూర్చొని చూపిస్తాను’ అని బండి సంజయ్ అన్నారు. కేటీఆర్ తుపాకీ రాముడు అని ఎద్దేవా చేశారు. యూపీఏ కంటే ఎన్డీయేనే రాష్ట్రానికి 9 శాతం అధికంగా నిధులు ఇచ్చిందని బండి సంజయ్ స్పష్టం చేశారు. పన్నుల విషయంలో రాష్ట్రానికి, కేంద్రానికి చట్టం ఉంటుందని వెల్లడించారు. కేటీఆర్ కు రాజ్యాంగం తెలియదని విమర్శించారు. ఒక్కో తెలంగాణ వ్యక్తిపై లక్ష రూపాయల అప్పు చేసినందుకు, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చినందుకు కేటీఆరే రాజీనామా చేయాలని అన్నారు. వరిపంట సాగుచేస్తే.. ఉరివేసుకోవాలని సీఎం కేసీఆర్ అనడం వల్లే ఆందోళన చెంది, రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఇది ముమ్మాటికీ కేసీఆర్ చేసిన హత్యలేనని బండి సంజయ్ ఆరోపించారు.