ఏపీలో కరెంట్, నీళ్లు లేవంటూ విమర్శలు గుప్పించిన కేటీఆర్

0
881

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ లేదు, నీళ్లు లేవని విమర్శించారు. ఏపీలోని రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్నాయని, ఏపీలోని సొంతూళ్లకు వెళ్లొచ్చిన తన మిత్రులు ఈ విషయాన్ని తనతో చెప్పారని అన్నారు. ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్టు ఉందంటున్నారని, బెంగళూరులోని కంపెనీలు కూడా ఏపీలోని అధ్యాన్నపు రోడ్ల గురించి మాట్లాడుతున్నాయని అన్నారు. “తన మిత్రుడొకరు సంక్రాంతి సందర్భంగా ఆంధ్రాలోని సొంతూరికి వెళ్లారని అక్కడికి వెళ్లిన వెంటనే తనకు ఫోన్ చేసి.. ఇక్కడ కరెంట్ లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసమయ్యాయి. అంతా అన్యాయంగా అధ్వానంగా ఉంది.. తిరిగి హైదరాబాద్ వచ్చాక ఊపిరి పీల్చుకున్నట్లుందంటూ.. కొంతమందిని ఏపీకి పంపితే తెలంగాణలో ఎంత చక్కగా ఉందో అర్థమవుతుంది” అంటూ ఆయన చెప్పినట్లు కేటీఆర్ వివరించారు. శుక్రవారం హైదరాబాద్ నగరంలో జరిగిన క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్ పో ప్రారంభించిన ఆయన.. ఏపీలో పరిస్థితికి, తెలంగాణలో పరిస్థితికి ఉన్న తేడాను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ చాలా ప్రశాంతమైన రాష్ట్రమని, దేశంలోనే హైదరాబాద్ బెస్ట్ సిటీ అని చెప్పారు. తెలంగాణలో అభివృద్ధి ఎలా ఉందో ఏపీ ప్రజలకు అర్థమైందని, నగరాల్లో మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయకపోతే వెనుకపడిపోతామని అన్నారు.