టిపిసిసి చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బుధవారం నాడు బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో నేతలు, రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చాయి. బుధవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మగుడిలో రేవంత్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాంపల్లిలోని దర్గా వద్ద ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గాలో చాదర్‌ను సమర్పించారు. అక్కడ్నించీ ఆయన గాంధీభవన్‌కు చేరుకున్నారు. గాంధీభవన్‌లో వేదపండితుల ఆశీర్వ చనాలు తీసుకున్న తర్వాత పిసిసి చీఫ్‌గా ముందుగా అనుకున్న ముహుర్తానికి బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు టిపిసిసి మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు.
ఇక తనకు ఈ పదవి ఇచ్చినందుకు సోనియా గాంధీపై పొగడ్తల వర్షం కురిపించారు. అలాగే తెలంగాణ తల్లి సోనియమ్మ అంటూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో సోనియాను బలిదేవత అని రేవంత్ అన్నారని.. ఇప్పుడేమో తెలంగాణ తల్లి అంటున్నారని అన్నారు. రేపు చంద్రబాబును తెలంగాణ తండ్రి అన్నా అంటారని ఎద్దేవా చేశారు. రేవంత్ కు ఇంకా టీడీపీ వాసనలు పోలేదని విమర్శించారు. అది టీపీసీసీ కాదని… తెలుగుదేశంపార్టీ కాంగ్రెస్ కమిటీ అని అన్నారు. పార్టీలు మారిన వారిని రాళ్లతో కొట్టాలని రేవంత్ అంటున్నారని… నువ్వు కూడా టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చావు కదా? అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. చిన్న పదవి రాగానే రేవంత్ పెద్ద బిల్డప్ ఇస్తున్నారని అన్నారు.
హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితుడైన అంజన్ కుమార్ యాదవ్ కూడా పలు ఆలయాల్లో పూజలు చేసి భారీ ర్యాలీల్లో పాల్గొన్నారు. పలు ప్రాంతాల నుంచి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అందరూ గాంధీభవన్ చేరుకున్నారు. కాంగ్రెస్ నేతలు భారీ జనసమీకరణకు పిలుపునివ్వడంతో ప్రజలకు ఇబ్బందులు కలిగాయి. దీంతో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించారని, దీని వల్ల ప్రజలకు ఇబ్బందులు కలిగాయని పోలీసులు తెలిపారు.
రేవంత్‌రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బుధవారం రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భగా కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం కలిగించారని జూబ్లీహిల్స్ ఎస్‌ఐ యాకన్న ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు.