దావోస్ వేదికగా అరుదైన కలయిక.. ఏం మాట్లాడుకున్నారో తెలుసా..?

0
733

దావోస్ వేదికగా పెట్టుబడుల సాధనలో తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రిగా తొలిసారి దావోస్ వెళ్లిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పలు సంస్థలను కోరారు. జగన్ ఆహ్వానంతో టెక్ మహీంద్రా ఏపీ ప్రభుత్వంతో పని చేసేందుకు ముందుకు వచ్చింది. అదానీ గ్రూప్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం ఏకంగా 60 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఎప్పటిలానే దావోస్ లో తన మార్క్ చూపిస్తున్నారు. ఇప్పటికే పలు సంస్థలతో తెలంగాణ సర్కార్ ఒప్పందాలు చేసుకుంది. ఫార్మా, ఐటీ రంగాలకు సంబంధించి పలు దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులపై ప్రకటనలు చేశాయి. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మీటింగ్ నిర్వహిస్తున్న ఏపీ సీఎం జగన్, తెలంగాణ మంత్రి కేటీఆర్ కు సంబంధించి దావోస్ వేదికగా మరో ఆసక్తికర ఘటన జరిగింది. దానిపై ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

దావోస్ లో స్పెషల్ అట్రాక్షన్ గా మారిన ఆ ఘటన ఏపీ సీఎం జగన్, తెలంగాణ మంత్రి కేటీఆర్ భేటీనే. దావోస్ లో బిజీబిజీగా ఉన్న ఇద్దరు అగ్ర నేతలు కలుసుకున్నారు. సరాదాగా పలకరించుకున్నారు. సూటూబూటు ధరించిన ఇద్జరు నేతలు నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చారు. సోదరుడు జగన్ గారిని దావోస్ లు కలుసుకున్నా అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. జగన్ తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోనే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా వేడి రాజేస్తోంది. జగన్, కేటీఆర్ కలయికపై భిన్న వాదనలు వస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ జోరుగా చర్చ సాగుతోంది. కొందరి సానుకూలంగా.. మరికొందరు విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. వీరిద్దరి భేటీపై ఇంతలా చర్చ జరగడానికి కారణం.. ఇటీవల ఏపీ ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన కామెంట్లే.

హైదరాబాద్ లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన తెలంగాణ మంత్రి కేటీఆర్.. తెలంగాణ అభివృద్ధిని చెబుతూ ఆంధ్రప్రదేశ్ ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని.. కరెంట్ కోతలు భారీగా ఉన్నాయని కేటీఆర్ కామెంట్ చేశారు. ఏపీలో ఉన్న తన మిత్రులు ఈ విషయాలు చెప్పారంటూనే.. జగన్ రెడ్డి పాలన సరిగా లేదనే సంకేతం వచ్చేలా కేటీఆర్ మాట్లాడారు. కొన్ని రోజులుగా ఏపీలోని విపక్షాలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నాయి. దీంతో విపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమే అన్నట్లుగా కేటీఆర్ కామెంట్లు ఉండటం వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. అందుకే కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ ముందు తన రాష్ట్రం సంగతి చూసుకుంటే మంచిదని బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నేతలు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలోనే దారుణ పరిస్థితులు ఉన్నాయని కొందరు వైసీపీ నేతలు ఫైరయ్యరు. ఈ ఘటనలతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం సాగింది. ఏపీ టీడీపీ నేతలు మాత్రం టీఆర్ఎస్, వైసీపీ కలిసే ఉన్నాయని.. ప్రజలను గందరగోళ పరచడానికే డ్రామాలు చేస్తున్నాయని ఆరోపించారు.

ఈ నేపథ్యంలోనే సీఎం జగన్, మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటనకు వెళ్లారు. ఇటీవల జరిగిన పరిణామాలతో వీరిద్దరు అక్కడ కలుసుకుంటారా లేదా అన్న చర్చ నడిచింది. ఇద్దరు సమావేశం కాకపోవచ్చనే వాదన వచ్చింది. అయితే తాజాగా జగన్, కేటీఆర్ కలుసుకోవడంతో ఈ వాదనకు చెక్ పడింది. అయితే కేటీఆర్ ఇటీవల చేసిన కామెంట్లను ఉదహరిస్తూ వీరిద్దరి భేటీపై కొత్త చర్చ తెరపైకి వచ్చింది. రాష్ట్రాల్లో టీఆర్ఎస్, వైసీపీ నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటూ.. విదేశాల్లో మాత్రం హాయిగా మాట్లాడుకుంటున్నారని కొందరు కామెంట్ చేశారు. గల్లీలో కుస్తీ.. దావోస్ లో దోస్తీ అంటూ మరికొందరు పోస్ట్ చేస్తున్నారు. టీడీపీ ఫాలోవర్స్ మాత్రం తాము చెప్పిందే నిజమైందని.. వైసీపీ, టీఆర్ఎస్ మధ్య విభేదాలు లేవని కామెంట్ చేస్తున్నారు. మొత్తంగా దావోస్ వేదిగా జగన్, కేటీఆర్ కలుసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here