Right Angle

నదులను రెండుగా చీలుద్దామా..?

మన దేశంలో జలవివాదాల వార్తలు నిత్యం దిన పత్రికల్లో ప్రముఖంగా కనిపిస్తాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సైతం జలవివాదాల చరిత్ర సుదీర్ఘమైంది. వివాదాలకు కేటాయించే వార్త నిడివిని, వాటి మూలాల గురించి అంత పరిమాణంలో రాసేందుకు పెద్దగా ఆసక్తి చూపవు మన పత్రికలు. జలవివాదం రాజకీయాలకు చమురు వనరు. అందుకే వాటిపై మన నేతలకు, ప్రసార మాధ్యమాలకు అపారమైన శ్రద్ధ.

దేశ వ్యాప్తంగా ఉన్న అసంఖ్యాక నదులపై అనేక ప్రాజెక్టులున్నాయి. వాటి చుట్టూ అనేక వివాదాలున్నాయి. తాజాగా రాయలసీమ ఎత్తిపోతల పథకం-రాజోళి బండ డైవర్షన్ స్కీం కుడికాల్వ నిర్మాణం, తెలంగాణ ప్రాజెక్టులపై విద్యుత్ ఉత్పాదన వివాదాలు ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య అగ్గిరాజేస్తున్నాయి.

రాయలసీమ ఎత్తిపోతల పథకం-ఆర్డీఎస్ కుడి కాల్వ నిర్మాణాలపై తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్రమైన విభేదాలు తలెత్తడానికి కారణమేంటి? పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యూలేటర్ గురించి తెలంగాణకు ఎందుకు అభ్యంతరం? పులిచింతల, పోలవరం విషయంలో ఎందుకు వివాదం? తాజాగా ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపడితే తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఎందుకీ వ్యతిరేకత? నదీజలాలు సముద్రంలో వృధాగా పోతున్నాయనే వాదన సరైందేనా? ఇలా చాలా సందేహాలు మనని వెన్నాడుతుంటాయి. ప్రాథమిక అంశాలతో మొదలుపెట్టి మరింత లోతైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ప్రస్తుతానికి దక్కనులో ప్రవహించే రెండు ప్రధాన నదులు-క్రిష్ణా-గోదావరి నదులు-వాటిపై కట్టిన ప్రాజెక్టులు, అలుముకున్న వివాదాలు, విద్యుత్ ఉత్పాదన విషయంలో ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం, తెలంగాణ సమర్థనకు సంబంధించిన వివరాలు-అందుకు సంబంధించిన విశ్లేషణ చేసుందకు యత్నిస్తాను. ‘నది’ అంటే ఏంటి అనే ప్రశ్న అందిరికీ కాదుగానీ, కొందిరికైనా రావచ్చు. నది గురించి చెపుతున్నామంటే దాని ఉపనదులు, మధ్యలో వచ్చికలిసే వాగులూ, వంకలూ అన్నీ కలిపితేనే నది అంటాం.

రుతుపవనాలు అంటే ఏమిటి..?

భూమధ్య రేఖ నుంచి ప్రయాణించే గాలులు ఎత్తుగా ఉన్న హిమాలయాలు అడ్డు రావడంతో అక్కడ ఆగిపోతాయి. వాటినే నైరుతి రుతు పవనాలుగా పిలుస్తారు. ఆ గాలుల్లో తడి శాతం ఎక్కువగా ఉండడం వల్ల మేఘాలు ఏర్పడి వర్షాలు బాగా కురుస్తాయి. అక్కడ ఆగిపోయిన ఆ గాలులు మళ్లీ భూమధ్య రేఖ వైపు వెనక్కి వస్తాయి. వీటిని ఈశాన్య రుతు పవనాలుగా పిలుస్తారు. ఈ గాలుల్లో తడి శాతం తక్కువగా ఉండడం వల్ల పెద్దగా వర్షాలు పడవు.

జల వివాదాల్లో తరచూ వినిపించేది టీఎంసీ అనే పారిభాషిక పదం…టీఎంసీ అంటే ఏంటో తెలిస్తే జలవివాదాలు మరింత బాగా అర్థమవుతాయి. టీఎంసీ అంటే థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్, అంటే వందకోట్ల ఘనపుటడుగులు. ఒక ఘనపుటడుగు అంటే, ఒక అడుగు పొడవు, ఒక అడుగు వెడల్పుఅన్నమాట. మరింత సులువుగా బోధపడాలంటే అడుగు ఎత్తు ఉన్న ఒక ఐస్ క్యూబ్ ను ఊహించుకోవాల్సిందే! అలాంటివి వంద కోట్లయితే ఒక టీఎంసీ అన్నమాట. నీటి పరిమాణం ఊహకు అందదు కాబట్టి, సులభంగా అర్థం కావాలంటే-ఒక టీఎంసీ నీటితో 6వేల ఎకరాల తరి, లేదా మాగాణీ పంట పండించుకోవచ్చు. అదే అరుతడి పంట అయితే 10 వేల ఎకరాలు పండించుకోవచ్చనేది ఒక అంచనా.

అదే చెరువు ఉదాహరణ తీసుకుందాం. ఒక చెరువు సగటు స్టోరేజీ సామర్థ్యం టీఎంసీలో పదోవంతు. అంటే ఒక టీఎంసీ అంటే పది చెరువుల నీరు అన్నమాట.

ఐదు ముఖ్య వివాదాలు

కృష్ణా, గోదావరి నదులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద నదులు. ఆంధ్రప్రదేశ్ లో పెన్న నది కూడా పెద్దనది కిందే పరిగణిస్తారు. ఈ మూడు కాకుండా, మరో 37 మధ్య, చిన్న తరహా నదులున్నాయి. కృష్ణా, గోదావరి నదుల చుట్టూతా అనేక వివాదాలు ముసురుకున్నాయి. వాటిలో ముఖ్యమైనవి…

  1. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేటర్-ఇది శ్రీశైలం కుడి కాలువకు ఉండే రెగ్యులేటర్
  2. పులిచింతల ప్రాజెక్ట్
  3. బాబ్లీ ప్రాజెక్టు-శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు ఎగువన మహారాష్ట్రలో ఉంటుంది.
  4. పోలవరం ప్రాజెక్టు
  5. రాయలసీమ ఎత్తిపోతల పథకం-ఆర్డీఎస్ కుడికాల్వ నిర్మాణం తాజాగా రాజుకున్న వివాదాలు

జల వివాదాల అంశం అత్యంత సంక్లిష్టమైనది. వాటి గురించి అందుబాటులో ఉన్న సమాచారం సైతం చాలా తక్కువ. తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రవహించే రెండు ప్రధాన నదులు, క్రిష్ణా-గోదావరి నదీ జలాల విషయంలోనే తగాదాలు అధికం.

ప్రకృతి మానవజాతికి ఇచ్చిన వరం నీరు. ఒకరు ఇచ్చిందీ-తయారు చేసిందీ కాదు. వేద వాజ్ఞ్మయం ఘోషించినట్టూ సలిలం పంచభూతాల్లో భాగం. అధర్వణ వేదం జలవనరుల ప్రాధాన్యాన్ని చెపుతూ ‘సముద్రే అంతర్నిహితాని నాభి’ అంటుంది. నీరు అందరికీ అందుబాటులో ఉండాలి.

అది తప్ప వేరే ప్రమాణాలు ఉండటానికి వీలు లేదు. నేను తయారు చేస్తే నాకుంటుందీ అనొచ్చు ఎవరైనా. జలం మనిషి ఉనికి పూర్వమే జనించింది. కాబట్టి, వాళ్ల వాళ్ల అవసరాలను బట్టి అందరికీ హక్కులుండాలి. ఆచరణాత్మక సమస్యలు సర్వసాధారణం. ‘అందరికీ అందుబాటులో ఉండాలి’ అనే విలువ మాత్రమే నిర్ణయ ప్రాతిపదిక కావాలి.

నదీ జలాల మీద హక్కులకు సంబంధించి ఒక చట్టమంటూ ఏదీ ఉనికిలోకి రానిరోజుల్లో… మౌఖిక అంగీకారం ప్రాతిపదికన నీటి పంపకం మొదలైంది. బ్రిటీష్ పాలన కాలంలో, పాలనావసరాల కోసం కొన్ని ఆనకట్టలు కట్టారు. అవి కూడా ఎక్కువ కోస్తా ప్రాంతంలోనే. ఇప్పుడున్నంత భారీ ప్రాజెక్టుల్లాంటివి కావు నాటి ఆనకట్టలు. వలస పాలకుల ఉద్దేశం సాగునీరు అందించడం కాదు, వరద నియంత్రణ, జలరవాణా మాత్రమే!

ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజీ అని పిలుస్తున్న ఆనకట్ట పేరు నిజానికి ‘కృష్ణా డెల్టా వర్క్స్’. ఆనకట్ట కట్టాక నీటి నిల్వ ఉంటుంది కాబట్టి డెల్టా ప్రాంతానికి సాగునీరు అందించారు వలస పాలకులు. బ్రిటీష్ పాలనలో ఉన్న కోస్తా ప్రాంతం సుసంపన్నం కావడానికి ఈ ఆనకట్టలే పునాది. రైతుల ఆదాయం పెరిగి, ప్రభుత్వ రెవెన్యూ సైతం పెరిగింది. దీంతో ధవళేశ్వరం మీద ఒక బ్యారేజీని నిర్మించారు. ఇదంతా 19వ శతాబ్దం ఉత్తరార్ధంలో జరిగింది.

అంటే ఏ చట్టమూ లేని రోజుల్లో కృష్ణా డెల్టా, గోదావరి డెల్టాలకు అనధికారిక హక్కులు సంక్రమించాయి. ఈ ఆనకట్టలకు ముందు కోస్తా ప్రాంతాలు సంపన్న ప్రాంతాలు కావు. ఇంకా చెప్పాలంటే నివాసయోగ్యం కానీ ప్రాంతాల సంఖ్య కూడా తక్కువేమీ కాదు.

బ్రిటీష్ చట్టాల్లో ఎక్కడా నదీ జలాల పంపకం హక్కుల విషయంలో నిర్దిష్టంగా ఎవరికెంత వాటా అన్నది లేదు. మద్రాస్ ప్రావిన్స్, బెంగాల్ ప్రావిన్స్ ఒడిశా, బొంబాయి ప్రాంతాలు బ్రిటీష్ పాలనలోనే ఉండేవి. అయినా ఎక్కడ నీటి పంపకం గురించి పెద్దగా పట్టించుకున్న దాఖలా లేదు. వాళ్ల సౌలభ్యం ప్రాతిపదికన పాలించారన్నమాట. అంటే స్వాతంత్ర్యానికి పూర్వం నిర్మించిన ప్రాజెక్టుల్లో నీటిని సర్దుబాటు చేసేందుకు ఎలాంటి చట్టబద్ధమైన ప్రాతిపదికలూ లేవు. అలాంటి ప్రాజెక్టుల్లో రాజోళీబండ డైవర్షన్ స్కీం, తుంగభద్ర డ్యాంలు ఉన్నాయి.

గోదావరి నదీజలాలపై మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్ గఢ్, ఒడిశా రాష్ట్రాలకు హక్కులున్నాయి. కృష్ణా జలాలను మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు పంచుకుంటున్నాయి. పెన్నానది ఆంధ్రప్రదేశ్-కర్ణాటక రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది కాబట్టి, సహజంగానే ఆ రెండు రాష్ట్రాలకు హక్కులు వర్తిస్తాయి. మరో 9 అంతర్ రాష్ట్ర నదీ జలాలపై ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు హక్కులున్నాయి.

గోదావరి బేసిన్లో సింగూరు నిజాం సాగర్, కడెం, లోయర్ మానేరు, శ్రీరాంసాగర్, ధవళేశ్వరం బ్యారేజీ-కృష్ణా బేసిన్ లో తుంగభద్ర, రాజోలీబండ, కే.సీ.కెనాల్, జూరాల, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజి-పెన్నా బేసిన్లో పెన్నా ప్రాజెక్ట్, సోమశిల ప్రాజెక్ట్ ఇవి కాక, వంశధార స్టేజ్-1, పీలేరు, చాగల్నాడు లాంటి భారీ ప్రాజెక్టులున్నాయి.

ఇదీ స్థూలంగా ప్రాజెక్టులకు సంబంధించిన ప్రాథమిక సమాచారం. రాయలసీమ ఎత్తపోతల వివాదం ఎందువల్ల వచ్చిందో చూద్దాం.

కృష్ణా జలాల పంపిణీలో రాయలసీమకు అన్యాయం జరుగుతోందనే వాదన ఈనాటిది కాదు. కృష్ణా, తుంగభద్ర నదీ ప్రవాహాలు ఏపీలో ఉన్నప్పటికీ సీమలోని నాలుగు జిల్లాలకు సాగునీటి లభ్యత అంతంతమాత్రంగానే ఉంది. ఇది నిరాకరించలేని వాస్తవం. కృష్ణా నదిలో మిగులు జలాలు ఏటా సముద్రంలోకి వెళుతున్నా, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో వైఫల్యం సమస్యకు మూలమనే వాదన కూడా పాక్షిక సత్యమే! నదీ జలాలు సముద్రంలో కలవడమన్నది ప్రకృతి ధర్మం.

అయితే మన వైఫల్యాను కప్పిపుచ్చుకోవడానికి, సకాలంలో ప్రాజెక్టులు నిర్మించకపోవడం వల్ల సహజంగానే నదినీరు సముద్రంలోకి వెళుతుంది. అట్లా వెళ్లడం వల్ల మాత్రమే రుతుచక్రం సవ్యంగా ఉంటుంది. ఇప్పటికే శ్రీశైలం కుడి ప్రధాన కాలువ, తెలుగు గంగ, గాలేరు-నగరి వంటివి అందుబాటులో ఉన్నప్పటికీ వాటి అసలు లక్ష్యాలకు ఇంకా చేరువ కాలేదు.

రాయలసీమకు 131 టీఎంసీల నికర జలాల వాటా రావాల్సి ఉంటే.. 100 టీఎంసీల నీటిని కూడా వినియోగించుకోలేని స్థితి. ముఖ్యంగా వరదల సమయంలో వృథాగా సముద్రం పాలయ్యే నీటిని వినియోగించుకోవడానికి కూడా అవకాశం లేదని, ఈ లిఫ్ట్ దానికి ఉపయోగపడుతుందని ఏపీ ప్రభుత్వం అంటోంది.

వరదల సమయంలో ప్రస్తుతం పోతిరెడ్డిపాడు నుంచి రోజుకు 4 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. అదే విధంగా రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ద్వారా మరో 3 టీఎంసీల నీటిని తరలించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. శ్రీశైలం జలాశయంలో 797 అడుగుల స్థాయి నుంచి రోజుకి 3 టీఎంసీల చొప్పున నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువనున్న శ్రీశైలం కుడి ప్రధాన కాలువలోకి తరలించాలనేది ప్రతిపాదన. శ్రీశైలం ఎగువన లిఫ్ట్ చేసే నీటిని 4 కిలోమీటర్ల మేర తరలించి అక్కడి నుంచి తెలుగు గంగ, ఎస్ఆర్బీసీ, గాలేరు నగరి కాలువల ద్వారా కృష్ణా జలాలను తరలిస్తామని ప్రభుత్వం చెబుతోంది.

ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాల్లో తన వాటాను వినియోగించుకోవడం కోసమంటూ రాయలసీమ లిఫ్ట్‌కి శ్రీకారం చుట్టింది. రూ.3,307 కోట్లతో ఎస్సీఎంఎల్ సంస్థకి నిర్మాణ కాంట్రాక్ట్ ఇచ్చింది. 30 నెలల్లో పనులు పూర్తి చేసేలా ఒప్పందం చేసుకుంది. అయితే రాయలసీమ లిఫ్ట్‌ నిర్మాణంపై ప్రారంభం నుంచి తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ లిఫ్ట్ స్కీమ్ వల్ల పర్యావరణ సమస్యలు తలెత్తుతాయంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌-ఎన్‌జీటీ కి ఫిర్యాదు అందింది.

ట్రిబ్యునల్ ఆదేశాలతో కేంద్ర పర్యావరణ శాఖ ఓ కమిటీని నియమించింది. కమిటీ ప్రతిపాదనల మేరకు తెలుగు గంగ ప్రాజెక్ట్‌ 29 టీఎంసీలు, ఎస్ఆర్బీసీ 19 టీఎంసీలు, గాలేరు-నగరి సుజల స్రవంతి 38 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు నుంచి తీసుకుంటున్నాయి. వాటికి పర్యావరణ అనుమతులున్నాయి. ప్రస్తుతం రాయలసీమ లిఫ్ట్‌ కూడా వాటికి నీరందించే లక్ష్యంతోనే మొదలుపెట్టామని ఆంధ్రప్రదేశ్ చెబుతోంది.

అదే సమయంలో శ్రీశైలం నుంచి 854 అడుగుల స్థాయి నుంచి నీటిని తరలించాల్సి ఉండగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు దానికి భిన్నంగా సాగుతున్నాయి. పైగా 800 అడుగుల స్థాయి నుంచే నీటిని తరలించేందుకు ఈ లిఫ్ట్ స్కీమ్ నిర్మిస్తున్నారు. కాబట్టి ఆయా రాష్ట్రాల వాటాలకు అనుగుణంగా నీటిని వినియోగించుకునేలా కృష్ణా బోర్డు పర్యవేక్షించాలని ట్రిబ్యునల్ సూచించింది.

పోతిరెడ్డిపాడు కోసం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో మోటార్లు పెడితే, రాయలసీమ లిఫ్ట్ పేరుతో ప్రాజెక్టు నుంచి 4 కిలోమీటర్ల వద్ద మోటర్లు పెట్టి నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి కేటాయింపులకు మించి నీటిని తరలించకుండా కృష్ణా బోర్డు చూడాలని సూచించింది. రాయలసీమ లిఫ్ట్‌కి పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందేనని ఎన్జీటీ తుది తీర్పు వెలువరించింది. ప్రాజెక్టు డీపీఆర్ సమర్పించి, అనుమతులు తీసుకోవాలని చెన్నైలోని ఎన్జీటీ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.

రాయలసీమ ఎత్తిపోతల వల్ల కృష్ణా నదికి, శ్రీశైలం దిగువన ఉండే ప్రాజెక్టులకు కలిగే నష్టంపై కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా అధ్యయనం చేయించాలని, ఈ పథకం చేపట్టకుండా ఆంధ్రప్రదేశ్‌ను నిలువరించాలని, శ్రీశైలం ప్రాజెక్టు ఒట్టిపోకుండా చూడాలని తెలంగాణ విన్నవించింది.

రాయలసీమ ఎత్తిపోతల శాశ్వతమైనదని, దీనిద్వారా మళ్లించే నీటి సామర్థ్యాన్ని కూడా పెంచారని, అయినా నిపుణుల కమిటీ రెండు ప్రాజెక్టుల విషయంలో కమిటీ భిన్నమైన నివేదికలు ఇచ్చిందని తెలిపింది.

ప్రస్తుతం ఉన్న గ్రావిటీ కాలువ సామర్థ్యం 44 వేల క్యూసెక్కులైతే, ఎత్తిపోతల సామర్థ్యం 80 వేల క్యూసెక్కులని, ఈ తేడాను నిపుణుల కమిటీ గుర్తించకపోవడం ఆశ్చర్యంగా ఉందంది. ఈ పథకానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నుంచి అనుమతి తీసుకోవాలని కమిటీ పేర్కొందని, అంటే ఇది కొత్త పథకం కిందే లెక్కని వివరించింది.

సీమకు శ్రీశైలం నుంచి నీటి కేటాయింపు లేదురాయలసీమ ప్రాంతానికి బచావత్‌ ట్రిబ్యునల్‌ శ్రీశైలం నుంచి నీటినే కేటాయించలేదని, తెలుగుగంగ, గాలేరు-నగరి మిగులు జలాల ఆధారంగా చేపట్టినవేనని తెలంగాణ పేర్కొంది. 880 అడుగులకు పైన నీటిమట్టం ఉన్నప్పుడు నీటిని తీసుకోవాలని, ఇలా 797 అడుగుల నుంచి తీసుకొనేలా ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడానికి వీల్లేదంది.

మిగులు జలాలను వినియోగించుకొనే స్వేచ్ఛ ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను చేపట్టిందని, వీటిని అడ్డుకొనే ఉద్దేశంతో ముందస్తు పర్యావరణ అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టులను చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్‌ మాట్లాడుతోందని తెలంగాణ ప్రభుత్వం అంటోంది.

రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా తమ కేటాయింపులకు మించి మళ్లించడం కానీ, అదనపు ఆయకట్టు సాగు చేయడం కానీ లేదని, తెలంగాణ ఆరోపణలు అవాస్తవమని, సరైనవి కావని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ట్రైబ్యునల్‌ ఎదుట తన వాదనను రాతపూర్వకంగా సమర్పించింది.

శ్రీశైలం నుంచి ఎక్కువ నీటిని మళ్లించడం వల్ల, పాలమూరు – రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలపై ప్రభావం పడుతుందన్నది ఊహాజనితమని, తెలంగాణ వ్యక్తం చేసిన అభ్యంతరాలు జాతీయ హరిత ట్రిబ్యునల్‌ పరిధిలోకే రావని తెలిపింది. కొత్త ప్రాజెక్టు అయితేనే 2006 పర్యావరణ చట్టం పరిధిలోకి వస్తుందని, రాయలసీమ ఎత్తిపోతల వీటి పరిధిలోకి రాదని వివరించింది.

ప్రపంచ వ్యాప్తంగానే జలవివాదాల పరిష్కారం ఒక రకంగా అసాధ్యంగా మారిందంటారు నిపుణులు. కృష్ణానదీ పరీవాహక ప్రాంతాల్లో ఒక్కో రాష్ట్రంలో వర్షపాతం ఒకలా ఉంటుంది. ఉదాహరణకు కృష్ణానదికి ఎగువన కర్ణాటకలోని షిమోగా, ఉడిపి జిల్లాల్లో 4వేల నుంచి 3వేల5వందల మి.మీ వర్షపాతం ఉంటే దిగువన ఉన్న మహాబూబ్ నగర్ జిల్లాలో 5వందల మి.మీ కర్నూలు, అనంతరపురం జిల్లాల్లో 4వందల 50 మి.మీ వర్షపాతం ఉంటుంది. మా కాంట్రీబ్యూషన్ ఎక్కువ కాబట్టి మావాటా ఎక్కువ ఉండాలి అంటుంది కర్ణాటక.

అంటే ప్రాకృతిక కారణాల వల్ల వర్షపాతం లేని ప్రాంతాల కాంట్రిబ్యూషన్ ఉండకపోతే నీరు ఇవ్వకూడదా? అనే ప్రశ్న వస్తుంది. సంకుచిత ధోరణితో ఆలోచిస్తే జలవివాదాలు మరింత పెరుగుతాయి తప్ప పరిష్కారం కావు. కృష్ణానదికి దిగువన ఉన్న కోస్తా ప్రాంతానికి నీరు ఎట్లాగూ వెళుతుంది, నదికి ఎత్తులో ఉన్న తెలంగాణ ప్రాంతానికి ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మిస్తే తప్ప సాధ్యం కాదు. ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అనుకూలత, ప్రతికూలత కాబట్టి మనమేం చేయగలం అని నదితలానికి ఎగువన ఉన్న ప్రాంతాలకు నీటిని నిరాకరించగలమా? దీనికి ప్రకృతి ఇచ్చిన నీటిని అందరూ సమానంగా వాడుకోవాలన్న విలువ మాత్రమే పరిష్కారాన్ని సూచించగలదు. ఈ మొత్తం పరిణామాలను దృష్టిలో ఉంచుకుని బచావత్ ట్రిబ్యూనల్ వలసపాలనలో కట్టిన ప్రాజెక్టుల ఆయకట్టును కుదించి తర్వాత ప్రాజెక్టులు కట్టిన ప్రాంతాల్లోని ఆయకట్టుకు నీటి కేటాయింపులు చేసింది.

గణితసూత్రమంత కచ్చితంగా, సైన్స్ లేబొరెటరీలో పరీక్ష అనంతరం వెలువడేంత ప్రామాణికంగా కేటాయింపులు చేయలేం. సామాజిక న్యాయ దృష్టి మాత్రమే జలవివాదాలను పరిష్కరించగలదు. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఎగువన మేం వదులితేనే నీరు మీకు వస్తుందన్న బింకం తెలంగాణకు ఉండకూడదు, మీరేమైనా ఫరవాలేదు మాకు మూడు పంటలకు నీళ్లు కావాలన్న పంతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ ఉండకూడదు. అప్పుడు మాత్రమే వివాదం సునాయాసంగా పరిష్కారమవుతుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

eighteen − three =

Back to top button