రేప్ ను తప్పించుకోలేనప్పుడు ఎంజాయ్ చేయాలట: కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు

0
922

కర్ణాటక కాంగ్రెస్ నేత కేఆర్ రమేష్ కుమార్ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అత్యాచారాన్ని అత్యంత సాధారణమైన విషయంగా చెప్పుకొచ్చారు. అది కూడా అసెంబ్లీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. “అత్యాచారం అనివార్యమైనప్పుడు, పడుకుని ఆనందించండి” అని అన్నారు. రైతుల సమస్యలపై చర్చించాలని సభలోని సభ్యులు డిమాండ్‌ చేస్తున్న సమయంలో కాంగ్రెస్‌ నేత అసెంబ్లీలో షాకింగ్‌ ప్రకటన చేశారు. ఈ డిమాండ్‌పై స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కాగేరి స్పందిస్తూ.. అందరికీ మాట్లాడేందుకు సమయం కేటాయిస్తే సభను ఎలా నడుపుతారని ప్రశ్నించారు. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యేలను కోరగా, మాజీ స్పీకర్ కెఆర్ రమేష్ కుమార్‌ మాట్లాడుతూ, “నేను దీన్ని అదుపులో ఉంచుకోలేను. క్రమపద్ధతిలో ముందుకు తీసుకెళ్లలేను” అని అన్నారు.

స్పీకర్‌పై రమేష్ కుమార్ స్పందిస్తూ.. ‘‘అత్యాచారం అనివార్యమైనప్పుడు పడుకుని ఆనందించండి అనే సామెత ఉంది. మీరు ఉన్న స్థానం సరిగ్గా అదే” అని అన్నారు. ఈ వ్యాఖ్యల సమయంలో స్పీకర్ నవ్వుతూ ఉన్నారు. ఇంకా షాకింగ్ విషయమేమిటంటే ఈ వ్యాఖ్యలపై సభలో ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు.. ఇంకా ఆ వ్యాఖ్యపై సభికులు ఒక్కసారిగా నవ్వుకున్నారు.

రమేష్ కుమార్ చెప్పిన వ్యాఖ్య వాస్తవానికి గతంలో ఉపయోగించే సామెత.. కానీ దాని అభ్యంతరకరమైన స్వభావం కారణంగా ఇప్పుడు ఉపయోగించడం లేదు. ఎవరైనా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, దానిని ఎదుర్కోవడానికి మార్గం లేక, దానితో పోరాడేది చేతకానప్పుడు.. దానిని చూస్తూ ఉండడం మంచిదని సూచించడానికి ఈ వ్యాఖ్యలు ఉపయోగించబడతాయి.

ఈ వ్యాఖ్య అసహ్యకరమైనది, ఆమోదయోగ్యం కాదు, ఎందుకంటే ఇది అత్యాచారాన్ని సాధారణీకరిస్తుంది. ఎవరైనా ఈ వ్యాఖ్య చేస్తే తీవ్ర విమర్శల పాలవుతారు. ఇప్పుడు రమేష్ కుమార్ పై అలాంటి విమర్శలే వస్తున్నాయి. 2019లోనూ రమేశ్ కుమార్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అప్పట్లో స్పీకర్‌గా ఉన్న ఆయన తన పరిస్థితి అత్యాచార బాధితురాలిలా ఉందని చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలు వచ్చాయి. ‘‘అత్యాచారం జరిగినప్పుడు దానిని అక్కడితో వదిలేస్తే ఒకసారితో అయిపోతుంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే నిందితుడిని జైలులో పెడతారు. కానీ లాయర్లు వదలరు. ఎన్నిసార్లు జరిగింది? ఎంతమంది చేశారు? అని ప్రశ్నలు అడగుతారు. అత్యాచారం ఒకసారే జరుగుతుంది. కానీ కోర్టులో వందసార్లు జరుగుతుంది. ఇప్పుడు నా పరిస్థితి అలానే ఉంది’’ అని అప్పట్లో చెప్పుకొచ్చారు.