More

    సినిమా పరిశ్రమపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ ఘాటు వ్యాఖ్యలు.. నిర్మాతల స్పందన

    వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ సినిమా వాళ్లు ఒళ్లు బలిసి కొట్టుకుంటున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోవూరులో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు చిత్ర పరిశ్రమ గురించి ఈ వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లంతా హైదరాబాద్‌ లో ఉన్నారని.. అసలు వారికి ఏపీలో ఒక ప్రభుత్వం ఉందని, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని కనిపిస్తోందా అని ప్రశ్నించారు. సినిమాలో ఉన్న పెద్దలంతా చంద్రబాబు మనుషులేనని.. ఆయన కులానికి చెందిన వారే ఎక్కువమంది ఇండస్ట్రీలో ఉన్నారంటూ విమర్శించారు. హైదరాబాద్ లో ఉండి ఏపీ ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు వారికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. పేదల కోసం టికెట్ల ధరలు తగ్గిస్తే వారికి వచ్చిన నష్టం ఏంటని ఆయన ప్రశ్నించారు. టికెట్ ధరలు తగ్గిస్తే సామాన్యులు కూడా సినిమాలు చూస్తారని… ప్రభుత్వ నిర్ణయంలో తప్పేముందని ప్రశ్నించారు. సినిమా టికెట్స్ రేట్లు తగ్గిస్తే తప్పేంటని తెలంగాణలో ఉండి అంటున్నారన్నారు. అక్కడ సినిమాలు తీస్తున్న సినీ హీరోలు కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారని విమర్శించారు. సినిమా హీరోలు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని, టికెట్ రేటు తగ్గించి పేదవాడు సినిమా చూసేలా చేయడం తప్పా అని ప్రశ్నించారు. పెద్ద హీరోల సినిమా టికెట్లు వంద నుంచి వేల రూపాయల్లో అమ్మారని ఎమ్మెల్యే ఆరోపించారు. సోమవారం నాడు మంత్రి పేర్ని నాని, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భేటీ సయంలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

    ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిర్మాతల మండలి ప్రకటన విడుదల చేసింది. ఆయన వ్యాఖ్యలు బాధాకరమని, వాటిని ఖండిస్తున్నామని మండలి తెలిపింది. ఈ వ్యాఖ్యలు చేయడం యావత్ చిత్ర పరిశ్రమను అవమానించడమేనని నిర్మాతల మండలి పేర్కొంది. తెలుగు సినిమా సక్సెస్ రేటు 2 నుంచి 5 శాతం మాత్రమే ఉందని.. ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్ కు పని కల్పిస్తూ అనేక ఇబ్బందులు పడి, కోట్ల రూపాయల ఖర్చుతో సినిమాలు తీసే నిర్మాతలు చివరకు ఆస్తులు అమ్ముకోవడం జరుగుతుందని తెలిపారు. కొందరు నిర్మాతలు అన్ని విధాలా దెబ్బతిని చలనచిత్ర నిర్మాతల మండలి నుంచి నెలకు రూ.3 వేల పెన్షన్ తీసుకుంటున్నారని.. దీన్ని బట్టే నిర్మాతలు ఎంత దారుణ పరిస్థితుల్లో ఉన్నారో తెలుస్తుందని, గౌరవనీయ ఎమ్మెల్యే వాస్తవాలు తెలుసుకోకుండా నిర్మాతలను ఉద్దేశించి వ్యాఖ్యానించడం సబబు కాదని నిర్మాతల మండలి తెలిపింది. ఆయన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని నిర్మాతల మండలి డిమాండ్ చేసింది.

    నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో ఐఏఎస్, ఐసీఎస్ అధికారుల మీద ఆరోపణలు చేశారు. జగనన్న ఇళ్ల మీద కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. జగనన్న ఇళ్లలో మంచం వేసుకునేంత చోటు కూడా లేదని, ఆ ఇంట్లో కొత్త జంటలు కాపురమే చేసుకోలేరని అప్పట్లో ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటారో లేదో చూడాలి.

    Trending Stories

    Related Stories