ముంబైలో దక్షిణ కొరియా యూట్యూబర్ హ్యోజియాంగ్ పార్క్ పై ఇద్దరు యూట్యూబర్ లు లైంగిక వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. నడిరోడ్డుపై యువతిపై అసభ్యంగా ప్రవర్తించారు. ముంబైలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న సమయంలో కొరియా యువతికి ఈ పరిణామం ఎదురైంది. సుమోటోగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసి ఒక రోజు కస్టడీకి తరలించారు. హ్యోజియాంగ్ పార్క్ కు రక్షణ, భద్రత కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ముంబై లోని ఖార్ ప్రాంతం నుంచి లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న సమయంలో ఇద్దరు యువకులు ఆమెను వేధించారు. నిందితులను మోబీన్ చంద్ మహ్మద్ షేక్(18), మహ్మద్ నకీబ్ సదరియాలం అన్సారీ(20)గా గుర్తించారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం కేసు నమోదు చేశారు. ఇందులో ఓ యువకుడు మహిళపై చేయి వేసి ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేశారు. నిందితులు ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. భారతదేశంలో వేగంగా చర్యలు తీసుకున్నారని.. ఇప్పటికి మూడు వారాలకు పైగా ముంబైలోనే ఉన్నాను.. ఇంకా ఎక్కువ కాలం ఇక్కడే ఉండాలని అనుకుంటున్నానని యూట్యూబర్ హ్యోజియాంగ్ పార్క్ అన్నారు. అద్భుతమైన భారతదేశాన్ని ప్రపంచానికి చూపిస్తానని తెలిపారు.
మరో వీడియోలో హ్యోజియాంగ్ పార్క్ తనను కాపాడిన ఇద్దరు ఇండియన్స్ తో ఆమె లంచ్ లో పాల్గొన్నారు. ఈ సమయంలోనే వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. ఆదిత్య, అథర్వలతో కలిసి ఉన్న వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఫైనల్ గా ఇద్దరు ఇండియన్ హీరోలను కలిశానని రాసుకొచ్చారు. ముంబయిలోని ఓ రెస్టారెంట్ లో కలిసి భోజనం చేస్తున్న వీడియోను పంచుకున్నారు. ‘నన్ను కాపాడడంతో పాటు వీడియో పోస్ట్ చేయడంలో సాయపడిన ఇదర్దు భారతీయ యువకులు అథర్వ, ఆదిత్యతో లంచ్ టైమ్’ అంటూహోజియాంగ్ తన ట్వీట్లో తెలిపారు.