More

    కేసీఆర్ ను అడ్డుకోవడం బీజేపీకి మాత్రమే సాధ్యం: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

    మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇటీవలే భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చేవెళ్ల మాజీ ఎంపీ బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొండా విశ్వేశ్వరరెడ్డిని సన్మానించారు. ఆ తర్వాత కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును అడ్డుకోవడం ఒక్క భారతీయ జనతా పార్టీకి మాత్రమే సాధ్యమని.. టీఆర్ఎస్ లో కాళ్లు మొక్కించుకోవడం, డబ్బులు తీసుకోవడం, కేసులతో బెదిరించడం తప్ప ఏమీ లేదని విమర్శించారు. ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుందంటే తాను అక్కడే ఉంటానని.. అందుకే బీజేపీలో చేరానని చెప్పారు.

    తాను బీజేపీలో చేరుతున్న విషయం కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలందరికీ తెలుసని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. తాను ఇన్ని రోజులు తటస్థంగా ఉన్నా ఎవరూ పట్టించుకోలేదని.. ఇప్పుడు బీజేపీలో చేరే సరికి అంతా అడుగుతున్నారని తెలిపారు. బీజేపీలో తనకు ప్రాధాన్యత ఇచ్చి చేరికల కమిటీలో అవకాశమిచ్చారని.. నెలకు ఒక్క నేతను అయినా బీజేపీలోకి తీసుకొస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రకటించారు.కాంగ్రెస్ లో ఉన్నవారిలో కోమటిరెడ్డి బ్రదర్సే నయం అని చెప్పుకొచ్చారు. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టే అవకాశం లేదని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ నేతలు వివిధ పార్టీల నాయకులను తమ పార్టీలో చేర్చుకునేందుకు మూడు అస్త్రాలు వినియోగిస్తున్నారన్నారు. పార్టీలో చేరడానికి ఒకరు కాళ్ళు మొక్కుతారు, ఒకరు డబ్బులిస్తారు, ఇంకొకరు కేసులతో గల్లా పట్టి బెదిరిస్తారని విశ్వేశ్వర్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణలో బీజేపీ మరింత పుంజుకోబోతోందని ఆయన అన్నారు.

    Trending Stories

    Related Stories