More

    ఆ ఆడియో ఆయనది కాదట..!

    కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ రెండు సార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మునుగోడులో ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి, తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని వెంకట్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను కోరినట్లు సామాజిక మాధ్యమాల్లో ఆడియో వైరల్ అయింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ గతంలో క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 22న నోటీసులు జారీ చేసింది. ఈనెల 1వ తేదీతో పది రోజుల గడువు ముగిసింది. ఇంతవరకు వెంకట్ రెడ్డి షోకాజ్ నోటీసుపై సమాధానం ఇవ్వలేదు. షోకాజ్ నోటీసులు జారీ చేసే సమయంలో ఆయన ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ఈ నెల రెండున వెంకట్ రెడ్డి పర్యటన ముగించుకుని వచ్చారు. పది రోజులు ముగిసినా.. ఇంకా సమాధానం రాకపోవడంతో సమాధానం కోసం వెంకట్ రెడ్డి కార్యాలయాన్ని ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ సంప్రదించింది. విదేశీ టూర్‌లో ఉన్నందున నోటీసు తమకు అందలేదని వెంకటరెడ్డి కార్యాలయం కమిటీకి సమాధానం ఇచ్చింది. మరోసారి వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

    రెండు రోజుల క్రితం ఆయన తన వివరణ పంపినట్టు తెలుస్తోంది. విద్యార్థి దశ నుంచే తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నానని, మూడున్నర దశాబ్దాలుగా పార్టీకి విధేయుడిగా ఉన్నానని అందులో పేర్కొన్న ఆయన, పార్టీలో తనకు ప్రాధాన్యం కొరవడిందని వాపోయారు. ఉద్దేశపూర్వకంగానే తనను కించపరుస్తున్నారని.. వైరల్ అయిన ఆ ఆడియో తనది కాదని, నకిలీదని వివరణ ఇచ్చారు. ఇంకా పలు అంశాలను ఆ వివరణలో ఆయన ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం అందాల్సి ఉంది.

    Trending Stories

    Related Stories