More

    కోమటిరెడ్డికి కోపం ఇంకా తగ్గినట్లు లేదు..!

    ఇటీవలే తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిని ఎంపీ రేవంత్ రెడ్డికి కట్టబెట్టారు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా నియమించకూడదని ఇంతకు ముందు పలువురు సీనియర్లు బహిరంగంగా విమర్శలు గుప్పించినా అధిష్టానం మాత్రం ఆయనకే ముఖ్య బాధ్యతలు అప్పగించడంతో పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీని వీడే అవకాశం కూడా ఉంది. రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత బహిరంగంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిరసన గళం వినిపించారు. పీసీసీ అధ్యక్ష పదవి తనకే దక్కుతుందని భావించిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి తీవ్ర నిరాశ ఎదురవ్వడంతో బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని విమర్శించారు.

    ఓటుకు నోటులా పీసీసీ పదవిని అమ్ముకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్ పదవి కోసం ప్రయత్నిస్తూ ఢిల్లీలో ఉన్న ఆయన ఆదివారం నాడు హైదరాబాద్‌కు వచ్చి మీడియాతో మాట్లాడారు. పీసీసీ పదవిని ఇంతకాలం పార్టీని నమ్ముకున్న కార్యకర్తకు ఇస్తారని అనుకున్నానని, కానీ ఓటుకు నోటు లాగా పీసీసీ పదవిని అమ్ముకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌‌చార్జ్ మాణిక్యం ఠాగూర్ డబ్బులు తీసుకొని పీసీసీ పదవిని కట్టబెట్టారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలను త్వరలోనే బయటపెడతానని అన్నారు. సీనియర్ నేతలందరినీ కలుస్తానంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు. తనను కలవడానికి ఎవరూ రావొద్దని స్పష్టమైన ప్రకటన చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. 2023 వరకు నల్గొండ, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గలు చూసుకుంటానని స్పష్టం చేశారు. గాంధీ భవన్ మెట్లు ఎక్కే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

    ఒక్క రోజులో ఆయన వాయిస్ మారిపోయింది. ఇకమీదట రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయబోనని అన్నారు. ప్రజాసమస్యలపై మాత్రం ఏ సమయంలో వచ్చినా స్పందిస్తానని, రాజకీయాల్లోకి మాత్రం తనను లాగొద్దని అన్నారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని.. తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ప్రతి గ్రామానికి వెళతానని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

    Trending Stories

    Related Stories