Telugu States

కోమటి రెడ్డికి కండువా కప్పి బీజేపీ లోకి ఆహ్వానించిన అమిత్ షా

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారికంగా బీజేపీలో చేరారు. మునుగోడులో బీజేపీ తలపెట్టిన భారీ బహిరంగసభలో రాజగోపాల్ రెడ్డికి కేంద్ర మంత్రి అమిత్ షా బీజేపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాజగోపాల్ రెడ్డి భుజం తట్టి అమిత్ షా అభినందించారు. మునుగోడు సభకు రాష్ట్ర బీజేపీ కీలక నేతలంతా హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర ఇన్ఛార్జీ తరుణ్ ఛుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ మెంబర్ లక్ష్మణ్, విజయశాంతి, డీకే అరుణ, మాజీ ఎంపీ వివేక్ తదితరులు స్టేజ్ పై ఆశీనులయ్యారు. ఈ సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి వచ్చారు.

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తన చిరకాల మిత్రుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజలు ఇచ్చిన ధైర్యంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కేసీఆర్ పాలనపై సమరశంఖం మోగించారని.. మునుగోడు ప్రజలు కూడా రాజగోపాల్ వెంటే ఉన్నారని అన్నారు. హుజూరాబాద్ లో బీజేపీని గెలిపించిన దానికంటే పెద్ద మెజార్టీతో రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తామని చెబుతున్నారని అన్నారు. కేసీఆర్ ది శాడిస్టిక్ మెంటాల్టీ అని, అందుకే ఈరోజు మునుగోడులో అమిత్ షా సభ ఉంటే.. నిన్న హడావుడిగా కేసీఆర్ సభ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో అత్యధిక ప్రజల ప్రేమను పొందిన నేత ప్రధాని మోదీ అని అలాంటి మోదీని బంగాళాఖాతంలో ముంచేస్తామని కేసీఆర్ అన్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను బంగాళాఖాతంలో ముంచేస్తారని అన్నారు. కేసీఆర్ తో అంటకాగేవారిని ప్రజలు క్షమించరని అన్నారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి విజయం ఖరారయిందని ఈటల అన్నారు. రాజగోపాల్ ను ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారని చెప్పారు. హుజూరాబాద్ కంటే ముగుగోడు గడ్డ చాలా చైతన్యవంతమైనదని అన్నారు.

Related Articles

Back to top button