కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరబోయేది కన్ఫర్మ్ అని చెప్పుకొచ్చారు. శుక్రవారం తన రాజీనామా తదనంతర పరిణామాలపై మాట్లాడారు. తాను ఈ నెల 21న బీజేపీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే పదవికి తాను చేసిన రాజీనామా ఊరికే పోలేదని.. తన రాజీనామా తర్వాతే తెలంగాణలో చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ప్రకటించిందని అన్నారు. మునుగోడులో రోడ్ల నిర్మాణం, మరమ్మతు పనులు కూడా మొదలయ్యాయని అన్నారు. సీఎం కేసీఆర్ను వ్యక్తిగతంగా నష్టపరచాలని తనకేమీ లేదని.. కేసీఆర్ తన ఆలోచనాతీరును మార్చుకోవాల్సి ఉందని అన్నారు.
తాజా పరిణామాలపై కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడులో కాంగ్రెస్ మీటింగ్ పెట్టించి తనను తిట్టించారన్నారు. రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వెళ్తున్నారన్నారు. జానారెడ్డి ఇంటికి రేవంత్ వెళ్తారు. కానీ.. నా ఇంటికి రాలేదన్నారు. తాను మునుగోడు ఎన్నిక ప్రచారానికి వెళ్లేది లేదని.. పిలవని పేరంటానికి వెళ్లే అలవాటు తనకు లేదన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత చండూరులో నిర్వహించిన పార్టీ సమావేశానికి తనకు ఆహ్వానం అందలేదని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికకు ఇంకా షెడ్యూల్ కూడా విడుదల కాకముందే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేశారని విమర్శించారు. చండూరు సభలో తనను తిట్టించిన రేవంత్ రెడ్డి తనకు క్షమాపణ చెప్పాలని వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.