More

    కేటీఆర్ క్విడ్ ప్రోకో ఫ్యాఖ్యలపై ఫైర్ అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

    మునుగోడు అసెంబ్లీ స్థానానికి వచ్చే నెలలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. మునుగోడులో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ మేరకు నేడు బీజేపీ హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది. దేశంలో మరో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల అభ్యర్థుల పేర్లను కూడా బీజేపీ తన ప్రకటనలో వెల్లడించింది. తెలంగాణలోని మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, హర్యానాలోని అదంపూర్ లో భవ్య బిష్ణోయ్, ఉత్తరప్రదేశ్ లోని గొలా గోక్రాంత్ నియోజకవర్గంలో అమన్ గిరి బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తారని ఆ ప్రకటనలో పేర్కొంది.

    మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో, రాజకీయంగా పలు విమర్శలు చేస్తూ వస్తున్నారు. మంత్రి కేటీఆర్ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. రూ.18 వేల కోట్ల విలువైన కాంట్రాక్టు దక్కిందని, అందుకు ప్రతిగా ఆయన బీజేపీలో చేరారని, ఇది క్విడ్ ప్రో కో అని కేటీఆర్ ఆరోపణలు చేశారు. దీనిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చుకునే సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. “కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)కు బహిరంగ సవాల్ విసురుతున్నా. నీకు 24 గంటల సమయం ఇస్తున్నా. నాపై చేసిన క్విడ్ ప్రో కో ఆరోపణలు నిజమని నిరూపించు… లేకపోతే పరువునష్టం దావా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండు” అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు.

    మునుగోడులో బీజేపీ తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీచేస్తుండగా, అధికార టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పోటీ చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికకు ఈ నెల 7న నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 14వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుండగా, నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 17 చివరి తేదీ. నవంబరు 3న పోలింగ్ జరగనుండగా, నవంబరు 6న ఫలితాలు వెల్లడించనున్నారు.

    Trending Stories

    Related Stories