కూసుకుంట్లే కాదు.. కల్వకుంట్ల వారు పోటీ చేసినా గెలిచేది బీజేపీయే: కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్

0
957

మునుగోడులో ఎన్నికల వేడి మొదలైంది. ఈ ఎన్నిక‌లో గెలుపును ప్ర‌ధాన పార్టీలైన టీఆర్ఎస్ (బీఆర్ఎస్), బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ సిట్టింగ్ సీటు. ఈ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేగా కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇటీవల రాజ‌గోపాల్ రెడ్డి హ‌స్తం పార్టిని వీడి బీజేపీలో చేరారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ (బీఆర్‌ఎస్‌) అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం ప్రకటించారు. హైదరాబాద్‌లో ఆయనకు బీ ఫాంను, ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ నిధి నుంచి రూ.40 లక్షల చెక్కును అందించారు. మునుగోడు నుంచి ప్రాతినిధ్యం వహించిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతికి టిక్కెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎవరు పోటీ చేసినా విజయం మాత్రం భారతీయ జనతా పార్టీదే అని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. కూసుకుంట్లే కాదు.. కల్వకుంట్ల వారు పోటీ చేసినా గెలిచేది బీజేపీయే అని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి అన్నారు. మునుగోడులోని మాజీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పలువురిని కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

రాజగోపాల్​రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు సమస్యలను పట్టించుకోని టీఆర్​ఎస్​ ప్రభుత్వానికి ఇక్కడ ఓటు అడిగే హక్కు లేదన్నారు. టీఆర్​ఎస్​ గద్దెనెక్కి ప్రజా సమస్యలు విస్మరించిందని, కుటుంబ పాలన కొనసాగించడంతో ప్రజలు విసుగు చెందారన్నారు. టీఆర్ఎస్ కు ఎదుర్కొనేది బీజేపీ మాత్రమేనని ప్రజలు గుర్తించారని, అందుకే అన్ని పార్టీల నేతలు బీజేపీలోకి చేరుతున్నారని తెలిపారు. 9న మునుగోడు నియోజకవర్గంలో నిర్వహించే బైక్ ర్యాలీతో బీజేపీ సత్తా చాటాలని, అందుకోసం కోసం కార్యకర్తలు బాగా పని చేయాలని మునుగోడు ఉప ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి సూచించారు.