Telugu States

హోం మంత్రి అమిత్ షాను కలిసింది నిజమే: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశానని టీకాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మర్యాదపూర్వకంగానే ఆయనను కలిశానని.. బీజేపీలో చేరే అంశంపై ఆయనతో చర్చించలేదని తెలిపారు. తాను పార్టీ మారుతున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని అన్నారు. గతంలో తాను బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన సంగతి నిజమేనని చెప్పారు. తాను ముందు నుంచి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోరాటం చేస్తూనే ఉన్నానని అన్నారు.

అధికారంలోకి వచ్చిన ఏడున్నరేళ్లలో రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల ఊబిగా మార్చారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాలకు నిధులు మంజూరు చేయకుండా కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమిని ఎవరూ ఆపలేరని జోస్యం చెప్పారు. తాను రాజీనామా చేయబోతున్నానని కేసీఆర్ సొంత పత్రికలో ఆర్టికల్స్ రాయించి హంగామా చేయించారని.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసింది నిజమే అని స్పష్టం చేశారు. గతంలో బీజేపీకి అనుకూలంగా ప్రకటనలు చేశాను, కానీ, రాజీనామా, రాజకీయాలపై అమిత్ షాతో చర్చించలేదని, కేవలం రాష్ట్ర పరిస్థితి గురించే మాట్లాడానని అన్నారు. మునుగోడుకు ఉప ఎన్నిక రావాలని, తాను రాజీనామా చేయాలని అనుకోవడం లేదని, ఇదంతా కేసీఆర్ డ్రామా అని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నిలబెట్టిన అభ్యర్థికే ఓటు వేశానని అన్నారు. తాను పదవుల కోసం రాజకీయాలు చేసే వ్యక్తిని కాదని.. కాంగ్రెస్ పార్టీ అన్నా, సోనియా గాంధీ అన్నా తనకు అపారమైన అభిమానం ఉందని వెల్లడించారు. రాష్ట్ర అధిష్టానం తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా.. సోనియా గాంధీ మీద గౌరవంతోనే సైలెంట్‌గా ఉన్నానని అన్నారు.

Related Articles

Back to top button