National

నూపుర్‌ శర్మకు కోల్‌కతా పోలీసులు సమన్లు జారీ

మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన బహిష్కృత బీజేపీ నేత నూపుర్‌ శర్మకు కోల్‌కతా పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ నెల 20న హాజరుకావాలని ఆదేశించారు. ఆమెపై ఇప్పటికే కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. బీజేపీ మాజీ అధికార ప్రతినిధి శర్మపై బెంగాల్‌లోని నార్కెల్‌దంగా పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.

వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ముంబై పోలీసుల ముందు హాజరయ్యేందుకు తనకు మరింత సమయం కావాలని నూపుర్‌ శర్మ కోరారు. షెడ్యూల్ ప్రకారం మహారాష్ట్రలోని బివాండీ పోలీసుల ముందు సోమవారం నాడు ఆమె హాజరు కావాల్సి ఉంది. అయితే తనకు మరింత గడువు ఇవ్వాలని నూపుర్ శర్మ కోరినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. శర్మ విజ్ఞప్తిని అంగీకరించామని.. ఎంతవరకూ ఆమెకు గడువు ఇచ్చారనేది మాత్రం వెల్లడించలేదు. టీవీ చర్చా కార్యక్రమంలో మహమ్మద్ ప్రవక్తపై నూపర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు గాను రజా అకాడమీ ప్రతినిధి మే 30న ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నూపర్‌ శర్మ స్టేట్‌మెంట్ రికార్డు చేసేందుకు సమన్లు పంపారు.

నూపుర్‌ శర్మను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశంలోని పలు నగరాల్లో నిరసనలు జరగ్గా.. హింసాత్మకంగా మారాయి. బెంగాల్‌లోని అనేక నగరాల్లో ప్రదర్శనలు నిర్వహించారు. నదియా జిల్లాలోని బెతువదాహరి స్టేషన్‌లో ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు లోకల్ రైలుపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ ఘటనలో స్టేషన్‌లోని కొంతమంది సిబ్బంది, కృష్ణానగర్-లాల్గోలా లోకల్ రైలులోని ప్రయాణికులు గాయపడ్డారని తూర్పు రైల్వే అధికారి తెలిపారు.

Related Articles

Back to top button