సంక్రాంతి పండుగ సమయంలో గుడివాడలోని కొడాలి నానికి చెందిన కె-కన్వెన్షన్ సెంటర్ లో క్యాసినో నిర్వహించారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. గోవాకు చెందిన క్యాసినో నిర్వాహకులు కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ సెంటర్‌లో జూదం ఏర్పాటు చేశారనే విషయం ఏపీలో సంచలనం కలిగించింది. దీనిపై టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. కె-కన్వెన్షన్ సెంటర్లో క్యాసినో నిర్వహణకు సంబంధించి మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా ఎస్పీకి తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. జూదం, అసభ్య నృత్యాల నిర్వహణ ద్వారా రూ.500 కోట్లు చేతులు మారాయని ఫిర్యాదులో ఆరోపించారు. అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ తెలుగు సంస్కృతిని దెబ్బతీసే చర్యలను పోలీసులు చూస్తూ ఉన్నారని విమర్శలు చేశారు.
“గోవాలో ఉన్న క్యాసినో సంస్కృతిని ఏపీలోని గుడివాడకు తీసుకొచ్చిన నానిని ఎందుకు విమర్శిస్తున్నారు. వారంతా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది.. గుడివాడలోని జనం గోవా సిటీకి వెళ్తారు. కానీ, గోవా ప్రజలు మాత్రం గుడివాడకు రాలేరు. జై గుడివాడ’’ అంటూ రాంగోపాల్ వర్మ కూడా స్పందించడంతో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
నిజ నిర్దారణ పేరుతో ఈ రోజున టీడీపీ నేతలు గుడివాడ వెళ్లారు. మంత్రి కొడాలి నానికి చెందిన కె కన్వెన్షన్ సెంటర్ రెండున్నర ఎకరాల్లో ఉంది. దీనిని పరిశీలించటంతో పాటుగా… స్థానికులను ఆరా తీయటానికి టీడీపీ నేతలు వెళ్లారు.
తనపై వచ్చిన ఆరోపణలపై కొడాలి నాని స్పందించారు. తన కల్యాణమంటపం రెండున్నర ఎకరాల్లో ఉంటుందని… అక్కడ కేసినోలు, పేకాట వంటివి నిర్వహించినట్టు నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటానని కొడాలి నాని సవాల్ విసిరారు. చంద్రబాబు టైమ్ అయిపోయిందని.. ఈరోజు నిజనిర్ధారణకు వచ్చినవాళ్లంతా ఎన్నికల్లో ఓడిపోయిన వారేనని చెప్పారు. తన కన్వెన్షన్ లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయో, లేదో చెప్పడానికి గుడివాడ ప్రజలు ఉన్నారని… టీడీపీ నిజనిర్ధారణ కమిటీ అవసరం లేదని నాని అన్నారు. రాష్ట్రంలో అన్ని చోట్ల జూదం జరిగిన విధంగానే గుడివాడలో కూడా జరిగిందని అన్నారు. మహిళలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారని తనకు సమాచారం అందిన వెంటనే డీఎస్పీకి ఫోన్ చేసి అడ్డుకున్నానని చెప్పారు. చంద్రబాబుకు, నారా లోకేశ్ కు క్యాసినోలు బాగా తెలుసని అన్నారు.