National

ప్రధాని మెచ్చుకున్నారు.. పినరయి పక్కనపెట్టేశారు

కరోనా మహమ్మారిపై ఆమె సివంగిలా పోరాడింది. వైరస్ కట్టడికి ఆమె తీసుకున్న నిర్ణయాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆ టీచరమ్మ నిర్ణయాలను మెచ్చుకున్నారు. ఆమెను ప్రశంసిస్తూ పలు మీడియా కథనాలు ప్రసారం చేశాయి. ఆమే కేరళ మాజీ ఆరోగ్యశాఖామంత్రి కె.కె. శైలజ. సీన్ కట్ చేస్తే.. ప్రతిభావంతురాలైన ఆ మంత్రికి సీఎం పినరయి విజయన్ మొండిచేయి చూపారు. తాజా కేబినెట్ లో ఆమెకు చోటు కల్పించలేదు.

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ రెండోసారి విజయం సాధించింది. చరిత్రను తిరగరాస్తూ.. పినరయి విజయన్ రెండోసారి సీఎం కుర్చీ ఎక్కారు. తాజాగా కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. అయితే, అందులో సీనియర్ నేత కె.కె. శైలజకు మాత్రం చోటివ్వలేదు. అంతేకాదు, కేబినెట్ లో అంతా కొత్తవారిని ఎంపిక చేసిన విజయన్.. తాను మాత్రం రెండోసారి సీఎం పదవిని అంటిపెట్టుకున్నారు. కొత్త మంత్రివర్గానికి సంబంధించిన వివరాలను సీపీఎం నేత ఎ.ఎన్. షంషీర్ వెల్లడించారు. కేబినెట్ లో సీపీఎం పార్టీ నుంచి సీఎం పినరయి విజయన్ ఒక్కరే పాతవారని, మిగతా 11 మంది మంత్రులంతా కొత్తవారే ఉంటారని చెప్పారు. యువతకు ప్రాధాన్యత కల్పించడానికే పాతవారికి చోటివ్వలేదని తెలిపారు. ఇది పార్టీ తీసుకున్న నిర్ణయమని.. అందరూ పార్టీ నిర్ణయాన్ని శిరసావహించాల్సిందేనన్నారు.

ఇక, 21 మంది మంత్రులతో ఈ నెల 20న సీఎం పినరయి విజయన్ ప్రమాణ స్వీకారం చేస్తారని సీపీఎం రాష్ట్ర ఇన్ చార్జి కార్యదర్శి, ఎల్డీఎఫ్ కన్వీనర్ ఎ. విజయరాఘవన్ చెప్పారు. మంత్రుల శాఖలను ముఖ్యమంత్రే నిర్ణయిస్తారన్నారు. కూటమిలో ప్రధాన పార్టీ అయిన సీపీఎం నుంచి 12 మంది, సీపీఐ నుంచి నలుగురు, కేరళ కాంగ్రెస్ (ఎం), జనతాదళ్ (ఎస్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్కరికి మంత్రిగా అవకాశం దక్కనున్నట్టు సమాచారం. అయితే, కరోనా వైరస్ కట్టడి చర్యల్లో కీలకపాత్ర పోషించిన కేకే శైలజను పక్కనపెట్టడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తవారికి చోటు కల్పించాలనే ఉద్దేశంతో ప్రతిభావంతులైన నాయకులను పక్కనపెట్టడంపై సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. మరి, అంతా కొత్తవారిని తీసుకునేటట్టయితే, ఆయన మాత్రం ఎలా కొనసాగుతారని సీఎం పినరయి విజయన్ పైనా మండిపడుతున్నారు.

కె.కె. శైలజ కేరళలో మంత్రిగా కంటే శైలజా టీచర్‌గానే సుప్రసిద్ధురాలు. ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో మట్టనూరు అసెంబ్లీ స్థానం నుంచి ఆమె 60వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు ఏం చేయాలో ఆలోచించి అందుకు తగ్గట్టు కార్యాచరణను రూపొందించారు.. అందరిచేత శభాష్‌ అనిపించుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై కూడా ప్రశంసలు అందుకున్నారు. బ్రిటన్‌కు చెందిన ప్రాస్పెక్ట్‌ మ్యాగజైన్‌ కరోనా సంక్షోభం సందర్భంగా ప్రపంచంలో బెస్ట్‌ థింకర్స్‌ ఎవరు అన్నదానిపై సర్వే చేపట్టగా శైలజ నంబర్‌వన్‌గా నిలిచారు. కొన్నేళ్ల కిందట నిఫా వైరస్‌ ప్రబలినప్పుడు కూడా ఇలాగే కష్టపడి దానిని నియంత్రించగలిగారు. కరోనా వైరస్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన టెస్ట్‌, ట్రేస్‌,ట్రీట్మెంట్‌ను పక్కాగా పాటించారు. ఇప్పుడు కరోనా కట్టడిలోనూ ప్రతిభ కనబరిచారు. కరోనాపై విజయం సాధించి, దేశం నుంచే ఆ వైరస్‌ను తరిమికొట్టారని ప్రశంసలను అందుకున్న.. న్యూజీలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డెన్‌‌ను సైతం శైలజ రెండో స్థానంలోకి నెట్టారు. ప్రధాని నరేంద్ర్ మోదీ నుంచి కూడా కె.కె. శైలజ ప్రశంసలందుకున్నారు. అలాంటి శైలజకు మంత్రివర్గంలో చోటు ఇవ్వట్లేదన్న ప్రచారం చాలామందిని విస్మయానికి గురిచేస్తోంది. ప్రతిభావంతురాలైన శైలజను ప్రోత్సహిస్తే తనకే కాంపిటీటర్ అవుతారని అనుకున్నారో,.. లేక ప్రధాని చేత ప్రశంసలు అందుకోవడం హర్ట్ చేసిందో తెలియదు గానీ.. ఈ గోల్డ్ స్కామ్ సీఎం ప్రతిభావంతురాలైన ఓ నాయకురాలికి చెక్ పెట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

3 × one =

Back to top button