More

    తెలంగాణలో ఎరువుల కొరత తీరుతుంది: కేంద్రమంత్రి కిషన్‌‎రెడ్డి

    తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని కేంద్రమంత్రి కిషన్‌‎రెడ్డి అన్నారు. రామగుండంలో ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి కిషన్‌‎రెడ్డి మాట్లాడారు. రూ. 6,338 కోట్లతో ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించామని, ఈ ఫ్యాక్టరీతో రాష్ట్రంలో ఎరువుల కొరత తీరుతుందన్నారు. యూరియా మీద కేంద్రప్రభుత్వం భారీగా రాయితీ ఇస్తోందన్నారు. ఇక కేంద్రం ధాన్యం కొనటం లేదంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, రూ.26వేల కోట్లు వెచ్చించి కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తోందన్నారు. ధాన్యం ధరను మోదీ ప్రభుత్వం రూ.2వేలకు పెంచిందని గుర్తు చేశారు. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు వేస్తున్నామన్నారు. 2014నాటికి కేంద్రం 24లక్షల కోట్ల టన్నుల ధాన్యం మాత్రమే సేకరించిందని.. ఇవాళ కేంద్రం 142 లక్షల కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తోందని చెప్పారు. 2014 నాటికి రాష్ట్రంలో 2,500 కిలోమీటర్ల మాత్రమే జాతీయ రహదారులు ఉండేవని, అవి ఇప్పుడు రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తీర్ణం దాదాపు 5వేల కిలోమీటర్లకు చేరుకుందన్నారు. రామగుండంలో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒక్క రామగుండంలోనే కేంద్రం రూ.4వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తున్నాం అన్న దాంట్లో ఎలాంటి నిజం లేదన్నారు.

    Related Stories