బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి.. మరి కొందరు కూడా..!

బీజేపీ తెలంగాణ నేత కిషన్ రెడ్డి నేడు సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు ఆయనకు కంగ్రాట్స్ చెప్పారు. పర్యాటకశాఖ సహాయ మంత్రి అజయ్ భట్, శ్రీపాద నాయక్, మీనాక్షి లేఖి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
మన్సుక్ మాండవీయ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మాజీ ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గత వారం రోజుల నుంచి మన్సుక్ మాండవీయ వ్యాక్సిన్ కంపెనీలను కలుస్తూ ఉన్న సంగతి తెలిసిందే. కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ శాఖ సహాయ మంత్రిగా ఉన్న మాండవీయకు ఇప్పుడు ఆరోగ్యశాఖ బాధ్యతలు దక్కాయి. మాండవీయది గుజరాత్. ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడు కూడా. క్యాబినెట్ విస్తరణలో ఆరోగ్యశాఖను దక్కించుకున్న మాండవీయ.. కెమికల్స్, ఫర్టిలైజర్స్ శాఖను కూడా నిలుపుకున్నారు. గుజరాత్‌లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో మాండవీయ వెటర్నరీ సైన్స్ చదివారు. ఆ తర్వాత ఆయన పొలిటికల్ సైన్సులో మాస్టర్స్ పూర్తి చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌లో సభ్యుడిగా ఉన్న ఆయన 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2012లో గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికయ్యారు. 2016లో మోదీ ప్రభుత్వంలో మాండవీయ చేరారు. రోడ్డు, రవాణా, రహదారుల శాఖలకు ఆయన సహాయ మంత్రిగా కూడా చేశారు.
రైల్వే శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్ బాధ్యతలు చేపట్టారు. ప్రధాని మోదీ విజన్‌లో రైల్వే ప్రాధాన్యమైందని.. ఆయన విజన్ కోసం తాను పనిచేయనున్నట్లు మంత్రి అశ్విని తెలిపారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా అనురాగ్ ఠాకూర్ బాధ్యతలు స్వీకరించారు. భారత్‌ను ముందుకు తీసుకువెళ్లేందుకు గత ఏడేళ్ల నుంచి ప్రధాని మోదీ అద్భుత రీతిలో పనిచేస్తున్నారన్నారు. ప్రధాని మోదీ తనకు ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తానని అనురాగ్ తెలిపారు.
జ్యోతిరాదిత్య సింధియా గతేడాది కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. బుధవారం కేంద్రమంత్రిగా ప్రమాణం చేసిన ఆయనకు పౌర విమానయాన శాఖ కేటాయించారు. సరిగ్గా 20 ఏళ్ల కిందట ఆయన తండ్రి మాధవరావ్ సింధియా కూడా పీవీ నరసింహారావు ప్రభుత్వంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్‌గా పని చేశారు. 1991 నుంచి 1993 మధ్య ఆయన ఈ శాఖ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం సంక్షోభంలో పడిన పౌర విమానయాన శాఖ బాధ్యతలను జ్యోతిరాదిత్య సింధియా చేపట్టారు. మాధవరావ్, జ్యోతిరాదిత్య ఇద్దరూ ఈ శాఖలు చేపట్టక ముందు కూడా కేంద్ర మంత్రులుగా పని చేశారు. పౌర విమానయాన శాఖ చేపట్టకముందు రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు మాధరావ్ సింధియా. జ్యోతిరాదిత్య కూడా గతంలో మన్మోహన్సింగ్ ప్రభుత్వంలో ఐటీ, కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా పని చేశారు. ఈ ఇద్దరు కూడా పార్టీలు మారారు. మొదట్లో జనసంఘ్‌లో ఉన్న మాధవరావ్ సింధియా.. ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు.
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రిగా రాజీవ్ చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. న్యాయశాఖ మంత్రిగా కిరణ్ రిజిజు, రైల్వే సహాయ మంత్రిగా దన్వే రావుసాహెబ్ దాదారావు, ఆరోగ్యశాఖ సహాయమంత్రిగా డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, రైల్వేశాఖ సహాయ మంత్రిగా దర్శన్ విక్రమ్ జర్దోష్, పర్యావరణ, కార్మికశాఖ మంత్రిగా భూపేంద్ర యాదవ్‌లు బాధ్యతలు చేపట్టారు.