Telugu States

కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

కేంద్ర ప్ర‌భుత్వంపైనా, రాష్ట్ర బీజేపీ నేత‌ల‌పైనా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రెండు రోజులు వరుసగా ప్రెస్ మీట్ పెట్టి మరీ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ నేతలు గట్టి కౌంటర్లే ఇచ్చారు. కేసీఆర్ కు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందని విమర్శలు గుప్పించారు.

కేసీఆర్ వ్యాఖ్యలకు సమాధానంగా కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ అన్ని విష‌యాల‌ను వ‌క్రీక‌రిస్తూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టేలా తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడ‌డం సరికాద‌ని చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వం దోచుకుంటోంద‌ని అంటున్నార‌ని, ఆ అవ‌స‌రం త‌మ‌కు లేద‌ని అన్నారు. త‌మ కుటుంబాల‌కు ఏం ఫాంహౌసులు లేవ‌ని, అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం తామేం రూ.350 కోట్లు ఖ‌ర్చుచేయ‌లేద‌ని అన్నారు. నాలుక‌లు చీల్చుతామ‌ని అంటున్నారని, అయితే ఈ తాటాకు చ‌ప్పుళ్ల‌కు తాము భ‌య‌ప‌డ‌బోమ‌ని చెప్పారు. ప్ర‌తి సంవ‌త్స‌రం ధాన్యాన్ని కేంద్ర ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేస్తోంద‌ని.. ధాన్యం సేక‌ర‌ణ‌కు కేంద్ర స‌ర్కారు రూ.26,640 కోట్లు ఖ‌ర్చు చేస్తోంద‌ని చెప్పారు. 2014లో ధాన్యం సేకరణకు ఉన్న మొత్తాన్ని రూ.3,400 కోట్ల నుంచి రూ.26,640 కోట్లకు పెంచామ‌ని తెలిపారు. అంత‌ర్జాతీయంగా క్రూడాయిల్ ధ‌ర‌లు పెర‌గ‌క‌పోయిన‌ప్ప‌టికీ భార‌త్‌లో ఎన్డీఏ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచేస్తోంద‌ని కేసీఆర్ నిందలు వేస్తున్నారని, అయితే అంత‌ర్జాతీయంగా పెర‌గ‌క‌పోతే మ‌న దేశంలో ధ‌ర‌లు పెంచాల్సిన అవ‌స‌రం కేంద్ర స‌ర్కారుకి లేద‌ని అన్నారు. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో పెట్రోలు ధ‌ర‌లు పెంచార‌ని.. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం ధ‌ర‌లు త‌గ్గించింద‌ని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు పెట్రోలు, డీజిలు ధ‌ర‌ల‌ను త‌గ్గించాయ‌ని.. తెలంగాణ‌లోనూ ధ‌ర‌లు త‌గ్గించాల‌ని ఆయ‌న అన్నారు. ఆలోచించి ప్ర‌జ‌ల‌కు మేలు చేసేలా రాష్ట్రంలో ధ‌ర‌లు త‌గ్గించాల‌ని కోరారు.

లేనిపోని మాటలు చెప్పి రైతులను తప్పుదోవపట్టించొద్దని కిషన్ రెడ్డి అన్నారు. బాయిల్డ్ రైస్ ఎవరూ తినడం లేదని.. పండించడం లేదని అన్నారు. రా రైస్ ఇస్తే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. 2016 లో కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో కొత్త కాలేజీల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం నుండి కనీస బాధ్యతగా స్పందించలేదని అని వివరించారు. కనీసం మంత్రులు కాని, సీఎం కాని కేంద్రంతో చర్చించారా అని ఆయన ప్రశ్నించారు.

Related Articles

Back to top button