More

    కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

    కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిరుపతి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి విజయవాడకు ఆయన ర్యాలీగా బయల్దేరారు. అయితే ఎనికేపాడు వద్ద ఆయన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతులు లేవని పోలీసులు చెప్పడంతో బీజేపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు కేవలం రెండు కార్లను మాత్రమే విజయవాడ వైపుకు అనుమతించారు. ఇతర కార్లు, బైకులన్నీ అక్కడే ఆగిపోయాయి.

    పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని ఏపీ బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. విజయవాడ చేరుకున్న కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం బీజేపీ శ్రేణులను వేధిస్తోందని ఆరోపించారు. పార్లమెంటులో పనిచేయనీయకుండా తమను అడ్డుకున్నారని.. అందుకే ప్రజల్లోకి వచ్చి జన ఆశీర్వాద యాత్ర చేపట్టామని వివరించారు. అనేక అంశాల్లో ఏపీకి ప్రాధాన్యత కింద నిధులు ఇచ్చామని వెల్లడించారు. ఏపీకి నిధుల విషయంలో కేంద్రంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అసంతృప్తి వెలిబుచ్చారు. వ్యక్తులు, కుటుంబాల ఆధారంగా నడిచే పార్టీలను నమ్మవద్దని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కుటుంబ పార్టీలకు వ్యక్తిగత స్వార్థం తప్ప విశాల దృక్పథం ఉండదని విమర్శించారు. కిషన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలవనున్నారు.

    కిషన్ రెడ్డి తిరుపతి నుంచి జన ఆశీర్వాద యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర రెండు రోజుల పాటు ఏపీలో, మూడు రోజుల పాటు తెలంగాణలో కొనసాగనుంది. కిషన్ రెడ్డి ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఉన్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఆయన విజయవాడకు చేరుకున్నారు. తిరుపతిలో నిర్వహించిన సభలో కూడా కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మార్పు కోసం అధికారం అప్పగించిన ప్రజలకు సమన్యాయం చేయాలని జగన్‌కు సూచించారు. ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు వేసినా, వేయకున్నా ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తున్నారని, కానీ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అందరినీ అలా చూడడం లేదని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

    Trending Stories

    Related Stories