ఈ నెల 10వ తేదీన వివిధ రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జీలను నియమించింది. ఈ క్రమంలో కర్ణాటక రాజ్యసభ ఎన్నికల ఇన్ఛార్జీగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించారు. మహారాష్ట్రకు అశ్విని వైష్ణవ్, హర్యాణాకు గజేంద్ర సింగ్ షెకావత్, రాజస్థాన్ కు నరేంద్ర సింగ్ తోమర్ నియమితులయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వీరిని నియమించినట్టు ప్రకటనలో తెలిపింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ ఓబీసీ మోర్చా చీఫ్ కే లక్ష్మణ్, కాంగ్రెస్ నేతలు రణదీప్ సింగ్ సూర్జేవాలా, అజయ్ మాకెన్, రాజీవ్ శుక్లా, మీడియా బారన్ సుభాష్ చంద్ర ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన మరుసటి రోజే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. రాజ్యసభ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటి వరకు 22 మంది అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ ఉత్తరప్రదేశ్ నుండి ఎనిమిది మంది అభ్యర్థులను, మహారాష్ట్ర, కర్ణాటక నుండి ముగ్గురు చొప్పున, బీహార్, మధ్యప్రదేశ్ నుండి ఇద్దరు చొప్పున, రాజస్థాన్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ మరియు హర్యానా నుండి ఒక్కొక్కరు చొప్పున అభ్యర్థులను నిలబెట్టింది. పార్టీ రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్ పేర్లు ఉన్నప్పటికీ, మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, సీనియర్ నేతలు వినయ్ సహస్రబుద్ధే, ఓపీ మాథుర్ వంటి ప్రముఖుల పేర్లు లేవు.