More

  కశ్మీర్ రెండుసార్లు దూరం చేసిన నెహ్రూ..! 75 ఏళ్ల రక్తపాతానికి కారణం అదేనా..?

  భరతమాత మకుటం.. కశ్మీరం. అత్యంత సుందరమైన లోయలు, మంచు ప్రదేశాలతో కూడుకున్న కశ్మీర్ అందమైన భరతావని శిరస్సున వజ్రాల కిరీటం. అయితే సుందరమైన కశ్మీర్ దశాబ్దాలపాటు ఉగ్రవాద కోరల్లో నలిగిపోతూ వచ్చింది. సుందరమైన జలపాతాలు సవ్వడి చేసే లోయలో రక్తపు మరకల ముద్రలు మిగిలాయి. పిచ్చుకల శబ్దాలు వినిపించాల్సిన కశ్మీర్ లో తూటాల మోతలు ఇప్పటికీ మోగుతున్నాయి. కశ్మీర్ భారత్ కు వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కశ్మీర్ని కాపాడుకునేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించాల్సి వచ్చింది. స్థానిక యువత సైన్యంపై దాడి చేసినా భరించాయి భద్రత బలగాలు. 90వ దశకంలో హిందూ మహిళలను తమకు వదిలి వెళ్ళిపోండని మసీదుల నుండి ప్రకటనలు వచ్చినా ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోవాల్సి వచ్చింది. 90ల నుంచి ఇప్పటివరకు దాదాపు 45 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో సైనికులు, సాధారణ పౌరులు కూడా ఉన్నారు. దేశంలో రక్తపాతానికి కారణమైంది పాకిస్తాన్ ఉగ్రవాదమే అయినా,.. ఈ సమస్యకు మూలకారకుడు మాత్రం కేవలం ఒకే ఒక వ్యక్తి.. అతడే పండిట్ జవహర్ లాల్ నెహ్రూ.

  స్వతంత్ర భారత దేశానికి తొలి ప్రధాని అయిన జవహర్ లాల్ నెహ్రూ కశ్మీర్ రావణకాష్ఠానికి ఆద్యుడు. దేశ భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఆయన తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే సుదీర్ఘ రక్తపాతానికి కారణమయ్యాయి. ఈ విషయాన్ని తాజాగా జరిగిన ఎన్నికల సభలో ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా దేశ ప్రజలకు గుర్తుచేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సర్దార్ పటేల్ అన్ని సంస్థానాలనూ విజయవంతంగా విలీనం చేశారనీ,.. కానీ, కశ్మీర్ ఒక్కటి మాత్రం మరో వ్యక్తి పరిష్కరిస్తానని ముందుకు రావడంతో ఈ సమస్య మొదలైందని మోదీ అన్నారు. తాను కూడా సర్దార్ పటేల్ అడుగుజాడల్లో ప్రయాణిస్తున్నందుకే కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి పూనుకున్నానని మోదీ తెలిపారు. దీంతో ఈ విషయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఒకవైపు కశ్మీర్ విషయంలో రాజా హరిసింగ్ దే తప్పు అని కాంగ్రెస్ వాదిస్తుంటే మరోవైపు నెహ్రూదే తప్పు అని బీజేపీ వర్గాలు వాదిస్తున్నాయి. ఈ చర్చలో భాగంగా కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ కు.. కేంద్ర న్యాయశాఖామంత్రి, బీజేపీ నేత కిరణ్ రిజిజు మధ్య మాటల యుద్దం జరుగుతోంది.

  ఇటీవల నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై జైరాం రమేష్ ట్విట్టర్ లో స్పందించారు. నాటి విశేషాల గురించి పటేల్ జీవిత చరిత్ర ఆధారంగా చేసుకుని రాజ్ మోహన్ గాంధీ రాసిన పుస్తకంలోని కొన్నింటిని జైరాం రమేష్ ఉటంకించారు. అప్పట్లో కశ్మీర్ ను భారత్ లో విలీనం చేయడానికి నెహ్రూ తీవ్రంగా ప్రయత్నించినా అప్పటి కశ్మీర్ రాజు ‘రాజా హరిసింగ్’ దీన్ని వ్యతిరేకించాడని చెప్పుకొచ్చాడు. అయితే ఎప్పుడైతే కశ్మీర్ భూభాగాన్ని సగానికిపైగా పాకిస్తాన్ ఆక్రమించిందో.. అప్పుడే రాజా హరిసింగ్ కశ్మీర్‎ను భారత్‎లో విలీనం చేయడానికి ఒప్పుకున్నాడని గుర్తుచేశారు. అంతేకాదు, ఆ తర్వాత కశ్మీర్‎లోని ముస్లిం నాయకుడు షేక్ అబ్దుల్లాకు నెహ్రూకు సత్సంబంధాలుండటంతోనే భారత్‎లో కలుస్తామని ఆయన ప్రతిపాదించాడంటూ జైరాం రమేష్ చెప్పుకొచ్చారు.

  అయితే జైరాం రమేష్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర న్యాయశాఖా మంత్రి కిరణ్ రిజిజు ఆధారాలతో సహా కొట్టిపారేశారు. కశ్మీర్ సమస్యను నెహ్రూనే సృష్టించాడన్నారు. జైరాం రమేష్ చెబుతున్నట్లుగా కాక.. పాకిస్తాన్ కశ్మీర్ ను ఆక్రమించడానికి ముందే.. రాజా హరిసింగ్ భారత్ లో విలీనానికి ఒప్పుకున్నాడన్నారు. దీనికి ఆధారంగా 1952 జూలై 24 న లోక్ సభలో నెహ్రూ ఇచ్చిన స్పీచ్ ను బయటపెట్టారు. అందులో రాజా హరిసింగ్ స్వాతంత్య్రానికి ముందే భారత్ లో విలీనమవుతానని ఒప్పుకున్నట్లు ప్రధానే పేర్కొన్నారు. 1947 జూలైలోనే కశ్మీర్ రాజు నెహ్రూను కలిసి భారత్ లో విలీనమౌతానని అభ్యర్థించాడట. అయితే ఈ ప్రతిపాదనను నెహ్రూ తిరస్కరిచాడమే విభ్రాంతికర సత్యం..! దీంతో పాటు అక్టోబర్ నెలలో కశ్మీర్ ను పాకిస్తాన్ ఆక్రమించడంతో అక్టోబర్ 27 న మళ్ళీ నెహ్రూకు ఇదే అభ్యర్థనను పంపగా మరోసారి నెహ్రూ తిరస్కరించాడు. ఈ విషయాలన్నిటినీ స్వయంగా భారత పార్లమెంట్ లో అప్పటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూయే స్వయంగా ఒప్పుకున్నారు. ఈ సాక్ష్యాలతో జైరాం రమేష్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడమే కాకుండా.. నాటి దుష్పరిణామాలను మరోసారి దేశ ప్రజలకు గుర్తు చేశారు కిరణ్ రిజిజు.

  అయితే నెహ్రూ తీవ్ర నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడంతో కశ్మీర్ చేజారిపోయి పూర్తిగా పాకిస్తాన్ వశమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అప్పటి ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ మిగిలి ఉన్న కశ్మీర్ భూభాగాన్ని త్వరితగతిన కాపాడేందుకు చర్యలు తీసుకున్నారు. అప్పటికి 45 శాతం భూభాగం మాత్రమే భారత్ వద్ద మిగిలింది. స్వాతంత్య్రానికి ముందే కశ్మీర్ విలీనానికి ఒప్పుకుని ఉంటే పీఓకే అనే సమస్యే ఉండేది కాదు. అలా చేయకుండా నెహ్రూ అనాలోచితంగా కశ్మీర్ విషయంలో కేబినెట్ నిర్ణయం కూడా తీసుకోకుండా.. ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు. పాకిస్తాన్ ఆక్రమించుకున్న తర్వాత కొద్ది రోజులకు రాజా హరిసింగ్ భారత్ లో విలీనమౌతానని చెప్పడంతో ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో రెఫరెండం నిర్వహించాలని భారత ప్రధాని హోదాలో లేఖను అందజేశాడు. ఆ కారణంగా కశ్మీర్ సమస్య మరింత ముదిరింది. దీని ఫలితంగానే కశ్మీర్ ఇప్పటికీ రగులుతోంది. కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాద కోరల్లో చిక్కి కశ్మీర్ రక్తపాతాన్ని చవి చూసింది. సుందరమైన పర్యాటకానికి ఎంతో అనుకూలమైన ప్రాంతం కాస్తా ఉగ్రవాదులకు నెలవైంది. 45 వేల మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది.

  నాటి ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేలే దేశ ప్రధాని అయి ఉంటే కశ్మీర్ కు ఈ సమస్యే ఉండేది కాదని పలువురు భావిస్తున్నారు. దేశంలో 565 సంస్థానాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా భారత్ లో విలీనం చేశారు. హైదరాబాద్, జునాఘడ్ సంస్థానాధీశులు తాము భారత్ లో కలవమని పట్టుబట్టడంతో భారత సైన్యాన్ని ఉపయోగించి మరీ విలీనం చేశారు. సర్దార్ పటేల్ లేకపోతే కశ్మీర్ లాంటి సమస్యలు మరిన్ని ఏర్పడేవని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉక్కుమనిషికి ఉన్న ఉక్కు సంకల్పంతో పాటుగా అపారమైన దేశభక్తి, ముందుచూపుతో భారత్ ను పటిష్టంగా తీర్చిదిద్దారు. కశ్మీర్ అంశాన్ని కూడా నెహ్రూ తీసుకోకుండా పటేల్ కే అప్పగించి ఉంటే ఇప్పుడీ సమస్యే ఉండేది కాదనీ పలువురు అభిప్రాయపడుతున్నారు.

  ఇక ఆనాడు పండిట్ నెహ్రూ చేసిన ఒకే ఒక్క తప్పు వల్ల భారత్ దశాబ్దాల తరబడి గాయాన్ని అనుభవిస్తూనే ఉంది. భరతమాత నుదుటిపై నుంచీ నెత్తుటిధార ప్రవహిస్తూనే ఉంది. ఆర్టికల్ 370, 35ఏ లాంటి దారుణ చట్టాలను రద్దు చేసి మోదీ సర్కార్ కాస్తంత ఉపశమనం కలిగించినా,.. నాటి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చేసిన తప్పిదాలకు ఇప్పటికీ భారత ప్రజలు మూల్యం చెల్లిస్తూనే ఉన్నారు.

  Trending Stories

  Related Stories