ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ కనిపిస్తే ఒక వార్త.. కనిపించకుండా పోతే ఇంకో వార్త..! తాజాగా మళ్లీ బహిరంగ కార్యక్రమంలో కనిపించాడు కిమ్..! అయితే చూసిన వాళ్లంతా కిమ్ కు ఏమైంది అంటూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే కిమ్ బొద్దుగా కాకుండా.. చాలా సన్నబడి కనిపించాడు. ఇంతకు ముందు కనిపించినప్పుడు అతడి తలపై ఉన్న ఒక గుర్తు గురించి సర్వత్రా చర్చ జరగ్గా ఇప్పుడు కిమ్ బక్కగా అవ్వడం ఆసక్తికరంగా మారింది. 73వ మిలిటరీ పరేడ్ సందర్భంగా ప్యాంగ్యాంగ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కిమ్ కపించాడు. ఎప్పుడూ సీరియస్ ముఖంతో కనిపించే కిమ్.. నవ్వుతూ కనిపించాడు. సైనిక పరేడ్‌లో ఎప్పుడూ లేని విధంగా కిమ్ కనిపించాడు. ఎంతో ఉత్సాహంగా సైనికుల పరేడ్‌ను తిలకించాడు. కిమ్ ఒకప్పుడు 140 కిలోల బరువు ఉండేవాడు. ఇప్పుడు 100కు చేరువయ్యాడని తెలుస్తోంది. కిమ్ తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడని.. కిమ్ చికిత్స పొందుతున్నట్లు చర్చ నడుస్తోంది.
ఉత్తర కొరియా 73 వ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ దేశ సైన్యం పరేడ్ నిర్వహించింది. హజ్మత్ సూట్‌లో సైన్యం రాత్రి పూట పరేడ్ చేసింది. నారింజ రంగులో హజ్మత్ సూట్‌లో పరేడ్ చేస్తున్న ఉత్తర కొరియా సైన్యం ఫొటోలను మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. ఎలాంటి క్షిపణులనుగానీ, ఇతర సాంకేతిక పరికరాలనుగానీ ప్రదర్శించలేదని మీడియా నివేదించింది. ఆరేంజి రంగు హజ్మత్ సూట్‌లను ధరించి కవాతు చేస్తున్న సైన్యం ఫొటోలను అధికార వర్కర్స్ పార్టీ పత్రిక రోడాంగ్ సిన్మున్ ప్రచురించింది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఉత్సవాలకు హాజరైన అధికారులతోపాటు ప్రజలు కూడా మెడికల్ గ్రేడ్ మాస్కులు ధరించారు. కిమ్ కూడా సైన్యాన్ని ఉద్దేశించి ఎలాంటి ప్రసంగం చేయలేదని తెలుస్తోంది.