More

    ఏడుగురికి బహిరంగ మరణశిక్ష విధించిన కిమ్.. కారణం ఏమిటంటే..!

    ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ పాలన గురించి కంటే.. అతడు వేసే శిక్షల గురించే ప్రపంచ దేశాలు ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాయి. చిన్న చిన్న తప్పులకు కూడా భారీ శిక్షలు ఉంటాయి. ఉత్తర కొరియా శత్రుదేశమైన దక్షిణ కొరియాకు చెందిన వీడియోలను చూసినందుకు గాను ఏడుగురికి బహిరంగ మరణశిక్ష విధించాడనే వార్త ఇప్పుడు ప్రపంచాన్ని షాక్ కు గురి చేస్తోంది. ‘కిమ్ జాంగ్ ఉన్ పాలనలో హత్యలు: అంతర్జాతీయ ఒత్తిడితో ఉత్తర కొరియా ప్రతిస్పందన’ పేరుతో సియోల్ కేంద్రంగా ఉన్న ట్రాన్షినల్ జస్టిస్ వర్కింగ్ గ్రూప్ (టీజేడబ్ల్యూజీ) అనే మానవహక్కుల సంస్థ జరిపిన అధ్యయనంలో ఈ విషయం బయటకు వచ్చింది. దక్షిణ కొరియాకు చెందిన ఎటువంటి వీడియోలను కూడా తమ దేశ ప్రజలు చూడకూడదని చెబుతూ ఉంటారు.. ఇక పాప్ వీడియోలను చూస్తే ఇక అంతే సంగతి.

    టీజేడబ్ల్యూజీ తన అధ్యయనంలో భాగంగా ఉత్తర కొరియా నుంచి పారిపోయి వచ్చిన 683 మందిని ఇంటర్వ్యూ చేసి కిమ్ హయాంలో ఇప్పటి వరకు 23 హత్యలపై నివేదిక రూపొందించింది. మాదక ద్రవ్యాల సరఫరా, వ్యభిచారం, మానవ అక్రమ రవాణా వంటి నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో మరణశిక్షలు విధించినట్టు పేర్కొంది. దక్షిణ కొరియాకు చెందిన పాప్ సినిమా, పాప్ వీడియోలను విక్రయిస్తున్నారన్న ఆరోపణలతో ఈ ఏడాది మే నెలలో ఓ వ్యక్తికి మరణశిక్ష విధించగా, దక్షిణ కొరియా వినోద కార్యక్రమాలున్న సీడీలు, డ్రైవ్‌లు విక్రయిస్తున్నారన్న నెపంతో 2012-14 మధ్య కాలంలో ర్యాంగాంగ్ ప్రావిన్సులోని హైసన్‌కు చెందిన ఆరుగురికి మరణశిక్ష విధించినట్టు టీజేడబ్ల్యూజీ తన నివేదికలో వెల్లడించింది. 2015లో మరో వ్యక్తికి కూడా మరణశిక్ష అమలు చేసింది. మరణశిక్షను అమలు చేస్తూ దానిని వారి కుటుంబ సభ్యులకు కూడా చూపించారట..!

    ఇక ఇటీవల నెట్ ఫ్లిక్స్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ను యూఎస్‌బిలో చైనా ద్వారా స్మగ్లింగ్ చేస్తున్నందుకు ఉత్తర కొరియాకు చెందిన వ్యక్తికి మరణశిక్ష విధించారు. ఆ సిరీస్ ను చూసినందుకు ఏడుగురు హైస్కూల్ విద్యార్థులు కూడా కఠిన శిక్షలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఒక వ్యక్తి చైనా వెళ్లినప్పుడు స్క్విడ్‌ గేమ్‌ను యూఎస్‌బీ డ్రైవ్‌లో ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత స్వదేశానికి వచ్చిన తర్వాత దాన్ని చూశాడు. అతనితో పాటు దానిని చూసిన మరో ఆరుగురికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించబడింది. ఉపాధ్యాయులు మరియు పాఠశాల నిర్వాహకులను కూడా విధుల నుండి తొలగించారు. గనులలోని మారుమూల ప్రాంతాలలో పని చేయడానికి వారిని పంపించారు. ఇతర దేశాలకు సంబంధించిన షోలను అసలు చూడకూడదని కిమ్ నియమాలను విధించాడు. ఎవరైనా విదేశీ ప్రసారాలను చూస్తూ లేదా వింటూ పట్టుబడితే, వారు కఠినమైన శిక్షలను ఎదుర్కొంటారు. ఉత్తర కొరియాకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్, నిఘా బ్యూరో సంస్థ ఉంది, ఇది అక్రమంగా వీడియోలను చూసేవారిని పట్టుకుంటుంది. కొన్ని దేశాలకు సంబంధించిన మీడియా, వీడియోలను వీక్షించడం, ఉంచడం లేదా పంపిణీ చేసినందుకు గరిష్టంగా మరణశిక్ష విధిస్తారు.

    Trending Stories

    Related Stories